చారిత్రక తీర్పు దిశగా ఓటర్లు

May 12,2024 04:45 #editpage

మే13 భారతీయుల, తెలుగు ప్రజల తీర్పు కొత్త చైతన్యానికి సంకేతం కాబోతున్నదా? ఇదే ప్రశ్న పరిశీలకులనూ చరిత్రకారులనూ ఆలోచింపచేస్తున్నది. మోడీ హ్యాట్రిక్‌ ఖాయమంటూ మొదలైన హంగామా ఆయన ట్రిక్కుల వేటతో రోజుకో మలుపు తిరుగుతున్నది. బహుశా ఏ ప్రధాన మంత్రి నుంచీ ఎన్నడూ వినని దారుణమైన, విద్వేష వాక్కులు మోడీ నోట వినవలసి వచ్చింది. మతాలపై పార్టీలపై కుటుంబాలపై, వ్యక్తులపై మోడీ విష ప్రచారాలు గతంలో ఎన్నడూ చూడనంత దిగువకు చేరాయి. తెలుగునాట ఆ మోడీతో ప్రత్యక్షంగా పరోక్షంగా జట్టుకట్టిన పార్టీలూ నేతలూ కూడా మింగలేక కక్కలేక తంటాలు పడుతున్న పరిస్థితి. అసలు సమస్యలతో నిమిత్తం లేని అసహన రాజకీయాలు అధికార ఆరాటాలు, కులాల కుటుంబాల కుమ్ములాటలుగా మారిన ఎ.పిలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నందున మే 13కు ముందస్తు రంగం మరింత తీవ్రంగా తయారైంది. వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదు గనక బిజెపిని మోయాల్సిందేనని షరతు పెట్టి జట్టుకట్టిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, స్కిల్‌ స్కామ్‌ అరెస్టు తర్వాత మోడీ అండ అనివార్యమని తలపోసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెంటపడి చివాట్లు తిని మరీ రాష్ట్ర ప్రయోజనాల పేర ఎ.పి లోకి ఎన్‌డిఎను తీసుకొచ్చారు. మరోవైపున వారిది పొత్తు అయితే ఈయన తొత్తు అనిపించుకున్న ఎ.పి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంతే అనివార్యంగా బిజెపి వల్ల ముస్లిం రిజర్వేషన్లకూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కలిగే ముప్పును గురించి మాట్లాడవలసి వచ్చింది. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్‌కు బలమైన కమ్యూనిస్టు సంప్రదాయాలు, క్రియాశీల ఉద్యమం వున్నందువల్ల ఈ దాగుడు మూతలు దగాకోరు రాజకీయాలు పెద్దగా సాగింది లేదు. రెండే పక్షాలు ఇద్దరే నాయకులు అన్నట్టు జగన్‌ బాబు ప్లస్‌ పవన్‌ మధ్య సాగిన ప్రహసనంలో ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర సమస్యలు ప్రధాన ఎజెండాలోకి వచ్చాయి. కాంగ్రెస్‌కు కాస్త ఊపిరి వచ్చి ‘ఇండియా’ వేదిక ఇక్కడ కూడా పాత్ర వహించడంతో మూడు కూటముల పోరాటంగా మారింది. శుక్రవారం నాడు మూడు పార్టీల అగ్ర నాయకులు కలసి జరిపిన సభ ఇందుకు సంకేతమైంది. ఈ మధ్యలో పర్యటనలు, షోలు చేసిన మోడీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ కొత్త, పాత హామీ ఇవ్వకుండా వ్యక్తిగతంగా జగన్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ విన్యాసం చేసి వెళ్లడంలో జాతీయంగా ఆయన దురవస్థ తెలుస్తుంది.
సెమీఫైనల్‌, ఫైనలా?
తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలు తన పాలనపై రెఫరెండమనీ, శాసనసభ ఎన్నికలు సెమీ ఫైనల్‌గా ఇదే ఫైనల్‌ అనీ ప్రకటించడంతో అక్కడా వేడి పెరిగింది. శాసనసభ ఎన్నికలనాడు కాంగ్రెస్‌, సిపిఐ మాత్రమే కలసి వుండగా ఇప్పుడు ‘ఇండియా’ వేదిక రంగంలోకి వచ్చింది. ఇందుకోసం ముఖ్యమంత్రితో సహా చర్చలు జరిపి మద్దతు కోరడం పరిస్థితిని ప్రతిబింబించింది. మూడు నెలల్లో అంతా తలకిందులై తామే తిరిగొస్తామన్న బిఆర్‌ఎస్‌ మనుగడ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే తమకే ఎక్కువ సీట్లు వస్తాయని బిజెపి పసలేని హడావుడి చేస్తున్నది. ఎ.పి లో బిజెపి మతతత్వ రాజకీయాల వల్ల మైనార్టీలు దూరమై నష్టం జరుగుతుందనే ఆందోళన ఎన్‌డిఎలో వుంటే తెలంగాణలో మాధవీలత వంటి వారిని ముందు పెట్టి ఆ మతతత్వాన్నే రాజేయడానికి బిజెపి పాచికలు వేస్తున్నది. ప్రాంతీయ పార్టీల కలహాల స్థాయికి మారిన తెలుగు రాజకీయాలలో మరోసారి మతతత్వం, లౌకికతత్వం ఎజెండాను తెచ్చి ‘ఇండియా’ తాలూకు జాతీయ కోణాన్ని ఆవిష్కరించడంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఇతర లౌకిక ప్రజాస్వామిక వాదుల పాత్ర కాదనలేనిది. చివరికి వచ్చే సరికి జగన్‌ బిజెపి, ఎన్‌డిఎ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించడాన్ని సూటిగా ఖండించక తప్పలేదు. ఎన్నికల తర్వాత బిజెపి లోకి వెళతాడనే ఊహాగానాలను రేవంత్‌ కూడా ఏదో విధంగా తోసిపుచ్చకా తప్పలేదు.
సామాజిక సంకేతాలు
సామాజిక శక్తులుగా చూస్తే మోడీని మోసేందుకు సిద్ధమైన మందకృష్ణ వంటి వారి గొంతు వెనక్కు పోగా ఎ.పి లోనూ ఎన్‌డిఎ సోషల్‌ ఇంజనీరింగ్‌ వికటించి చాలా శక్తులు దూరమవడం కనిపిస్తుంది. వామపక్షాలు ఎప్పటి నుంచో చెబుతున్న లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వంటివి కేంద్ర స్థానంలోకి రాగా దానిపై ఎన్‌డిఎ కపట నాటకం బహిర్గతం కావడం, వైసిపి కూడా అమలులోకి రాలేదని సమర్థించుకోవడం ఈ పరిణామాల పరంపరలోవే. ఎ.పి, తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడే తీర్పునిస్తారని ఎన్‌డిఎకూ వైసిపికి తగిన పాఠం నేర్పుతారని ఆశించవచ్చు. కేవలం సినిమా ఆకర్షణలు కులాల వారీ వ్యూహాలతో నెట్టుకు రావచ్చనుకున్న పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు కూడా ఈ క్రమంలో స్వంత గెలుపుకోసం తంటాలు పడాల్సిన పరిస్థితి ఒకటైతే బిజెపితో మోడీతో అవకాశవాద మైత్రిని సమర్థించుకోలేక చంద్రబాబు విన్యాసాలు సాగిస్తున్న దశ. జగన్‌ నిరంకుశ పాలనతో పాటు మోడీ మరింత పెద్ద నియంతగా పేరు మోశారనీ, ముఖ్యమంత్రులనే జైలుపాలు చేశారని న్యూస్‌ లాండ్రీ విలేకరి ప్రశ్నలు వేస్తుంటే చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ‘వైనాట్‌ 175’ జోరు తగ్గిన వైసీపీ ఎలాగోలా తాము గట్టెక్కుతామని ఆశపడుతుంటే జనం మెప్పు పొందని కూటమిని ఓటమి పాలు కాకుండా కాపాడు కోవడానికి చంద్రబాబు ఏటికి ఎదురీదుతున్నారు. దక్షిణ భారతంలో బిజెపికి మరింత చోటివ్వకూడదనే సంకల్పం ప్రజల్లో బలంగా కనిపిస్తుంది.
