MPs : సగటు పట్టణ నివాసితుల కన్నా.. ఎంపీలు 27 రెట్లు సంపన్నవంతులు!

Jun 18,2024 19:50 #MPs assets

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో ఎక్కువశాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ప్రస్తుత ఎంపీలు సగటు పట్టణ నివాసితుల కన్నా.. 27 రెట్లు సంపన్నవంతులని లెక్కలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మొత్తం ఎంపీల ఆస్తుల విలువ 7.4 కోట్లు. దాదాపు 92 శాతం మంది ఎంపీలు కోటి రూపాయలు లేదా అంతకుమించి ఆస్తులున్నాయి. 75 శాతం మంది ఎంపీలకు మూడు కోట్ల రూపాయలు లేదా.. అంతకుమించి ఆస్తులున్నాయి. 2024లో రన్నరప్‌ అభ్యర్థుల మధ్యస్థ ఆస్తి విలువ 6.25 కోట్లు. 88 శాతం మంది ఎంపీలకు కోటి రూపాయలు లేదా అంతకుమించి ఆస్తులు ఉన్నాయి. 68 శాతం మందికి మూడు కోట్లు లేదా అంతకుమించి ఆస్తులున్నాయి.
2019 ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆస్తులు కలిగిన ఎంపీలే ఎక్కువ మంది ఉన్నారు. 2019లో గెలిచిన ఎంపీల సగటు (మీడియన్‌) ఆస్థి 4.8 కోట్లుగా ఉంది. ఇటీవల గెలిచిన ఎంపీల సగటు ఆస్థి 6.5 కోట్లుగా ఉంది. గత ఎన్నికల్లో కోటిరూపాయలకు మించి ఆస్తులు కలిగిన ఎంపీలు 95 శాతంగా ఉన్నారు. మూడు కోట్లకు మించిన అభ్యర్థులు 88 శాతంగా ఉన్నారు.
2019లో రన్నరప్‌ అభ్యర్థులు ఆస్తుల విలువ 5.4 కోట్లు. దాదాపు 85 శాతం మంది కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక 63 శాతం మంది మూడు లేదా అంతకుమించి ఆస్తుల్ని కలిగి ఉన్నారు.
2024లో టాప్‌ 27 పార్టీల అభ్యర్థుల సగటు ఆస్తులు కనీసం కోటి రూపాయలుగా ఉంది. 7.6 కోట్లు, 5.4 కోట్లు ఆస్తులు కలిగిన పార్టీలుగా బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు నిలిచాయి.
ఆల్‌ ఇండియా డెబిట్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ సర్వే – 2019 అంచనా ప్రకారం సగటు పట్టణ కుటుంబాల్లోని ఆస్తుల సగటు విలువ 27.1 లక్షలు. గ్రామీణ కుటుంబాల ఆస్తుల విలువ 15.9 లక్షలుగా ఉంది. ఈ లెక్కలతో పోల్చితే 2024లో గెలిచిన అభ్యర్థి సగటు ఆస్తుల విలువ.. పట్టణ కుటుంబ సగటు ఆస్తి కంటే 27 రెట్లు ఎక్కువ. ఇక రన్నరప్‌ అభ్యర్థి ఆస్తులు 23.1 రెట్లు ఎక్కువ.
అయితే మొత్తం గెలిచిన ఎంపీల్లో కొంతమంది కొన్ని లక్షల రూపాయల ఆస్తుల్ని కలిగి ఉన్నారు. వారిలో పశ్చిమబెంగాల్‌లోని పురూలియా నుంచి గెలిచిన బిజెపి నేత జ్యోతిర్మరు సింగ్‌ మహతో ఉన్నారు. ఈయనకి 5.95 లక్షలు ఆస్తులు ఉన్నాయి. ఆరంబాగ్‌ నియోజకవర్గం నుండి మిటాలి బాగ్‌ (టిఎంసి) 7.8 లక్షలు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్చిలిషహర్‌ నుండి ప్రియా సరోజ్‌ (సమాజ్‌వాది పార్టీ) 11.25 లక్షలు. పార్టీల పరంగా చూస్తే.. బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ (47 లక్షలు), ద పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (87), సిపిఐ(ఎం) (ఒక కోటి)లకు చెందిన అభ్యర్థులు అత్యల్ప, మీడియన్‌ ఆస్తులు కలిగిన అభ్యర్థులు ఉన్నారు. వారిలో సిపిఐ(ఎం) నుంచి గెలిచిన నలుగురు అభ్యర్థులు ఉన్నారు.

➡️