మోడీ పాలనలో మహిళల భద్రతకు తూట్లు

దేశానికి గొప్ప బలం మహిళలని…తల్లులు, సోదరీమణులు, ఆడపిల్లల అభివృద్ధికి అవసరమైన పథకాలను చేపడతామని..ఇది మోడీ హామీ అని…’స్త్రీ శక్తి మోడీ కథన్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇటీవల కేరళలోని త్రిసూర్‌ వెళ్లిన ప్రధాని అన్నారు. ఇంకేముంది మహిళా సాధికారతకు మోడీ ఇచ్చిన హామీ అంటూ మీడియా కథనాలను వండి వార్చింది.

అయితే…ఈ సందర్భాన్ని మీడియా పండుగ చేసుకుంటుండగానే… ప్రధాని లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బనారస్‌ హిందూ యూనివర్శిటీకి చెందిన 20 ఏళ్ల ఐఐటి విద్యార్థినిపై అత్యాచారం చేసి, వివస్త్రను చేసి వీడియో రికార్డ్‌ చేసిన వ్యక్తులను రెండు నెలల తర్వాత అరెస్టు చేశారు. బిజెపి నేతృత్వంలోని వారణాసి మహానగర్‌ ఐటీ సెల్‌ కన్వీనర్‌ కునాల్‌ పాండే, కో-కన్వీనర్‌ ఎస్‌. పటేల్‌, ఐటీ టీమ్‌ సభ్యుడు అభిషేక్‌ చౌహాన్‌ (ఆనంద్‌) లను అరెస్టు చేశారు. ప్రధాని నియోజకవర్గంలోని అధికార పార్టీ ఐటీ సెల్‌ రేపిస్ట్‌ సెల్‌గా మారిపోయింది.

పెద్దల పంచన …

నవంబర్‌ 1వ తేదీ అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో, ఆ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్‌లో నడుచుకుంటూ వెళుతుండగా బయటి నుంచి మోటార్‌ బైక్‌పై వచ్చిన ముగ్గురు ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి చిత్రహింసలు పెట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మరుసటి రోజే విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లోనే నిందితుడిని బాలిక గుర్తించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాగా, ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్‌ వెళ్లి అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారం ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గంలోనే దారుణమైన లైంగిక వేధింపులు జరిగినా ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదు. తాను బాధితురాలి పక్షాన ఉన్నట్లు తెలిపేలా మోడీ ఎలాంటి సంకేతమూ ఇవ్వలేదు. చర్యా చేపట్టలేదు. గోడీ మీడియా కూడా ఈ విషయాన్ని లోకానికి తెలియకుండా దాచిపెట్టేందుకు పోటీ పడింది. అయితే, కునాల్‌ పాండే, ఎస్‌ పటేల్‌ విమానాశ్రయంలో ప్రధానికి పూలమాలలతో స్వాగతం పలికిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వచ్చాయి. అంతేగాక కునాల్‌ పాండే…ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో ఉన్న ఫొటోలు కూడా బయటపడ్డాయి. నిందితులకు బిజెపి కేంద్ర, రాష్ట్ర నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఈ చిత్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రేపిస్టులు హై-సెక్యూరిటీ ప్రధానమంత్రికి దగ్గరయ్యేంతగా కనెక్ట్‌ అయ్యారనే వాస్తవాన్ని కూడా ఈ చిత్రాలు తెలియజేస్తున్నాయి. ఏ ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలోనైనా ఇలాంటి ఘటన జరిగిందంటే మోడీ, యోగి, స్మృతి ఎంత రగడ చేసేవారో ఊహించవచ్చు. నిందితులు ఏదైనా మైనారిటీ వర్గానికి చెందిన వారైతే, వారి మీద ఉగ్రవాద నిరోధక చట్టం ప్రయోగించబడుతుంది. ఈ కేసుకు సంబంధించి మాత్రం పోలీసు వర్గాలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మీడియా ఈ సంఘటనను కప్పిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

‘సిగ్గుపడే ఘటన….’

