అయోధ్య వివాదం దేనికోసం ?

Feb 10,2024 07:20 #Editorial

అయితే నేను ఇంతకు ముందు రాసినట్లు…ఇది ఉత్తరప్రదేశ్‌లో ధూళిమయంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో రెండు ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో ఉండే చిన్నపాటి భూమికి సంబంధించిన వివాదం కాదు. ఇది మధ్య యుగాల నాటి మసీదు (ఇప్పుడు నేలమట్టం చేయబడిన)కు, ఆలయానికి మధ్య పోటీ కూడా కాదు. ఇది ఏ రకమైన దేశం? భవిష్యత్తులో ఎలాంటి దేశంగా ఉంటుంది? ఈ దేశానికి చెందిన వారెవరు? ఎలాంటి షరతులపైన ఆధారపడి భిన్న అస్తిత్వాలు, భిన్న విశ్వాసాలు కలిగిన ప్రజలు ఈ విశాలమైన భూమిపై కలిసి జీవించాలనే విషయం గురించే ఈ వివాదం.

నవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు అధినేత మోహన్‌ భగవత్‌ సమక్షంలో 51 అంగుళాల నల్లరాతితో ఐదేళ్ల బాల రాముని విగ్రహాన్ని, అయోధ్యలో పాక్షికంగా నిర్మితమైన రామమందిరంలో ప్రతిష్టించారు. ఈ ఆలయాన్ని, 1992లో ఒక అల్లరిమూక కూల్చివేసిన మధ్యయుగాల నాటి మసీదు ఉన్న స్థలంలో నిర్మిస్తున్నారు. సరయూ నదీ తీరానగల ఈ తీర్థయాత్ర పట్టణాన్ని మార్చేందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.57 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ఈ విగ్రహ ప్రతిష్ట ఉత్సవంలో భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఆ భగవంతుడు తనను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందనీ, తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ”మాటలు లేవ”ని మోడీ అంటున్నారు.

స్వాతంత్య్రం సిద్ధించిన కొన్ని సంవత్సరాలకే సౌరాష్ట్ర ప్రభుత్వం సోమనాథ దేవాలయ పునర్నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించినప్పుడు, భారత ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్న మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. ”ఏ ప్రభుత్వమైనా ఇలా చెయ్యడం పూర్తిగా సరైంది కాదని నాకనిపిస్తుంది. ఆ ప్రకారమే, నేను ఆ ప్రభుత్వానికి లేఖ రాశా”నని చెప్పారు. ఆ లేఖలో ఆయనిలా అన్నారు: ”ఏ సమయంలోనైనా ఇది ఆమోదయోగ్యం కాదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, దేశం ఆకలితో అలమటిస్తున్న సమయంలో జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం గురించి మనం మాట్లాడుకునే సమయాన ప్రభుత్వం ఈ ఖర్చుకు పూనుకోవడంతో నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. మనం విద్య, ఆరోగ్యం ఇంకా అనేక ప్రయోజనకరమైన సేవలపై ఖర్చు నిలిపివేశాం. ఎందుకంటే, మనకు సాధ్యపడదని చెప్తున్నాం. అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాల కోసం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేయగలుగుతుంది.

”అయితే, ఒక మతపరమైన కార్యక్రమంలో లౌకికరాజ్యం ప్రమేయాన్ని, ఒక మతపరమైన మందిర పునర్నిర్మాణానికి ప్రభుత్వ నిధుల కేటాయింపును, 1951లో ఆలయ ప్రారంభోత్సవం సమయంలో రాష్ట్రపతితో సహా సీనియర్‌ అధికారులు హాజరు కావడాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. రాజ్యాంగ నిబంధనలకు భిన్నంగా ఒక్క మతానికే ప్రాధాన్యతనిచ్చే ఎలాంటి చర్యనూ ఆయన సమర్ధించలేదు. ఆయన తన అసమ్మతిని కూడా మర్యాదగా రాజేంద్రప్రసాద్‌కు ఇలా తెలియజేశారు: ”సోమనాథ ఆలయ ప్రారంభ మహోత్సవంలో మీరు స్వయంగా పాల్గొనడమనే ఆలోచన నాకు నచ్చలేదని చెప్పవలసి వుంది. ఇది కేవలం మీరు లేదా మరెవరైనా చేయగలిగే దేవాలయ సందర్శన మాత్రమే కాదు. దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కొన్ని చిక్కులు కూడా ఉంటాయి.

