ఎన్నికల ఆటలో పోలవరం

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టును నాలుగు ప్రధాన పార్టీల అవకాశవాద రాజకీయ క్రీడ ప్రశ్నార్ధకం చేసింది. ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, బతుకులను ధారబోసిన లక్షలాది గిరిజనుల, ఇతర ప్రజానీకాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఎన్నికలొచ్చిన ప్రతిసారి, అటకెక్కించిన పోలవరం హామీకి బూజు దులిపి ప్రచారంలో పెట్టడం బిజెపి, టిడిపి, జనసేన, వైసిపిలకు రివాజుగా మారింది. రాష్ట్ర విభజన అనంతరం మూడవ మారు జరుగుతున్న ఈ ఎన్నికల్లోనూ పోలవరాన్ని వ్యూహాత్మక చర్చనీయాంశం చేయబూనాయి సదరు నాలుగు పార్టీలు. అందులో ముందున్నది బిజెపి, ప్రధాని మోడీ. 2014లో టిడిపి, జనసేనతో కూటమి కట్టిన మోడీ, పోలవరాన్ని నిర్మిస్తామని వాగ్దానం చేశారు. మధ్యలో కూటమికి చెల్లుచీటి ఇచ్చి, పదేళ్ల తర్వాత మళ్లీ అదే మూడు పార్టీల జట్టుకు నాయకత్వం వహిస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి తనది పూచీ అని, రాష్ట్ర ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నానని ఒక పత్రికా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉండి, విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పూర్తి కాకపోవడానికి బాధ్యత ఎవరిది? ఆ మాత్రం సోయి లేకుండా మరొకసారి తమ కూటమికి ఓట్లేస్తే బాధ్యత తీసుకుంటాననడం రాష్ట్ర ప్రజలను మోసగించడం కాదా?
పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లిచ్చిందని ఘనంగా సెలవిచ్చారు మోడీ. ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.55 వేల కోట్లు కావాలి. స్క్రీనింగ్‌ తర్వాత రూ.47 వేల కోట్లన్నారు. జాతీయ ప్రాజెక్టు అయ్యాక దశాబ్దకాలంలో కేంద్రం అనేక దఫాలలో విడుదల చేసిన రూ.15 వేల కోట్లు ఏ మూలకు? ఇంతటి ఘన చరిత్ర పెట్టుకొని భవిష్యత్తులో ప్రాజెక్టు పూర్తికి తనది గ్యారంటీ నమ్మమంటున్నారు. కాగా సోమవారంనాటి ఎన్‌డిఎ ఎన్నికల బహిరంగసభల్లో ఆ గ్యారంటీ సైతం మోడీ ఇవ్వలేదు. పోలవరం నిర్మాణంపై వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న రాజకీయ విమర్శకే పరిమితమయ్యారు. పోలవరంపై మోడీ సర్కారుది మొదటి నుంచీ వంచనే. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రెండేళ్ల వరకు ఆ ఊసెత్తలేదు. 2016 సెప్టెంబర్‌లో కేంద్రమే పూర్తి నిధులు భరిస్తుందని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేశాకనే నిర్మాణ పనులు మొదలయ్యాయి.
గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలు తమ అవకాశవాద, రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకు పోలవరాన్ని వాడుకున్నాయనడానికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. కేంద్రం చేయాల్సిన పోలవరం నిర్మాణ పనులను చేజెక్కించుకునే టిడిపి సర్కారు ప్రత్యేక హోదాను వదిలేసుకుందనడానికి అప్పటి పరిణామాలతో అర్థమవుతుంది. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ అని బిజెపి చెప్పి ఆచరణలో ఏమీ ఇవ్వకపోయినా నాలుగేళ్లపాటు ఎన్‌డిఎలో, కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కొనసాగింది. చివరి ఏడాదిలో కేంద్రం మోసం చేసిందని బయటికొచ్చారు. వీధుల్లో ఆందోళనలూ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే బిజెపి కూటమిలో చేరారు. జససేన సైతం రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని పొత్తుకు కటీఫ్‌ చెప్పింది. ఐదేళ్లల్లో వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్లు, డయాఫ్రంవాల్‌ అని పోలవరాన్ని చుట్టచుట్టేసింది. కేంద్రం నుంచి నిధులు సాధించింది లేదు. బిజెపి, టిడిపి, వైసిపి వైఖరులతో సమిధలైంది నిర్వాసితులు. డ్యామ్‌ పనులు తప్ప సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను పట్టించుకోలేదు. మోడీ ఇచ్చానంటున్న నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరాయి. నిర్వాసితుల రూ.33 వేల కోట్ల పరిహారం కోసం ప్రజలపై సెస్సు వేస్తాం, బిచ్చమెత్తి సమీకరిస్తామంటూ త్యాగధనులను పవన్‌ కళ్యాణ్‌ అపహాస్యం చేయడం గర్హనీయం. బాబు ప్రభుత్వం పోలవరాన్ని ఎటిఎంలా వాడుకుందని గత ఎన్నికల సందర్భంగా ఆరోపించిన మోడీ, ఇప్పుడు వైసిపి సర్కారుకు ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని, అవినీతి జరిగిందని చెబుతున్నారు. పైనున్న బిజెపి సర్కారు అండ ఉండబట్టే టిడిపి, వైసిపి అవినీతి నిర్విఘ్నంగా సాగిందన్నది ప్రజల భావన. పోలవరంపై బిజెపిది నయవంచన అని ఈ పూర్వరంగంలో తెలుస్తుంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన, బిజెపితో లోపాయికారీ సంబంధాలు నెరిపిన వైసిపి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఏ ఎండకా గొడుగు పడుతూ స్వలాభమే పరమావధిగా వైఖరులు మార్చుకొనే పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.

➡️