మూడేళ్లుగా పోరాడుతున్న చిరుద్యోగులు

Jan 24,2024 07:12 #Editorial

ముఖ్యమంత్రి హామీ…బోర్డు తీర్మానం…కోర్టు ఆదేశాలు ఇవేవీ అమలు కానపుడు నోరులేని పేదవారు ఏం చేయాలి? ‘మీరిచ్చిన హామీలు అమలు చేయండి. మహాప్రభో…’ అంటూ 3 సంవత్సరాల 2 నెలలుగా వంతుల వారీగా కడుపు మాడ్చుకుని దీక్షలు చేస్తున్నారు. అయినా ఏలికలకు మనసు కరగటం లేదు.

         యాభై ఆరు నెలల జగన్మోహన్‌ రెడ్డి పాలనా కాలంలో 38 నెలలుగా నిరాహార దీక్షలు చేస్తున్న చిరుద్యోగుల సంగతి రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. వీరు చేస్తున్న పోరాటం, వారి పట్టుదల విస్మయం కల్గిస్తుంది. కేవలం 150 మంది కార్మికులు సాగిస్తున్న పోరాటానికి తిరుపతి నగరంలో సంఘీభావం వెల్లువెత్తుతున్నది. తిరుమల-తిరుపతి దేవస్థానం (టిటిడి)లో దశాబ్దాలుగా పని చేస్తున్న అటవీ కార్మికులు కోరుతున్న కోర్కెలు చాలా చిన్నవి.

ముఖ్యమంత్రి హామీ, టిటిడి బోర్డు తీర్మానం, కోర్టు ఆదేశాలు అమలుకై వీరు సాగిస్తున్న పోరాటం అధికారంలో ఉన్న వారి పట్ల విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేస్తున్నది.

ప్రభుత్వాధినేత జగన్మోహన్‌ రెెడ్డి ఇచ్చిన హామీ, బోర్డు తీర్మానాలు, కోర్టు ఆదేశాలు కొందరికి అమలు కావు. అర్హతలు లేని జూనియర్లను ఏకంగా పర్మినెంటు చేసి, సీనియర్లను విస్మరించటం ధార్మిక సంస్థ టిటిడిలో ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి కానీ, గత ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఇఓ ధర్మారెడ్డి కానీ సమాధానం చెప్పలేక పోతున్నారు.

దీని పూర్వాపరాలు తెలుసుకోవాలంటే వాస్తవం చదవాలి. సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా వ్యవహరించిన టిటిడి పెద్దలను ఏం చేయాలో సమాజం నిర్ణయించాలి.

2024 జనవరి 23 నాటికి వీరి దీక్షా కాలం 1153 రోజులు (3 సంవత్సరాల 2 నెలలు) పూర్తయింది.

30 సంవత్సరాల సర్వీసు కల్గిన టిటిడి అటవీ కార్మికులను పక్కన పెట్టి, 10 సంవత్సరాల బ్రేక్‌ ఆఫ్‌ సర్వీసు ఉన్నవారిని పర్మినెంటు చేశారు.

2005లో, 2011లలో టిటిడి యాజమాన్యం సూచనమేరకు సొసైటీలు ఏర్పరచుకున్న అటవీ కార్మికులను కాదని 2013లో వచ్చిన జూనియర్లను పర్మినెంటు చేయటం ధర్నాన్ని కాపాడాల్సిన సంస్థ చేయాల్సిన పనేనా?!

2019లో మొత్తం 362 మంది కార్మికులకు టైం స్కేలు ఇవ్వాలని బోర్డు తీర్మానించింది. ఏకపక్షంగా 162 మంది జూనియర్లను పర్మినెంట్‌ చేసి మిగిలిన 200 మంది సీనియర్లకు టైం స్కేలు కూడా ఇవ్వకుండా కార్పొరేషన్‌లో బలవంతంగా కలిపేయటం ఏపాటి ధర్మం.

కార్మికులకు జరిగిన అన్యాయంపై ‘సిఐటియు సాగిస్తున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతునివ్వాలని ఈ కార్మికులు కోరుతున్నారు.

ధర్నాన్ని రక్షించండి…ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసే తిరుమల-తిరుపతి దేవస్థానంలో అధర్మం పరాకాష్టకు చేరిందనటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి. స్వామివారిని నమ్ముకుని పని చేస్తున్న స్వామి సేవకులకు ఇంత అన్యాయం చేయవచ్చా? కేవలం ‘సిఐటియు’ యూనియన్‌లో ఉన్నారన్న కక్షపూరితమైన వైఖరి తప్ప ఇందులో ఏ న్యాయం ఉందో ఏలికలు చెప్పలేకపోతున్నారు.