”అయితే ఒక లౌకికరాజ్యం, ఆలయ నిర్మాణం లాంటి కార్యాలకు దూరంగా ఉండాలన్న నెహ్రూ డిమాండ్‌ గురించి, దశాబ్దాల తర్వాత మోడీ చాలా కఠినంగా ఇలా మాట్లాడారు. ”సోమనాథ దేవాలయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని సాహసవంతు లైన ప్రజలకు చెందిన ఈ నేల క్షమించద”ని ప్రకటించారు.

భారతదేశంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కింద ఉన్న ప్రత్యేక రక్షణలను రద్దు చేయడం, యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఏర్పాటుతో పాటు, 460 ఏళ్ళుగా అయోధ్యలో ఒక మసీదు ఉన్న స్థలంలో రామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాలనే ముఖ్యమైన ఎజెండాను ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి లు ముందుకు తెచ్చాయి. ఈ కారణంగానే బాబ్రీ మసీదు స్థలంలో రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కాషాయ దళానికి ఒక విజయోత్సవ సమయమైంది.

అయితే నేను ఇంతకు ముందు రాసినట్లు…ఇది ఉత్తరప్రదేశ్‌లో ధూళిమయంగా ఉన్న ఒక చిన్న పట్టణంలో రెండు ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో ఉండే చిన్నపాటి భూమికి సంబంధించిన వివాదం కాదు. ఇది మధ్య యుగాల నాటి మసీదు (ఇప్పుడు నేలమట్టం చేయబడిన)కు, ఆలయానికి మధ్య పోటీ కూడా కాదు. ఇది ఏ రకమైన దేశం? భవిష్యత్తులో ఎలాంటి దేశంగా ఉంటుంది? ఈ దేశానికి చెందిన వారెవరు? ఎలాంటి షరతులపైన ఆధారపడి భిన్న అస్తిత్వాలు, భిన్న విశ్వాసాలు కలిగిన ప్రజలు ఈ విశాలమైన భూమిపై కలిసి జీవించాలనే విషయం గురించే ఈ వివాదం.

భారతదేశం గురించి ఒక భావన ఉంది. ఆ భారతదేశ భావన కోసమే గాంధీజీ ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ భావననే బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ప్రతీ అస్తిత్వం, ప్రతీ విశ్వాసానికి చెందిన ప్రజలందరినీ అన్ని విషయాల్లో సమానంగా చూసే భారతదేశం ఇది. భారతదేశ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, వాస్తవానికి పార్శీలు, క్రైస్తవుల వలెనే భారతీయ ముస్లింలు కూడా విశ్వాసంతో, చట్టబద్ధంగా వారి జన్మభూమి, వారి ఎంపిక పట్ల సమానమైన హక్కును కోరడమే ఆ భావన. శక్తివంతులైన, మెజారిటీ విశ్వాసాలు గల ప్రజల వాదనలకు లోబడి ఇతర మతాల ప్రజలు తమ వాదనలను వదులుకోకుండా, విశ్వాసాలలో ఎలాంటి క్రమానుగత ఆదేశాలు ఉండవనే హామీ ఉంటుంది.

ఈ భారతదేశ భావనకు వ్యతిరేకంగా, భారతదేశానికి సంబంధించి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలకు మరొక ఊహ ఉంది. అదేమంటే, ఈ దేశం హిందూ (అగ్ర వర్ణాలకు) ప్రజలకు చెందినది. దీనిలో సిక్కులు, జైనులు, బౌద్ధులు ఉంటారు. ఎందుకంటే, వారి మతాలు కూడా భారతదేశ మట్టిలోంచే పెరిగాయి. అయితే ఇస్లాం, క్రైస్తవులు విదేశీ విశ్వాసాలను పాటిస్తారు కాబట్టి వారిని ”విదేశీయులు”గా గుర్తిస్తారు. వారిని భారతదేశంలో నివసించడానికి మెజార్టీ హిందువులు (అగ్రవర్ణాలు) అనుమతిస్తారు. అయితే మెజారిటీ మతం, సంస్కృతికి చెందిన మనోభావాలు, విశ్వాసాలకు లోబడి ఉండాలనే షరతుపై మాత్రమే అనుమతిస్తారు.

బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం జరిగే ప్రచారం మొత్తం కూడా హిందువుల కోసమేనన్నట్టు సాగింది. కానీ విశ్వహిందూ పరిషత్‌ అనే ప్రధాన తగాదాలమారి హిందూత్వ సంస్థ, ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలు అనేకమంది హిందువుల మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కానీ హిందువులంతా ఆ సంస్థల్ని ఏ రకంగానూ సమర్ధించడం లేదు.

