ఓటు మన హక్కు

May 12,2024 05:30 #editpage

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ‘కూటికి గుడ్డకున్‌ ప్రజలు, కొంగరవోవుచుండ నీటుగా/ మోటారుబండ్లపై నగదు మూటలతో కలవారి ఓటు భి/ క్షాటన సాగుచున్నయది జాగ్రత్త! దేశనివాసులారా! మీ/ యోటులు స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్ర బంధముల్‌’ అంటారు గుర్రం జాషువా. ఓట్ల కోసం డబ్బు మూటలతో వచ్చినా… ప్రజలు వివేకంతో వేసే ఓట్లు ‘స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్రబంధముల్‌’ అన్న ఆశాభావాన్ని 1960వ దశకంలోనే వ్యక్తం చేశాడు జాషువా. అంతేకాదు, పొరపాటున చేయిజారి అయోగ్యులకు ఓటు వేస్తే.. దగాకోరు నాయకులు అధికారంలోకి వచ్చి, దేశాన్ని సమస్త కష్టాలకు గురిచేస్తారని కూడా ఆయన హెచ్చరించాడు. ఓటు వేయడం అంటే… దేశ భవితను, ప్రజలను సక్రమంగా నడిపించగల వారిని ఎన్నుకోవడం. ఓటుకు మన తలరాతలు మార్చే శక్తి వుంది గనుకనే దానికంత విలువ. ‘బ్రూటున కేసిన ఓటు/ బురదలో గిరవాటు/ కడకు తెచ్చును చేటు/ ఓ కూనలమ్మ’ అంటారు ఆరుద్ర. అవినీతిపరులను, ప్రజావ్యతిరేకులను ఓడించే శక్తి ఓటుకు వుంది. నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమౌతుందిలే అనుకుంటుంటారు చాలామంది. కానీ, ఓటు మన హక్కు. కొన్ని దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోక పోతే జరిమానా విధిస్తారు.
‘ప్రతి ఎన్నికలను ప్రజలే నిర్ణయిస్తారు’ అంటారు లారీ జె. సబాటో. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైంది. 1947లో 30 కోట్లు వున్న దేశ జనాభా… నేడు 140 కోట్లను దాటేసింది. తొలిసారిగా 1951లో 26 రాష్ట్రాలలోని 489 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పారిశ్రామిక, సేవా సంఘాలు అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్నప్పటికీ… ఐరాస లెక్కల ప్రకారం మన దేశం చాలా రంగాల్లో వెనకబడే వుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత… మనం ఎన్నుకునే రాజకీయ నాయకులది. అయితే, స్థానిక పంచాయతీ వార్డు మెంబర్‌ నుంచి… పార్లమెంట్‌ మెంబర్‌ వరకూ సరైన వారిని అత్యధిక చోట్ల ఎన్నుకోలేకపోతున్నాం. ‘ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, అక్కడ వ్యవస్థకు సంబంధించిన ‘పున్ణసమీక్ష’కు సమయం ఆసన్నమైంది అని అర్థం’ అంటారు ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త రాబర్ట్‌ క్లిట్‌గార్డ్‌. ఈ క్రమంలో కార్పొరేట్‌- మతతత్వ పార్టీలు రేపుతున్న కుల, మత విద్వేషాలను తిప్పికొట్టాలి. ముఖ్యంగా పాలకులు చెప్పే మాయమాటలు, తప్పుడు మేనిఫెస్టోలను నమ్మి మంచిచెడ్డల విచక్షణ కోల్పోతున్నాం. ఫలితంగా… బడా కార్పొరేట్లు, నేరగాళ్లు, సెక్స్‌ స్కాండల్స్‌లో, ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కున్న వారు చాలామంది పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవుతున్నారు.
బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే… ఈ దేశంలో ఇవే చివరి ఎన్నికలని సర్వత్రా వినిపిస్తున్న మాట. అదేగాని జరిగితే… రాజ్యాంగం, దాని మౌలిక స్వరూప స్వభావాలు, ప్రజాస్వామ్యం, స్వావలంబన, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటివి తీవ్ర ప్రమాదంలో పడతాయి. అసలు ఓటు వేసే అవకాశమే వుండకపోవచ్చు. ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని నిరంకుశ ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి ప్రయత్నిస్తోంది. ఒక నిరంకుశ, కార్పొరేట్‌ పాలనను మతం ముసుగులో నెలకొల్పాలన్నదే దాని లక్ష్యం. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఎన్నిక అనే సూత్రాల్ని బిజెపి ప్రచారం చేస్తోంది. ఈ భావన రాష్ట్రాల అభివృద్ధికి, వికాసానికి ఆటంకం. భిన్న భాషలు, సంస్కృతులకు నిలయమైన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పాలి తప్ప వాటిని తొక్కిపెట్టి కాదు. గత పదేళ్ల పాలనలో చేదు అనుభవాలను చవిచూసిన తర్వాత మళ్లీ బిజెపికి, బిజెపిని బలపరిచే టిడిపి, జనసేన, వైసిపి లాంటి పార్టీలకు ఓటు వేస్తే జరిగే ముప్పు గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. ఇది దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవితను నిర్ణయించే ఎన్నికలు. ‘ఓటిచ్చినప్పుడే వుండాలె బుద్ధి/ ఎన్నుకొని తలబాదుకొన్న ఏమగును?/ తర్వాత ఏడ్చినను తప్ప దనుభవము’ అంటారు కాళోజీ. కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా వృధాకాకుండా ఓటు వెయ్యాలి. మన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బలపర్చుకునే దిశగా దాన్ని వినియోగించాలి.

➡️