ఏయూ తెలుగు శాఖకు వన్నె తెచ్చిన ప్రొ|| జర్రా

May 18,2024 05:45 #editpage

ఆంధ్రా యూనివర్శిటీకి ఇటు ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల నుంచి నిత్యం జనం వస్తుంటారు. అటు గోదావరి పరీవాహక అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీ విద్యార్థి సందర్శకుల తాకిడి కూడా వుంటుంది. వీరందరికీ ఆచార్య జర్రా అప్పారావు అందుబాటులో వుంటారు. పరిశోధనా పరంపరలో భాగంగా కొందరు, జనజీవన సమస్యల పరిష్కారాల కోసం మరికొందరు ప్రొ|| జర్రా మార్గదర్శనం కోసం వస్తుంటారు. ఎందుకింత స్పష్టంగా చెప్పాల్సి వస్తుందంటే, ఆదివాసీలను తీర్చిదిద్ది ప్రధాన స్రవంతిలో ప్రతిభావంతులుగా నిలబెట్టాలనే పట్టుదల ఈయనది.
దండకారణ్యంలో పలకాబలపం పట్టి కొండలు, లోయలు దాటి ఆంధ్రా యూనివర్శిటీలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత యుజిసి ఫెలోషిప్‌తో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో పిహెచ్‌డి పట్టా పొందారు. అనంతరం జీవిక కోసం చాలా ఉద్యోగాలు చేసి చివరిగా ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా స్థిరపడ్డారు. ఇప్పటికి ఈయన సుమారు 72 పిహెచ్‌డి పరిశోధనలకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఆదివాసీ విజ్ఞానం, ఢిల్లీ మజిలీలు, వచనవాఙ్మయ వీచిక తదితర గ్రంథాలను వెలువరించారు. వివిధ పత్రికల్లో సుమారు 500 పరిశోధనా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆదివాసీ విజ్ఞానం మీద మేజర్‌ రిసెర్చ్‌ ప్రాజెక్టు పూర్తి చేశారు. వీటన్నింటి కంటే ముఖ్యమైనది సెంట్రల్‌ యూనివర్శిటీల తెలుగు శాఖ పాఠ్య ప్రణాళికను తీసుకొని దానిని యుజిసి, యుపిపిఎస్‌సి వంటి జాతీయ పరీక్షలకు అనుగుణంగా మార్చి అమలు చేశారు. ఆయన సాహిత్య సేవ కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగినది. ప్రొ||జర్రా ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు విభాగంలో ఆచార్యునిగా అడుగు పెట్టిన తర్వాత యుజిసి ఫెలోషిప్పులు సాధించే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యుజిసి పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఆయన సంబంధిత పుస్తకాలు సమకూర్చారు. నిపుణులతో శిక్షణ ఇప్పించారు.
ప్రొ|| జర్రా అప్పారావు తెలుగు విభాగాన్ని వికసింపజేయడంలో వైవిధ్యం ప్రదర్శించారు. ఆయన విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాఠ్యాంశాల బోధన, పరిశోధనలు మాత్రమే కాకుండా అనేక ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కవిత్రయం నుంచి విశ్వనాథ వరకు, గురజాడ నుంచి ఉద్యమ కవులు, భాషావేత్తల వరకు వున్న ప్రముఖుల సేవలను సమాజానికి తెలియజేస్తున్నారు. అనుబంధ కళాశాలల అధ్యాపకుల్ని, విద్యార్థులు, పరిశోధకుల్ని అందరినీ కలుపుకొని ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సాహిత్య పరిమళాల్ని అద్దుతున్నారు.

– డా|| జికెడి ప్రసాద్‌
9393111740
(నేడు ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ 2024 పురస్కారాన్ని ప్రొ||అప్పారావుకి అందిస్తున్న సందర్భంగా)

➡️