16వ శతాబ్దంలో మసీదును నిర్మించడానికి వాస్తవంగా రాముని హిందూ దేవాలయాలయాన్ని కూల్చివేశారనే రుజువు లేదనే విషయాన్ని, హిందూ వ్యాజ్యగాళ్ళకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ధ్రువీకరిస్తుంది. కానీ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తర్వాత నేనడిగినట్లు, వాస్తవానికి మసీదు నిర్మించిన స్థలంలో హిందూ ఆలయం ఉందని నిరూపించే రుజువులు ఉన్నాయా? మసీదు ఉన్న స్థలంలో రామమందిరం నిర్మించాలని బిజెపి నాయకుడు ఎల్‌.కె. అద్వానీ నాయకత్వంలోని మొత్తం ఉద్యమం కోరుకుంది కాబట్టి 21వ శతాబ్దంలో చరిత్రలో జరిగిన తప్పిదాల్ని సరిచేసుకునే ప్రయత్నం చేయడానికి చట్టపరమైన, రాజ్యాంగ ఆధారాలు ఏమైనా ఉన్నాయా?

ఇది ఎప్పటికి అంతమవుతుందో ఎవరు నిర్ణయిస్తారు? ఈ ”దిద్దుబాట్లు” ఇతర వివాదాస్పద స్థలాలకు వర్తిస్తుందా? ఇలా చరిత్రలో మనం ఎంతవరకు వెళ్లాలి? 500 సంవత్సరాల చరిత్ర దగ్గరే ఎందుకు ఆగాలి? 1000 లేక 1500 లేక 2000 సంవత్సరాలు లేక ఇంకా దూరంగా ఎందుకు వెళ్ళకూడదు? 9వ శతాబ్దం వరకు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బౌద్ధం ఉండేది, బ్రాహ్మణవాద హిందూ మతం అత్యంత క్రూరంగా బౌద్ధ మతాన్ని అణచివేసి, భారతదేశంలో దాదాపు తుడిచిపెట్టింది. బౌద్ధ స్తూపాలను కూల్చి వేయడం ద్వారా అనేక దేవాలయాలను నిర్మించారనే రుజువులు చరిత్రలో ఉన్నాయి.కాబట్టి హిందూ దేవాలయాలున్న ప్రాంతాల్లో బౌద్ధ ప్రార్థనా స్థలాన్ని పున:స్థాపన చేయాలని మనం ఇప్పుడు వాదనలు చెయ్యాలా? వాస్తవానికి, భారతదేశంలోని అనేక గిరిజన ప్రజల ప్రార్థనా స్థలాల్ని వేల సంవత్సరాలుగా హిందూ ప్రార్థనా స్థలాలకు ఇచ్చేట్లు వారిని ఒత్తిడి చేశారు. చరిత్రలో మనం ఎంత వెనక్కి వెళ్ళాలనే విషయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనం కొన్ని చరిత్రల్నే ఎందుకు ఎంచుకోవాలి, ఇతరులను సరిదిద్దడానికి ఎందుకు ఎంచుకోకూడదు? మరీ ముఖ్యంగా మన రాజ్యాంగంలో, చట్టంలో ఏది ఈ ఎంపికల్ని సమర్ధిస్తుంది?

రాముడు అయోధ్యలో జన్మించాడని చాలా మంది హిందువులు నమ్ముతారు అయితే ఆయన పుట్టిన అయోధ్య వాస్తవానికి నేడున్న అయోధ్య ఒకటేనా అనే దానిపై భిన్నమైన విశ్వాసాలున్నాయి. ప్రస్తుత అయోధ్యలో కూడా రాముడు పుట్టిన ప్రదేశంగా అక్కడి నివాసితులు చెప్పుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రాముడు మరెక్కడో జన్మించాడనే అసంఖ్యాక హిందువుల విశ్వాసం, నమ్మకం కంటే కూడా, రాముడు మసీదు గోపురం కింద జన్మించాడనే ఒకే విశ్వాసం, నమ్మకానికే సుప్రీంకోర్టు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి?

ఆందోళనకరమైన విషయమేమంటే, కేవలం బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వారు మాత్రమే కాక విస్తృత స్థాయిలో రాజకీయ భావాలున్న పెద్ద వర్గాల వారు కూడా నూతన రామ మందిరం ప్రకారమే నైతిక, ఆధ్యాత్మిక, చట్టపరమైన చట్టబద్ధతను కలిగి ఉన్నారు. మూడు నేర పూరితచర్యల ఫలితంగా మసీదు ఒక ఆలయంగా మారింది. 1949లో మసీదులోకి రాముని విగ్రహాన్ని రహస్యంగా, చట్టవిరుద్ధంగా ప్రవేశపెట్టడమనేది మసీదులో ప్రార్థనలకు అంతరాయం కల్గించిన మొదటి నేరపూరిత చర్య.