మే 2023లో మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి తుపాకీతో చిత్రహింసలకు గురిచేసినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహించాయి. ఈ వార్త ప్రపంచమంతటా తెలిసి, భారతదేశ ప్రతిష్ట మంటకలిసినంత పనైంది. అప్పుడు పార్లమెంటు వార్షిక సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి మాత్రమే అత్యంత సాధారణంగా స్పందించారు. ”ఇది 140 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడే సంఘటన. దోషులను విడిచిపెట్టేది లేదు” అన్నారు. అల్లర్లు జరిగిన ఎనిమిది నెలల తర్వాత కూడా మణిపూర్‌లో పర్యటించాలని మోడీ అనుకోలేదు. హోంమంత్రి అమిత్‌ షా ఒక్కసారి మాత్రమే వెళ్లారు. మణిపూర్‌లో వేధింపులకు గురైన మహిళల పట్ల ఉదాసీనత అనేక సందర్భాలలో కొనసాగుతున్నది.

…వేటగాళ్ల పక్షమే!

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, బాధితుల నిరసనలు మరో అంకం. ఈ విషయమై ఢిల్లీలో రెజ్లర్లు రెండుసార్లు నిరసన తెలిపినా ప్రభుత్వంలో ఇసుమంత కదలిక కూడా లేదు. యు.పి లోని కైసర్‌గంజ్‌ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు అతనిని అరెస్ట్‌ చేయలేదు. ఒలింపిక్స్‌తోపాటు ప్రపంచ పోటీల్లో భారత్‌కు బంగారు, రజత, కాంస్య పతకాలు అందించిన రెజ్లర్ల ఫిర్యాదులను పట్టించుకోనేలేదు. బ్రిజ్‌ భూషణ్‌ లేదా అతని మద్దతుదారులు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఉండరని అమిత్‌ షా చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించిన తర్వాత, సాక్షి మాలిక్‌ రెజ్లింగ్‌ మ్యాచ్‌ల నుండి వైదొలిగారు. బజరంగ్‌ పునియా, వినేష్‌ ఫోగట్‌ తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామన్నా…స్పందనే లేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ…ఆడపిల్లలను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తామంటూ…ఇది మోడీ హామీ అంటూ త్రిసూర్‌లో పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు.

బాధితుల పట్ల నిలువెత్తు నిర్లక్ష్యం

ఉన్నావో బాలికపై అత్యాచారం-హత్య కేసు యు.పి లోనే మరో సంచలనం. 2017లో బిజెపి నేత, ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సంగర్‌ 17 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసు కూడా ఉంది. రెండేళ్ల తర్వాత రారుబరేలీ కోర్టులో విచారణ నిమిత్తం బాలిక కుటుంబ సభ్యులతో వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు ఆమెను అడ్డుకుని నిప్పంటించారు. బాలికకు 90 శాతం కాలిన గాయాలు కాగా, ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించినప్పటికీ రక్షించలేకపోయారు. సంగర్‌పై సాక్ష్యం చెప్పినందుకు ప్రతీకారంగా అమ్మాయి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపారు. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగానే మరణించాడు. మరో ఘటనలో…బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న ప్రమాదంలో బాలిక గాయపడింది. ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. దాంతో బాలిక హత్యకు జరిగిన కుట్ర ఇదని ఆరోపించారు. లక్నోలోని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ నివాసం ఎదుట బాలిక ఆత్మహత్యాయత్నం చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి సంగర్‌కి జీవిత ఖైదు పడింది. కానీ ఆ అమ్మాయి అప్పటికే ఈ లోకాన్ని విడిచిపెట్టింది.

రక్తమోడినా…కనికరం లేదు

2018 జనవరిలో జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ఆలయంలో జరిగిన మరో ఘోర ఉదంతం మోడీ అండ్‌ కో బాధితుల పక్షాన లేదని నిరూపించింది. ఎనిమిదేళ్ల బాలికను నలుగురు పోలీసులతో సహా ఎనిమిది మంది వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసు ఇది. దేవాలయంలో సామూహిక అత్యాచారం జరిగింది. వారం తర్వాత ఇంటికి కిలోమీటరు దూరంలో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎనిమిది మంది హిందూ నిందితులను అరెస్ట్‌ చేయడాన్ని నిరసించేందుకు బిజెపి మంత్రులు సిద్ధమయ్యారు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, బిజెపి అధికారంలో ఉన్నాయి. నిందితులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి మంత్రులు లాల్‌ సింగ్‌ చౌధురి (అటవీ శాఖ మంత్రి), చందర్‌ ప్రకాష్‌ (పరిశ్రమ) ప్రదర్శన నిర్వహించారు. సామూహిక అత్యాచారానికి గురై రక్తమోడుతున్న బాలిక పక్షాన కాకుండా…ఆ పసి శరీరాన్ని ఛిద్రం చేసిన రాక్షసుల పక్షాన బిజెపి నిలబడింది.

