అధికారం కోసం మోడీ పాట్లు

Apr 16,2024 06:07 #Articles, #edite page

ఏప్రిల్‌ 19 నుండి జూన్‌ 1వ తేదీ వరకు భారత పార్లమెంటుకు 18వ దఫా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమి… ప్రధాన ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ వేదిక ఎన్నికలలో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ప్రధాని మోడీ ప్రచార తీరు, బిజెపి ప్రభుత్వ చర్యలు, ఆ పార్టీ నాయకుల తీరు చూస్తే వారి మీద వారికే విశ్వాసం లేదని స్పష్టమౌతున్నది. అందువల్లనే అనవసరమైన వివాదాలను రేకెత్తించి, ప్రజలను విభజించటం ద్వారా ఓట్లు, సీట్లు పొందటానికి ప్రయత్నం చేన్తున్నారు. దానిలో భాగంగానే…మొదటి దశ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో కచ్చతీవు ఒప్పందంపై దాడి చేయటానికి ప్రధాని మోడీ పూనుకున్నారు.

కచ్చతీవు వివాదం
భారత్‌-శ్రీలంకల మధ్య 1974లో జరిగిన ఒప్పందంలో కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ద్వైపాక్షిక ఒప్పందాలను వివాదాస్పదం చేస్తే దేశానికి వాటిల్లే నష్టాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రధాని మోడీ ఇపుడు ఎన్నికలలో ప్రయోజనం పొందటం కోసం ఆ ఒప్పందంపై దాడి చేస్తున్నారు. తమిళనాడులో బిజెపి ఎన్నికల ప్రచారంలో దీనిని ఒక ప్రధానాంశంగా చేసుకున్నారు.
కచ్చతీవు దీవి భారత్‌-శ్రీలంకల మధ్య పాక్‌ జలసంధిలో ఉంది. దీని విస్తీర్ణం 285 ఎకరాలు. పొడవు 1.6 కిలోమీటర్లు. వెడల్పు 300 మీటర్లు. ఇది భారత దేశంలోని రామేశ్వరం-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలోని నెడున్‌తీవుకు సమీపంలో ఉన్నది. నిర్జనమైన ఈ దీవి చుట్టుపక్కల భారత-శ్రీలంక తమిళ జాలరులు చేపలు పట్టుకొంటుండేవారు. చరిత్రను చూస్తే 1187లో శ్రీలంకను పాలించిన నిశ్శంకమల్లా ఆధీనంలో ఈ దీవి ఉన్నదని నాటి శాసనాలు వెల్లడిస్తున్నాయి. మధ్యయుగాలలో పంబన్‌ దీవితో పాటు కచ్చతీవు దీవి కూడా జాఫ్నా రాజుల ఆధీనంలో ఉంది. 17వ శతాబ్దంలో మధురై కేంద్రంగా ఉన్న రామనాథ్‌ రాజ్యంలో భాగంగా ఉంది. తర్వాత డచ్‌, పోర్చుగీసు, బ్రిటీష్‌ పాలనలో ఉంది. బ్రిటిష్‌ పాలనా కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. 1920 తర్వాత బ్రిటిష్‌ వారు దీనిని తమ నౌకాదళాల విన్యాసాలలో వినియోగించుకున్నారు. ఆ సమయంలో భారతదేశం-శ్రీలంకల మధ్య కచ్చతీవుకు సంబంధించిన వివాదం ముందుకొచ్చింది. అది రాజా రామ్‌నాధ్‌ రాజ్యంలో భాగంగా ఉంది కాబట్టి తమకు చెందుతుందని భారతదేశం వాదించగా, దీనిని వ్యతిరేకిస్తూ ఆ దీవిలో ఉన్న సెయింట్‌ ఆంథొనీ చర్చి జాఫ్నా బిషప్‌ ఆధీనంలో ఉన్నదని, కాబట్టి ఆ దీవి శ్రీలంకకు చెందుతుందని హార్స్‌బర్గ్‌ వాదించాడు. కచ్చతీవును శ్రీలంక పరిధిలోకి వచ్చే విధంగా సరిహద్దును నిర్ణయిస్తూ 1921లో ఉభయ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 1974 వరకు ఈ దీవిపై యాజమాన్యం వివాదంగానే ఉంది.
పాక్‌ జలసంధిలో సముద్ర సరిహద్దులను నిర్ణయించు కోవటంలో భాగంగా 1974లో భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన ఒప్పందంలో కచ్చతీవును శ్రీలంక భూభాగంగా భారత ప్రభుత్వం అంగీకరించింది. 1976లో జరిగిన మరో ఒప్పందంలో ఒక దేశపు సముద్ర జలాలలో మరో దేశపు జాలర్లు చేపలు పట్టుకోవటాన్ని నిషేధించారు. భారతదేశపు జాలర్లు కచ్చతీవులో చేపలు పట్టటం, వలలను ఆరబెట్టుకోవటం చేసుకోవచ్చునని ఒప్పందంలో పేర్కొన్నారు. తర్వాత శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోత, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు వీటిని క్రమంగా కుదించేలా చేశాయి. తమకున్న అవకాశాలను యథావిధిగా ఉంచాలని తమిళనాడులోని జాలర్లు ఆందోళనలు చేశారు. ఉభయ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిందనేది చారిత్రక వాస్తవం.
వివిధ అంశాలకు సంబంధించి దేశాల మధ్య ఈ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరగటం సహజం. మన దేశం శ్రీలంకతోనే కాకుండా బంగ్లాదేశ్‌తో కూడా ఇటువంటి ఒప్పందమే చేసుకుంది. మన దేశానికి చెందిన కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు లీజుకిస్తూ 1992లో ఆనాటి ప్రభుత్వం ‘తీన్‌ బిఘా’ ఒప్పందం చేసుకుంది. అంతకు ముందు గంగానదీ జలాల పంపకం, ఫరక్కా బ్యారేజి నుండి బంగ్లాదేశ్‌కు వెళ్ళాల్సిన ప్రవాహం తదితరాలపై ఒప్పందాలు చేసుకున్నారు. భూ, జల వివాదాలు మనకు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితోనూ ఉన్నాయి. చైనా, పాకిస్తాన్‌లతో భూ వివాదం ఉంది. పాకిస్తాన్‌, మన దేశం సింధు నదీ జలాలను పంచుకుంటున్నాయి. ప్రధాని స్థాయిలోని వ్యక్తి ఇరుగుపొరుగు దేశాలతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొంటూ పోవాలి కాని కొత్త వివాదాలను సృష్టించటం తగునా? ఇటువంటి వివాదాలను రేకెత్తిస్తే అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట తగ్గుతుంది. చుట్టుపక్కల దేశాలలో మనపై విశ్వాసం పోతుంది. మోడీ, బిజెపి నిర్వాకంతో ఇప్పటికే మాల్దీవులలో మనకున్న స్థానాన్ని కోల్పోయాం. బంగ్లాదేశ్‌ అంతర్గత వ్యవహారాలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని అక్కడ భారత వ్యతిరేకత పెరుగుతున్నది. గతంలో నేపాల్‌లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశంలోని అడవులు, కొండలు, గనులు, సాగుభూములు, నదులు, సముద్రాలు సమస్త సంపదలను దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్న మోడీ కచ్చతీవు గురించి మాత్రం కపట ప్రచారం చేస్తున్నారు.

