ఆ మంగళసూత్రాల మాటేమిటి మోడీజీ?

Apr 27,2024 05:15 #editpage

దేశాన్ని పదేళ్ళుగా పాలిస్తున్న నరేంద్ర మోడీ, 400 పార్లమెంట్‌ స్థానాలతో మూడోసారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు. అవి ఒట్టి కలలే కాదు, నిజమై తీరుతాయని గత నెల క్రితం వరకు ఆయన, ఆయన అనుంగ ప్రచార పంచమాంగ దళం హోరెత్తించాయి. మొదటి విడత పోలింగ్‌ తర్వాత ప్రజాతత్వం బోధపడింది. మరోసారి అధికారం దక్కదనే భయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. మొదటి విడత పోలింగ్‌ పూర్తయి, రెండవ విడత దగ్గర పడుతున్న కొద్దీ ఈ భయం మరింతగా పెరిగింది. ఇటీవల ఎన్నికల సభల్లో మోడీ మాట్లాడుతున్న తీరు ప్రధాని స్థాయికి ఏ మాత్రం తగదు. మరోసారి మత విద్వేషాన్ని రగిల్చేందుకు సిద్ధమయ్యారు. తాను ఓడిపోతే హిందువుల మంగళ సూత్రాలు వారు లాగేసుకుంటారంటున్నారు. ఆస్తులు ముస్లింలకు పంచేస్తారంటున్నారు. ఇంకా ఏవేవో చెప్పి దేశంలోని అత్యధిక ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారు. తనను చుట్టుముడుతున్న ఓటమి భయం నుండి బయటపడేందుకు దేశ ప్రజలందరికీ భయాన్ని కల్పించాలనుకుంటున్నారు. ఈ పదేళ్ళలో తాను చేసిన మేలు చెప్పి, ప్రజల మెప్పు పొంది అధికారంలోకి రావడానికి చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలు ఏమీ లేవనే తన డొల్లతనాన్ని తానే పున:ప్రతిష్టించుకుంటున్నారు. ప్రధాని స్థాయిని దిగజారుస్తున్నారు.
మంగళసూత్రాల గురించి మాట్లాడే నైతికత మోడీ, ఆయన పరివారానికి వున్నదా? తమరు కట్టిన తాళిని గాలికి వదిలేయడం మీ వ్యక్తిగతం అనుకుందాం. మంగళసూత్రానికి మతాన్ని ముడివేసే మీ దుష్ట బుద్ధిని ఏమనుకోవాలి? గుజరాత్‌లో వేలాది నరబలుల తర్వాతే కదా ఢిల్లీ అధికార పీఠంపై తమరు అధిష్టించబడింది. అక్కడ తెగిన వేలాది మంగళసూత్రాల కోసం ఒక్కరోజైనా బొట్టు కన్నీరు కార్చారా? నాడు మతోన్మాద కత్తులకు తెగిపడిన తలలు, విద్వేషాగ్నికి కాలిన కళేబరాలు, సహాయం కోసం ఎలుగెత్తిన గొంతుకలు మీలో కించిత్‌ మానవత్వాన్ని కూడా మేల్కొల్పలేక పోయాయే! ఆ నిర్భాగ్య జీవులను ‘కారుకు అడ్డంగా వచ్చిన కుక్క’లతో పోల్చారు కదా! నిండు గర్భాన్ని శూలంతో చీల్చిన ముష్కరులను ఒక్కసారైనా ఛీత్కరించారా? బిల్కిస్‌ బానో లాంటి అనేకమంది అబలలపై ముష్కరులు పైశాచికంగా ఘోరాలు చేస్తే వారిని శిక్షించక పోగా, రక్షించి, సత్కరించిన మీ పార్టీ మంగళసూత్రం గురించి, వాటి పవిత్రత గురించి మాట్లాడితే ఎలా? 2020 ఢిల్లీ అల్లర్లలో మతోన్మాదుల చేతుల్లో హతులైన 50 మంది మహిళల మంగళసూత్రాల గురించి ఎన్నడైనా మాట్లాడారా? పుల్వామా ఉగ్రదాడుల్లో హతులైన జవాన్ల భార్యల మంగళసూత్రాలు గంగలో కలిసి పోవడానికి కారకులెవరనేది ఇప్పటికీ మిస్టరీయే కదా. ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసిన స్టాన్‌స్వామి కట్టిన మంగళసూత్రాన్ని తెంచిందెవరు? అక్రమంగా జైళ్ళ గదుల్లో సంవత్సరాలుగా నిర్బంధించబడిన హక్కుల నేతలు, ప్రజాపక్ష జర్నలిస్టుల మంగళసూత్రాల మాటేమిటి? గత పది సంవత్సరాల్లో మీ విధానాల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్న 1,74,000 మంది రైతుల భార్యల మెడల్లో మంగళసూత్రాలు లేకుండా చేసింది ఎవరు? మీ ఏలుబడిలో నాలుగు కోట్ల మంది గ్రామీణ పేదలు పొట్ట చేత పట్టుకుని మాన, ప్రాణాలకు రక్షణ లేని వలస జీవితాల యమ కూపంలోకి నెట్టబడినప్పుడు మంగళసూత్రం గుర్తుకు రాలేదే! కరోనా సమయంలో కోట్లాది తల్లులు, పసిపిల్లలు అన్నమో రామచంద్రా అంటున్నా కనికరం చూపకుండా లాక్‌డౌన్‌ పేరుతో మీరు తెంచిన మంగళసూత్రాలు ఎన్ని? నోట్ల రద్దు దెబ్బతో క్యూలో రాలిన మంగళసూత్రాలు ఎన్ని? మీరు తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను నిరసిస్తూ 758 మంది రైతులు చనిపోతే, వారు కట్టిన మంగళసూత్రాల గురించి మీ ‘మన్‌ కీ బాత్‌’లో ఒక్కసారైనా మాట్లాడలేదే? మీరు అధికారంలోకి రాక ముందు 2011లో మహిళలపై 2,28,650 అఘాయిత్యాలు జరిగితే మీ ఏలుబడిలో ఒక్క 2022 లోనే 4,45,256 జరిగాయని అంటే ప్రతి గంటకు 51 ఎఫ్‌ఐఆర్‌లు రిజిష్ట్రర్‌ అయ్యాయని, అలాగే 31,560 మంది మహిళలు అంటే రోజుకు ఎనిమిది మంది చొప్పున మానభంగాలకు గురయ్యారని కేంద్ర నేర పరిశోధన నివేదికలు చెబుతున్నాయి కదా. ఈ బాధిత మహిళల మంగళసూత్రాల గురించి ఒక్కసారైనా మాట్లాడారా? వీరిలో అత్యధికులు మీరు చెప్పే హిందువులే కదా! మహిళల మాన, ప్రాణాల రక్షణ కోసం స్పందించని మీ హృదయం ఎన్నికల వేళ మంగళసూత్రాల రక్షణ కోసం స్పందించడం వెనుక వున్న మర్మం ఏమిటి దురాత్మా!
19 సంవత్సరాలు నిండని దళిత బాలిక మీద ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక హత్యాచారం చేసి, తల్లిదండ్రులకు చెప్పకుండానే తెల్లవారుజామున 2.30కే ఆమె భౌతికకాయాన్ని కాల్చివేసిన వారు మీ పార్టీ నాయకులే కదా. కాశ్మీర్‌ లోని కథువాలో ముక్కుపచ్చలారని పసిపిల్లను దేవాలయంలోనే పుజారి మానభంగం చేసి, బండరాయితో తల పగులగొట్టి, అడ్డువచ్చిన తండ్రిని చంపితే ఆ రాష్ట్రంలోని తమరి పార్టీ మంత్రి నిస్సిగ్గుగా ఆ దుర్మార్గుడికి మద్దతుగా ర్యాలీ చేసినప్పుడు మీరు కనీసం చలించలేదే? మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఉరేగించిన దుర్మార్గులకు అండగా నిలిచింది ఎవరు? అక్కడ ఒక జాతిని సమూలంగా నిర్మూలించేందుకు వందలాది యువతీయువకుల మాన ప్రాణాలు హరించుకు పోయిన మంగళసూత్రాలు ఈ దేశ ప్రధాని ఓదార్పుకు కూడా నోచుకోలేదే? రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష హోదాలో బిజెపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ మహిళా మల్ల యోధులపై చేసిన లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నెలల కొద్ది ఆందోళనలు చేసినా, ప్రపంచమంతా స్పందించినా కనీస ఆందోళన వ్యక్తం చేయని పాషాణ హృదయమెవ్వరిది?
