తప్పేం కాదు!

May 10,2024 05:32 #editpage

‘ఈ’ పార్టీ అధినేత డబ్బారావు నాలుక కొరుక్కున్నాడు. ఎన్నికల ప్రచారం కీలక ఘట్టంలో ఇలాంటి తప్పు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ దెబ్బతో తన ఫేం, ఫాం, గెలుపు అవకాశాలు ఢాం అంటాయేమోనని ఒక్కటే గుబులైపోతోంది. ఎక్కడా ‘ఆ’ పార్టీ దిబ్బారావు కన్నా వెనుకబడకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. పైగా ఎన్నికలయ్యే దాకా నిజం చెప్పనని శకుని మీద ఒట్టేసుకున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తను ఇలా పెద్ద తప్పు చేసినందుకు ఇంకా గాఢమైన భాషలో తిట్టుకున్నాడు. ప్రచారం నుండి వస్తూనే ఇంట్లో సోఫాలో కూలబడ్డాడు.
చేతులు నులుముకుంటూ వచ్చిన సెక్రెటరీ మౌనంగా నిలబడ్డాడు. డబ్బారావు గుర్రుగా చూశాడు ‘ఇదంతా నీవల్లే’ అన్న అర్థంతో. సెక్రెటరీ వెర్రిచూపులు చూశాడు ‘నీ మూగ భాష నాకేం అర్థం కాలేదు’ అన్నట్టుగా.
ఇంక లాభం లేదని నోరు తెరిచి ”ఇదంతా నీవల్లే అయ్యింది. నువ్వు అన్నీ చూసుకోవాలి కదా”
”ఏమైంది సార్‌. మీటింగ్‌ బాగా జరిగింది. అందరికీ బిర్యానీ పొట్లాలు అందాయి. అందరూ హ్యాపీయే కదా”
”వాళ్ళు హ్యాపీ కావొచ్చు. మన జనాలే కాబట్టి. ఇపుడు సోషల్‌ మీడియా, రేపు ప్రింట్‌ మీడియా, ఎల్లుండి ‘ఆ’ పార్టీ మనల్ని చెడుగుడు ఆడదా? మనం జనం దృష్టిలో ఫూల్స్‌ అయి ఓడిపోమా?”
”అసలేమైంది సార్‌. నాకేమీ తెలియడం లేదు.”
డబ్బారావు గందరగోళంలో పడ్డాడు. ‘వార్నీ. వీడికింకా జరిగిన తప్పు కూడా తెలియలేదన్నమాట. వీడికి చెప్పి లాభం లేదు. నా బాధేదో నేనే పడడం బెస్ట్‌’ అనుకున్నాడు.
వాట్స్‌అప్‌ తెరిచాడు. సకల బూతులు ప్రవహిస్తున్నాయి. కానీ తన ‘తప్పు’ గురించి ఏమీ లేదేంటీ. ఒక ట్రోల్‌కి కూడా కొరగాకుండా పోయానా అని కాసేపు మదనపడి జరిగింది మంచికేలే అని సమాధాన పడ్డాడు.యూ ట్యూబ్‌లోనూ అదే ధోరణి. జనరల్‌గా బూతులు తప్పితే ప్రత్యేకించి ప్రస్తావన లేదు. రాత్రంతా కునుకు లేకుండా కూర్చుని వాట్సాప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ మార్చి మార్చి చూశాడు.
మరునాడు పేపర్‌లోనూ అదే ధోరణి. చిన్న తప్పునైనా పట్టుకుని, దాన్ని పెంచి పెద్దది చేసి, పీకి పాకం పట్టే ఎగస్పార్టీ కూడా మౌనమే. డబ్బారావుకి భయం తగ్గిపోయి, క్యూరియాసిటి ఎక్కువైంది. ఈ నగరానికి ఏమైంది తరహాలో.
శ్రీమతి ఉదయాన్నే కాఫీ కప్పు చేతిలో పెట్టింది.
”చూశావోరు. నిన్న అంత పెద్ద తప్పు చేశానా, ఎవడూ పట్టించుకోలేదు. అదే అర్థం కావడం లేదు. భయపడి చచ్చాననుకో”
”చూశాను. అంతా మామూలే కదా. మొదటి అరగంటా బూతులు, తర్వాత తిట్లు, శాపనార్థాలు చివర్లో మీ గొప్పలు.”
”అయితే నువ్వు కూడా గమనించలేదన్న మాట. నేను పొరపాటున ఎగస్పార్టి ‘ఆ’ పార్టీ మ్యానిఫెస్టో చదివేశాను. తర్వాత చూసుకున్నాను.”
”అదెలా అఘోరించారు?”
”మనదీ, వారిదీ రెండూ పట్టుకున్నాను. వారిది పై పేజీ చిరిగి ఉండడం వల్ల మనదే అనుకున్నాను. చదివేశాను. అయినా ఎవడూ గుర్తుపట్టలేదేం?”
”ఏం తేడా ఏడ్చి చచ్చింది. రెండూ ఒకే కాపీలా ఉంటేను”
”పుసుక్కున అలా అనేశావేం? వాళ్ళు ఇస్తామన్న దానికి ఓ పదో, ముప్పయ్యో ఎక్కువేసి ఇస్తానని హామీలు రాశాను కదా!”
”ఆ సొదలన్నీ ఎవడు వింటాడు. ఏదో మర్యాదకి వింటున్నట్టు నటిస్తాడు కానీ” అంటూ తేల్చేసింది.
”అది కాదోరు. వినేవాడు ఒక్కడైనా తేడా చూడకపోయి ఉంటాడా…?” డబ్బారావు మాట పూర్తి కాకుండానే ఆయన్ని గుంజి మామగారున్న గదికి తీసుకెళ్ళింది. ‘ఇదిగోండి మీకు ఆన్సర్‌ ఇక్కడ దొరుకుతుంది’ అన్నట్టు.
ఎప్పుడూ విచారంగా, డల్‌గా ఉండే ఆయన చేతిలో పుస్తకం చదువుతూ పగలబడి నవ్వుతున్నాడు. కోడల్ని చూసి ‘మాంచి కామెడీ పుస్తకం ఇచ్చావమ్మా. భలేగుంది.’ అన్నాడు. అది ‘ఈ’ పార్టీ మ్యానిఫెస్టో.
ఉపసంహారం: డబ్బారావు బహిరంగంగా చేసిన తప్పు అలా బయట పడకుండానే ఉండిపోయింది. ఎవ్వరికీ తెలియలేదు. చెప్పడం వల్ల భార్యకి తప్ప. పైపేజీ చింపింది తన కూతురు. కాగితప్పడవ చేసుకోడానికి.
– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, 9440836931

➡️