రేపిస్టులకు పూలమాలలు

బిల్కిస్‌ బానో! తన మూడేళ్ల కూతురును కళ్ల ముందే నరికి చంపేస్తుంటే నిస్సహాయంగా చూస్తుండి పోవాల్సి వచ్చింది. 2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు ఇరవై ఒక్క ఏళ్ల బిల్కిస్‌ బానో ఐదు నెలల గర్భవతి. క్రిమినల్‌ ముఠా ఆమె కుటుంబంలోని 14 మందిని చంపేసింది. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోడీ. ఈరోజు ఆయన ఢిల్లీ పాలనలో చక్రం తిప్పుతుండగా.. బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేసిన నేరంలో జైలుకెళ్లిన 14 మందిని విడుదల చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆజాద్‌కీ అమృత్‌ మహోత్సవ్‌గా జరుపుకుంటున్న సందర్భంగా 14 మంది రేపిస్టులను జైలులో వారి సత్ప్రవర్తనను పేర్కొంటూ విడుదల చేశారు. నిర్దోషులుగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి నిందితులను విడుదల చేశారని ‘ది హిందూ’ పత్రిక కూడా రాసింది. నిందితులు హేయమైన నేరానికి పాల్పడ్డారని, వారు దయకు అర్హులు కాదని సిబిఐ చెప్పినా గుజరాతీ అమిత్‌ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ వినలేదు. జైలు నుంచి బయటకు రాగానే బిజెపి సహా సంఘ పరివార్‌ కార్యకర్తలు పూల మాలలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. దహూద్‌కు చెందిన బిజెపి ఎంపీ జస్వంత్‌ సింగ్‌ బాబోర్‌, అతని సోదరుడు, ఎమ్మెల్యే శైలేష్‌ బాబోర్‌ ఈ రేపిస్టులలో కలిసి ప్రభుత్వ వేదికను పంచుకున్నారు. బిజెపి ఎవరి పక్షాన ఉందో పదే పదే రుజువవుతూనే వుంది.

జర్నలిస్టుతో సహా ఇద్దరిని చంపి, ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసి జైలు పాలైన గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌కు మోడీ నేతృత్వంలోని బిజెపి వత్తాసు పలుకుతోంది. నవంబర్‌ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో రామ్‌ రహీమ్‌ చేసిన సేవలకు బిజెపి 21 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. ఎన్నికలలో డేరా సచ్చా సౌదా, దాని సభ్యుల మద్దతును పొందడానికే ఇదంతా. రాజస్థాన్‌లోని గంగానగర్‌ జిల్లాలో వారి ప్రభావాన్ని ఉపయోగించుకునేందుకే ఈ పెరోల్‌. నవంబర్‌ నుంచి రామ్‌ రహీమ్‌కు అరడజను సార్లు పెరోల్‌ మంజూరైంది. భీమా కోరేగావ్‌ కేసులో స్టాన్‌ స్వామికి బెయిల్‌ రాలేదు గానీ… హంతకులు, రేపిస్టులు మాత్రం విముక్తి పొందగలిగారు.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక ధోరణి వల్లే భారతదేశం మహిళల భద్రత విషయంలో బాగా వెనుకబడి ఉంది. భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశమని థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ (2018) పేర్కొంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీనికి ప్రధాన కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ ముందున్న మనుస్మృతి. సమానత్వాన్ని నొక్కి చెప్పే భారత రాజ్యాంగానికి బదులుగా, ”మహిళలు స్వేచ్ఛకు అర్హులు కాదు” అని ప్రకటించే మనుస్మృతిని తీసుకొచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ప్రయత్నిస్తున్నాయి. మహిళలకు సభ్యత్వం లేని సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. ఈ సంస్థ మహిళలకు ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వదు. ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో మహిళలు పిల్లలను కనే యంత్రాలు మాత్రమే. ఇంక వారికి రక్షణ ఎక్కడ!

/’దేశాభిమాని’ సౌజన్యంతో/ వి.బి.పరమేశ్వరన్‌

➡️