డీలా పడిన మోడీ
మరోసారి జాతీయ దృశ్యం చూస్తే మూడు దశల పోలింగ్‌ తర్వాత మోడీ టీం నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకూ ఆమెరికా పాలకవర్గాల దన్నుతో మోడీని విశ్వగురువుగా చిత్రించిన పాశ్చాత్య మీడియాలోనూ ఈ మార్పు గోచరిస్తుంది. ఇప్పుడు పెద్ద లోతుల్లోకి వెళ్లకపోయినా పైపై శీర్షికలు చూస్తే చాలు ఇది తెలిసిపోతుంది. ‘మోడీ గాలి తగ్గిందా? ప్రజలు ఓటేయడానికే రాలేదెందుకు? ఇది మే 2న ఎకనామిక్‌ టైమ్స్‌ శీర్షిక. రాయిటర్స్‌ వార్తా సంస్థ అనేక చోట్ల అనేక మందిని కలిసి ఇచ్చిన ఈ కథనం చాలా పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి. మోడీ విభజనవాద ప్రసంగాలు ఎత్తుకోవడంతో ప్రశ్నలు తలెత్తుతున్నాయని బిబిసి వివరంగా కథనం ఇచ్చింది. అల్‌జజీరా, ఎకనామిస్ట్‌, గార్డియన్‌ ఇలా ఏ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక కూడా బిజెపి ప్రభంజనం ఏదో వున్నట్టు కథనమివ్వలేదు. కాశ్మీర్‌పై మోడీ గొప్పల పస తేలిపోవడంతో అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని కూడా రాయిటర్స్‌ తెలిపింది. తాను అధికారానికి రావడంలేదని అర్థమైనందుకే మోడీ సమతుల్యత లేకుండా మాట్లాడు తున్నారని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించడాన్ని ఫ్రంట్‌లైన్‌ ప్రముఖంగా ఇచ్చింది. సగం సీట్లకు ఓటింగు ముగిసినా బిజెపి ఇప్పటికీ ఎన్నికల ఎజెండాను రూపొందించలేకపోయిందని డెక్కన్‌ హెరాల్డ్‌ రాసింది. వెయ్యి కత్తి కోతలతో బిజెపి నరకయాతన పడుతున్నదని వైర్‌లో ప్రేమ్‌ ఫణిక్కర్‌ ఉదాహరణలతో సహా చెప్పారు. టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన సూపర్‌ ప్లేయర్‌ తదుపరి సారి సెమీ ఫైనల్‌లోనే ఓడిపోయినట్లుగా బిజెపి తయారైందని వ్యాఖ్యానించారు. 2014 కన్నా 2019లో నాలుగు సీట్లు పెంచుకుని 303కు చేరుకున్న బిజెపి ఇప్పుడు తిరోముఖంగా తయారైందన్నారు. గతంలో కర్ణాటకలో 29 స్థానాలు వచ్చిన బిజెపి ముగిసిన మూడు దశల్లోనూ అంతకంతకూ దెబ్బ తినిపోవడమే గాక విద్వేష ప్రసంగాలు జె.డి.ఎస్‌ రేవణ్ణ అత్యాచారపర్వం వంటి వివాదాల్లో చిక్కుకుపోయింది. కనీసం 18 కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. అజిత్‌ పవార్‌ ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే బారామతిలో తన సీటు కోసమే పెనుగులాట!
మూలపీఠాల్లో ముసలం?