‘నేను ఉన్నాను…నేను విన్నానని’ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పినప్పుడల్లా తమకు న్యాయం జరుగుతుందని పులకించిపోయిన టిటిడి అటవీ కార్మికులు తమకు జరిగిన అన్యాయంపై ప్రస్తుతం కుమిలి పోతున్నారు. అధికార పార్టీ నాయకులు కార్మికుల మధ్య చిచ్చుపెట్టి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి కోర్టుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేట్టు చేస్తున్నారు.

కోర్టు ఆదేశాలను అమలు చేయకపోగా ఈ పేద కార్మికులపై కోర్టులలో అప్పీలుకు వెళుతూ మీకు న్యాయం ఎట్లా జరుగుతుందో చుస్తామంటూ స్వయంగా ఐఎఎస్‌ లే కార్మికులతో వెటకారంగా మాట్లాడటం ఎక్కడి ధర్మం. అటవీ కార్మికులు కేవలం 200 కుటుంబాలే కావచ్చు. అధికార పార్టీ నాయకుల ఓట్ల రాజకీయంలో వీరి ఓట్లతో మనకు అవసరం ఏముందిలే! అన్న నిర్లక్ష్యం కావచ్చు. కానీ ప్రతిరోజూ పచ్చగా మనకు కనబడే తిరుమల కొండ వీరి కృషి ఫలితమే.

తిరుమల కొండపై అడవులు తగలబడిపోతుంటే భారత సైన్యం కూడా హెలికాఫ్టర్ల ద్వారా మంటలను ఆర్పలేక చేతులెత్తేస్తే ఒళ్ళంతా గోతాలు చుట్టుకుని పచ్చని చెట్ల ఆకులు, మండలతో ‘ఖాండవ దహనాన్ని’ ఆర్పిన మొనగాళ్లు వీరు.

తిరుమల, తిరుపతిలో పచ్చదనానికి కృషి చేస్తున్న వీరిలో 12 మంది వివిధ కారణాలతో ఇప్పటికే మరణించారు. అత్యధికులు తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందన్న మానసిక క్షోభతో మరణించారు. ‘ముదిమి’ మీద పడటంతో కొందరు రిటైరయ్యారు. జీవితమంతా టిటిడి సేవలో గడిపి ఆఖరి దశలో వున్నా సాయం చేయని టిటిడి యాజమాన్య ‘పాషాణ హృదయానికి’ ఏ పేరు పెట్టగలమో ఆలోచించాలి.

ముఖ్యమంత్రి హామీ…బోర్డు తీర్మానం…కోర్టు ఆదేశాలు ఇవేవీ అమలు కానపుడు నోరులేని పేదవారు ఏం చేయాలి? ‘మీరిచ్చిన హామీలు అమలు చేయండి. మహాప్రభో…’ అంటూ 3 సంవత్సరాల 2 నెలలుగా వంతుల వారీగా కడుపు మాడ్చుకుని దీక్షలు చేస్తున్నారు. అయినా ఏలికలకు మనసు కరగటం లేదు.

కార్మిక పక్షపాతినని చెప్పే కరుణాకర్‌ రెడ్డి గారు టిటిడి ఛైర్మన్‌ కాగానే అటవీ కార్మికుల పోరాటం సుఖాంతం అవుతుందని తిరుపతి నగర ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు భావించాయి.

ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి 5 నెలలు కావస్తున్నా వీరి వైపు కన్నెత్తి కూడా చూడని వైనం ఆశ్చర్యపరుస్తున్నది. ఇక విధి లేక వీరి గోడు వినేవారు లేక అనివార్యమై అటవీ కార్మికులు ఈ నెల 27వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు.

మిగిలిపోయిన కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని వీరు కోరుతున్నారు.

మనసున్న ప్రతి మనిషి కార్మికుల ధర్మ పోరాటానికి అండగా నిలబడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు.

/ వ్యాసకర్త టిటిడి అటవీ కార్మికుల గౌరవాధ్యక్షులు-తిరుపతి, సెల్‌ : 9490098840/కందారపు మురళి
/ వ్యాసకర్త టిటిడి అటవీ కార్మికుల గౌరవాధ్యక్షులు-తిరుపతి, సెల్‌ : 9490098840/కందారపు మురళి
➡️