రెండవది, 1992లో అలజడి సృష్టించే అల్లరిమూక చేతిలో మసీదు కూల్చివేత, ఈ చర్యను అద్వానీ లాంటి నాయకులు కేరింతలతో ప్రోత్సహించారు. గాంధీ హత్యానంతరం, దేశానికిది విచారకరమైన రోజని ఉపరాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ అన్నారు. ఈ ఉద్యమం, కూల్చివేత 1989 నుండి 1993 ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా భయంకరమైన అల్లర్లను సృష్టించాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాని మానని గాయాలు దశాబ్దాల తర్వాత కూడా దేశాన్ని ముక్కలు చేయడం కొనసాగుతూనే ఉంది.

మూడవది, మసీదును కూల్చిన తరువాత 36 గంటల్లో కూల్చి వేయబడిన మసీదు ఉన్న స్థలంలో తాత్కాలికంగా రాముని ఆలయాన్ని నిర్మించడం ద్వారా స్థలం యొక్క యథాతథ స్థితిని మార్చడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన కోర్టు ఆజ్ఞల ఉల్లంఘన. రామ మందిర నిర్మాణానికి స్థలాన్ని అప్పగించిన తీర్పు, చట్టాన్ని మూడు సార్లు ఉల్లంఘించి, సుప్రీంకోర్టు ఆజ్ఞల్ని ధిక్కరించి, భారత రాజ్యాంగంలోని హామీలను, అన్ని మతాలవారి సమానత్వానికి సంబంధించిన ప్రధానమైన వాగ్దానాన్ని అగౌరవపరచిన వారికి బహుమానంగా ఇచ్చింది.

16వ శతాబ్దంలో మహాకవి తులసీదాస్‌, వాల్మీకి సంస్కృత రామాయణాన్ని సాధారణ ప్రజల భాష అయిన అవధిలో తిరిగి చెప్తాడు. ఆయన రామచరిత మానస్‌ అనేది ప్రపంచ సాహిత్య చరిత్రలో మహా కావ్యాలలో ఒకటి. ఆయన, పవిత్రమైన సంస్కృత భాషలో రాయకుండా సాధారణ ప్రజల భాషలో రాసినందుకు బ్రాహ్మణులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారి దాడులకు ప్రతిస్పందనగా తులసీదాస్‌ ‘దోహ’ ను రచించాడు. అది ఈ మాటలతో మొదలైంది: ”నేను బిచ్చం ఎత్తుకొని తింటాను, మసీదులో నిద్రపోతాను.” అంటే తన కాలంలో, అన్ని మతాలకు చెందిన నిరాశ్రయులు, దిక్కులేని వారు ఆశ్రయం పొందే స్థలాలుగా మసీదులు ఉండేవి. తులసీదాస్‌ తన జీవిత కాలంలో ఎక్కువ భాగం వారణాసి, అయోధ్యలలోనే గడిపాడని చరిత్ర ధ్రువీకరిస్తుంది. అదేవిధంగా తులసీదాస్‌ యువకుడుగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీదును ఏర్పాటు చేశారని కూడా అదే చరిత్ర స్థిరపరుస్తుంది. సామాన్య ప్రజల భాషలో రామకథను రాసినందుకు దాడికి గురైన మహాకవి తులసీదాస్‌ వాస్తవానికి బాబ్రీ మసీదులో నిద్రించి ఉంటాడనేది నా ఊహ. ప్రతీ ఒక్క భారతీయుడు వారి వారి పద్ధతుల్లో రాముని గురించి ఆలోచించే రోజులివి.

నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే-ఈ సుదీర్ఘమైన చరిత్రలో ఏ రాముడు విజయం సాధిస్తాడు? నాథూరామ్‌ గాడ్సే గాంధీని చంపినపుడు, గాంధీ పెదవులపై ఉన్న రాముడా? లేక రామ్‌ అని పేరున్న, గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే రాముడా?

('స్క్రోల్‌. ఇన్‌' సౌజన్యంతో)/ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త /హర్ష మందర్‌
(‘స్క్రోల్‌. ఇన్‌’ సౌజన్యంతో)/ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్త /హర్ష మందర్‌
➡️