కచ్చతీవుపై ఇప్పుడే కళ్ళు తెరిచారా?
2014, 2019 సంవత్సరాలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కచ్చతీవు ప్రస్తావన తీసుకురాని మోడీ ఈ ఎన్నికలలోనే ఎందుకు తెస్తున్నారు? దేశ ప్రజలలో బిజెపి పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నదని, తమ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మోడీకి అర్ధమౌతున్నది. 2014 ఎన్నికలలో ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత, అవినీతి కుంభకోణాలను అధికార సోపానాలుగా మోడీ ఉపయోగించుకున్నారు. 2019లో మోడీ ప్రభుత్వ అసమర్ధత వలన పుల్వామాలో సైనికులపై తీవ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో మరణించిన సైనికులను మెట్లుగా ఉపయోగించుకుని మోడీ అధికారానికి వచ్చారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికలలో మోడీకి అటువంటి అవకాశాలు ఏవీ కనిపించటం లేదు. అందువలన ఓట్లు, సీట్లు రావటానికి ఉపయోగపడుతుందని కచ్చతీవు ఒప్పందాన్ని తవ్వితీస్తున్నారు.
అవసరానికి అనుగుణంగా మాట్లాడటంలో మోడీ అందెవేసిన చెయ్యి. కచ్చతీవు ఒప్పందం వలన తమిళులకు అన్యాయం జరిగిందని ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్న మోడీ… శ్రీలంకలో జరిగిన హత్యాకాండ నుండి తప్పించుకొని భారతదేశానికి వలస వచ్చిన తమిళులకు పౌరసత్వ సవరణ చట్టంలో పౌరసత్వం ఇవ్వటానికి అంగీకరించలేదు. మతం పేరుతో హింసాకాండ జరిగిన దేశాలుగా ప్రభుత్వం పేర్కొన్న పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల కన్నా ఈ కాలంలో శ్రీలంకలో తమిళులపై ఎక్కువ హింసాకాండ జరిగింది. అయినప్పటికీ హిందూత్వను ముందుకు తీసుకుపోవటానికి, దేశాన్ని మతపరంగా విభజించటానికి శ్రీలంక తమిళులు ఉపయోగపడరు కాబట్టి వారికి పౌరసత్వం ఇచ్చే అంశాన్ని సిఎఎలో చేర్చలేదు. ఇపుడు ఓట్లు దండుకోవటానికి ఉపయోగపడతారు కాబట్టి తమిళుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. మోడీ అవకాశవాదానికి హద్దు ఉన్నదా?
అయితే ఇటువంటివి తనను రక్షించలేవని మోడీకి తెలుసు. అందుకే కచ్చతీవు వివాదాన్ని కొనసాగిస్తూనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడులను తీవ్రం చేశాడు. ప్రస్తుతం దేశంలోని రెండు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. వారిపైన అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు. అయినప్పటికీ అంతులేని విచారణలతో వారికి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలను గుప్పెట్లో పెట్టుకొని, ప్రతిపక్షాలను అన్ని విధాలుగా వేధిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్న మీడియా గొంతు నొక్కుతున్నారు. చివరకు ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేయటం, అసాధారణ పెనాల్టీలు విధిస్తున్నా ఎన్నికల కమిషన్‌ కబోధి వలె వ్యవహరిస్తున్నది.
అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న అవకాశవాద, అబద్ధాల ఫ్యాక్టరీ బిజెపి అండ్‌ కో కు బుద్ధి చెప్పడానికిదే మంచి సమయం మితృలారా!

ఎ. కోటిరెడ్డి

➡️