‘ఉప’ వంచన

Dec 9,2023 07:15 #Editorial

                   దళిత, గిరిజన ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన ఉప ప్రణాళిక నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో అవి మురిగిపోతున్నట్లు రాజ్యసభలో సిపిఎం సభ్యులు శివదాసన్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్‌ అథవాలే పేర్కొన్నారు. తరతరాలుగా ఆర్థికంగా, సామాజికంగా వివక్షతకు, అణిచివేతకు గురైన అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం చట్టబద్ధంగా కేటాయించి ఖర్చు చేయాల్సిన నిధుల విషయంలోనూ నిర్లక్ష్యం వహించడమంటే అది ముమ్మాటికి వారిని నిలువునా వంచించడమే. గత ఐదేళ్లలో షెడ్యూల్డు తరగతుల ఉప ప్రణాళిక (ఎస్‌సి సబ్‌ప్లాన్‌)కు సంబంధించిన సుమారు రూ.72 వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖర్చు కాకుండానే మురిగిపోయాయి. దీంతో ఆ కేటాయింపులు రద్దు అయ్యాయి. 2022-23లోనూ రూ.13,961.54 కోట్ల ఎస్‌సి సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చు చేయలేదు. గత ఐదేళ్లలోనూ ఇదే నిర్లక్ష్య ధోరణితో మొత్తం రూ.71,686.43 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు మురిగిపోయాయి. 2018-19లో రూ.9,818.24 కోట్లు, 2019-20లో రూ.11,042.26 కోట్లు, 2020-21లో రూ.19,922.35 కోట్లు, 2021-22లో రూ.16,942.04 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.71,686.43 కోట్లు ఖర్చు చేయకుండా మోడీ సర్కార్‌ మొద్దునిద్ర నటించింది. ఎన్నికల వేళ ప్రచార వేదికలపై దళిత నాయకులను ఓదార్చుతూ ఎనలేని ప్రేమ ఒలకబోసిన బిజెపి పెద్దలకు దళితులపై ఏపాటి ప్రేమ ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గిరిజనుల సబ్‌ప్లాన్‌ విషయంలోనూ నిధుల ఖర్చు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సబ్‌ ప్లాన్‌ నిధుల తెగ్గోతలతో పాటు అణగారిన ప్రజలకు సంబంధించిన అనేక పథకాలను మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తూనేవుంది. ప్రధానంగా దళితులు అత్యధికంగా ఆధారపడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నీరుగార్చుతోంది. ఉపాధి కార్మికులకు అందజేయాల్సిన వేతన బకాయిలను రాష్ట్రాలకు చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ‘ఉపాధి’కి ఉరితాళ్లు పేనుతోంది. కార్పొరేట్ల అనుకూల సవరణలతో అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచి ఆదివాసీల పొట్టగొడుతోంది.

బిజెపియేతర పక్షాలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు దళితుల, గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణతో సామాజిక సాధికారతకు బాటలు వేస్తుంటే సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా అడ్డుంకులు సృష్టించే కుయుక్తులకు పాల్పడుతోంది. ఉపాధి వేతన బకాయిలు చెల్లించకపోవడం అందులో భాగమే. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కూడా సామాజిక సాధికారత పేరిట ప్రచారం దట్టిస్తోంది. కానీ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా ఉన్నాయని చెప్పకతప్పదు. విద్యుత్‌, విద్య, పురపాలక రంగాల్లో మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన ప్రజా వినాశకర సంస్కరణలను మిగిలిన రాష్ట్రాలకంటే వేగంగా, నిరంకుశంగా అమల్జేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమం విషయంలో బిజెపి బాటనే అనుసరించడం సమంజసం కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా దళితుల సంక్షేమం కోసం మొసలి కన్నీరు కార్చకుండా వారి అభ్యున్నతికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను మురిగిపోకుండా ఖర్చు చేయాలి. కానీ మోడీ సర్కార్‌లో ఈ దిశగా ఏమాత్రం కదలిక కానరావడం కల్ల. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిన్నుకుండిపోయి రేపోమాపో అంటూ ‘ఎస్సీ వర్గీకరణ’పై ప్రజలను వంచించే నాటకాలను మించి మోడీ సర్కార్‌ నుంచి ఏదైనా ఆశించడమంటే అది మబ్బులు చూసి ముంతొలికిపోయడమే అవుతుంది. దేశం నలుమూలల నుంచి దళిత సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ‘పార్లమెంటు మార్చ్‌’ సందర్భంగా 11 ప్రధాన డిమాండ్లను రాష్ట్రపతికి నివేదించారు. దళితులకు భూపంపిణీ, ఉచిత నాణ్యమైన విద్య, ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు, వెట్టిచాకిరి నిర్మూలన చట్టాన్ని పట్టిష్టంగా అమల్జేయడం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసుల్లో పోలీసు స్టేషన్‌ బెయిల్‌ను రద్దు చేయడం వంటి డిమాండ్లతో పాటు సబ్‌ప్లాన్‌కు సంబంధించి కూడా ఒక న్యాయసమ్మతమైన డిమాండ్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి విన్నవించారు. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలకు కేటాయించిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోయినా, ఆ నిధులను దారి మళ్లించినా అలాంటివారిని శిక్షించేలా చర్యలు చేపట్టాలని, అప్పుడే దళిత, గిరిజనుల అభ్యున్నతికి కాస్తంతయినా ముందుడుగు పడుతుందని విన్నవించారు. ఆ లెక్కన ఐదేళ్లలో రూ.72 వేల కోట్లు పైగా మురిగిపోయేలా చేసిన మోడీ సర్కార్‌ కచ్చితంగా శిక్షార్హమైనదే. అందువల్ల భావితరాల భవిష్యత్‌ నిర్మాణం కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఓడించాలనే నినాదం సముచితం.

➡️