తూర్పు, దక్షిణ భాగాల్లో బిజెపికి వ్యతిరేకత బాగా తెలిసిందే. ఢిల్లీలోనూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బెయిల్‌పై రావడం బిజెపి వ్యూహాలకు ఎదురు దెబ్బ. రాజకీయంగానూ మారుతున్న పరిస్థితిని వెల్లడిస్తుంది. మహారాష్ట్రలో హత్యకు గురైన నరేంద్ర దభోల్కర్‌ హంతకులకు ఈ సమయంలోనే శిక్ష పడింది. ఇంకా కీలకమైనవి ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌లు. వీటిలో అత్యధిక ఫలితాలే మోడీకి పట్టం కట్టాయి. కానీ ఇప్పుడు యు.పి కథ మారింది. 2014తో పోలిస్తే 2019లో యు.పి లో ఓట్లు పెరిగినా తొమ్మిది సీట్లు తగ్గాయి బిజెపికి. ఈసారి కాంగ్రెస్‌, సమాజ్‌ వాది పొత్తు ప్రభావం బలంగా వుందంటున్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ట లాభమేమీ లేదని నిట్టూర్పులు విడుస్తున్నారు. అసలు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్యలో వైరం చాలా సీట్లు పోగొడుతుందని సందేహాలున్నాయి. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు జరిగిందే తమ పార్టీలో పునరావృతం అవుతుందని బిజెపి నేతలు భయపడుతున్నారు. క్షత్రియ వర్గాల అసంతృప్తి గుజరాత్‌ లోనూ దెబ్బ తీస్తుందని కలవరపడుతున్నారు. హర్యానా సర్కారు ఇప్పటికే మైనార్టీలో పడింది. బీహార్‌లో ‘ఇండియా’ వేదిక బలంగా సాగుతోంది. బెంగాల్లో సిపిఎం పుంజుకోవడంతో బిజెపి, దాని వ్యతిరేకులు అన్న రీతిలో ద్విముఖ సమరంలా మారిందని వ్యాఖ్యలు వస్తున్నాయి.
ముందున్న సవాలు
బిజెపి ఈ పరిస్థితికి రావడానికి 2024 ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం కూడా ఒక కారణం. 2019లో ఉగ్రవాదుల దాడులు, పుల్వామా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వంటి వాటికి హైప్‌ ఇచ్చి ఓటర్లను ఉద్వేగంవైపు తిప్పారు. కానీ ఈ అయిదేళ్లలోనూ ఈ కృత్రిమ వ్యూహాలు పనిచేయవని తేలిపోయింది. మత రాజకీయాల ముప్పుపై మెళకువా పెరిగింది. లౌకిక ప్రతిపక్షాలను ఒకచోటికి చేర్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. అందుకే ఎ.పి లో వలె బిజెపికి దగ్గరగా వుండిన పక్షాలు కూడా ఆ అంశాన్ని కాస్త వెనక్కు నెట్టి ఇతర తరహాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఎ.పి లో చంద్రబాబు, జగన్‌ల తీరే అందుకో ఉదాహరణ. చాలా చోట్ల బిజెపి వారిని జెండాలు లేకుండా రమ్మని కూడా టిడిపి పట్టు పట్టినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నేతలు ఉభయులూ అవతలివారు బిజెపితో వున్నారని ఆరో పిస్తుంటారు. విధానాల పరంగా గాకున్నా మనుగడ కోసమైనా మతతత్వ రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెప్పుకో వలసిన స్థితి. ఈ భావన పెరిగేకొద్ది మోడీ, అమిత్‌ షా మరింతగా ముస్లిం వ్యతిరేకత, విద్వేష ప్రచారం పెంచుతున్నారు. ఈ ధోరణులకు అంతిమంగా ప్రజలే తగు సమాధానమిస్తారని ఆశించాలి. ఒక్కో దశ ముగుస్తుంటే ఓటింగు తగ్గుతున్నందున బిజెపి, ఎన్‌డిఎలు కూడా ఇంకా ఈ ధోరణి పెంచుతారనడంలో సందేహం లేదు. వాటిని అడ్డుకోవలసిన ఎన్నికల సంఘం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. కనుక ఓటర్లు అప్రమత్తంగా వుండక తప్పదు.

తెలకపల్లి రవి

➡️