ఢిల్లీ అల్లర్లలో ‘గోలి మార్‌’ అంటూ రెచ్చగొట్టి అనేకమంది చావుకు కారణమైన అనురాగ్‌ ఠాకూర్‌ మీ పార్టీ ఎంపీనే కదా. 2018లో గుంపుదాడులు చేసి ప్రజల ప్రాణాలను హరించిన ఎనిమిది మంది అల్లరి మూకలను జైలు నుండి బయటకు తెచ్చి వారికి పూలదండలు, స్వీట్లు పంచిన జయంత్‌ సిన్హా మీ మంత్రివర్గ సహచరుడే కదా. బరితెగించిన ఉన్నావ్‌ దారుణానికి కారకుడైన కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా. కాశ్మీర్‌ కథువా రేప్‌ కేసులో దోషుల పక్షాన నిలిచిన లాల్‌సింగ్‌ చౌదరి, చంద్ర ప్రకాష్‌లు ఆ రాష్ట్రంలో మీ పార్టీ మంత్రులే కదా. 2021లో జంతర్‌మంతర్‌ వద్ద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ముస్లిం మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయమని రెచ్చగొట్టిన అశ్వని ఉపాధ్యాయ మీ పార్టీ నేతే కదా. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్‌
శుక్లా…మీ పార్టీ ఎమ్మెల్యే కేదరినాథ్‌ శుక్లా సహచరుడే కదా. ఇలా మీ పరివార్‌ జాబితా చెబితే చాంతాడే చిన్నబోతుంది. ఇలాంటి వారిని మీరు మందలించినట్లు వినే భాగ్యం ఒక్కసారైనా ఈ దేశ ప్రజలకు కలిగించలేదే?
దేశంలోని మహిళల్లో 60 శాతం మంది ప్రభుత్వ కనీస ఆరోగ్య సేవలకు దూరంగా వున్నారని, పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 50 మంది ఎస్‌.సి ల్లో, 49 మంది ఎస్‌.టి ల్లో, 41 మంది వెనుకబడిన తరగతుల్లో కన్నుతెరవక ముందే కన్నుమూస్తున్న చిన్నారుల గురించి జాతీయ ఆరోగ్య నివేదిక చెబుతున్నది కదా. ఎప్పుడైనా ఆ తల్లుల ఘోష వినేందుకు ప్రయత్నించారా? మీరు అధికారంలోకి రాకముందు 6 నుండి 59 నెలల మధ్య వున్న పిల్లల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు 59 శాతం మంది వుంటే 2019-21 నాటికి 67 శాతానికి పెరిగారు. అందులో మీరు చెప్పే ‘అభివృద్ధి నమూనా రాష్ట్రం’ గుజరాత్‌లో ఈ సంఖ్య 80 శాతంగా వుంది. అయినా మీకు ఆందోళన కలిగించలేదే? 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వున్న మహిళల్లో 2015-16లో 53 శాతం మంది రక్తహీనతతో వుంటే 2021 నాటికి 57.2 శాతానికి పెరిగారు. వీరిలో అత్యధికులు మీరు చెప్పే హిందువులే కదా! ఆ పసిపిల్లలకు, తల్లులకు పోషకాహారం అందించాలని వారి భవిష్యత్తును, తల్లుల మాతృత్వాన్ని కాపాడాలని ఆలోచించలేదే?
ఇన్ని దారుణాలు, ఇంతటి ఘోరాల్లో తెగిపడిన లక్షలాది మంగళసూత్రాల గురించి స్పందించని మీ కంఠం ఇప్పుడు హఠాత్తుగా వాటి గురించి మాట్లాడుతుందంటే మీ ఓట్ల మంత్రాంగం ఎంత చిత్రాతి చిత్రమైనది! సాటి మనుషులను శత్రువులుగా చూపి, సున్నితమైన విశ్వాసాలను పావులుగా వాడుకుని ఎల్లకాలం అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు. నిత్యజీవితం నుండే ప్రజలు వాస్తవాన్ని గుర్తిస్తారు. ఈలోపు లొంగి గులాములుగా మారేవారు కొందరు. అడ్డగించకుండా మౌనంగా వుండేవారు మరికొందరు. ఎదురు నిలిచి ప్రశ్నించేవారు కొందరిలో కొందరు. ఆ కొందరే నేడు కోట్ల గొంతుకలు అవుతున్నారు. అందుకే కేంద్ర పాలకులకు భయం పట్టుకుంది. ఆ భయం నిజం కావాలి. దేశానికి మంగళం జరగాలి. మంగళ సూత్రాలకు నిజమైన రక్షణ కావాలి.

/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/

➡️