ఎక్కడి గొంగళి అక్కడే : డబ్ల్యుటిఓ అబుదాబీ చర్చలు !

Mar 6,2024 07:17 #Editorial

ఎలక్ట్రానిక్‌ (ఇ) కామర్స్‌లో జరిగే లావాదేవీలపై సభ్యదేశాలు కస్టమ్స్‌ సుంకాలు విధించకూడదన్న నిర్ణయాన్ని 1998 నుంచి ప్రతి సమావేశంలో పొడిగించినట్లుగానే అబుదాబీలో కూడా 2026 వరకు అనుమతించారు. ఇది ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలకే లబ్ధి చేకూర్చుతుందని వేరే చెప్పనవసరం లేదు. మన వంటి దేశాలు ‘ఎప్పుడైనా వాటి సరసన చేరకపోతామా, మార్కెట్లలో ప్రవేశించకపోతామా, మన కార్పొరేట్లకూ లబ్ధి చేకూర్చలేకపోతామా’ అనే ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాల సబ్సిడీలకు గండి కొట్టేందుకు చూడటంతో పాటు తమ సబ్సిడీలను మరింతగా పెంచుకుంటున్నాయి. వాటిని ప్రతిఘటించే స్థితిలో మిగతా దేశాలు లేవు. అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా మన వంటి దేశాల పరిస్థితి ఉంది. ఒకవైపు లబ్ధి కోసం రాజీ పడుతున్నాయి, మరోవైపు జనం నుంచి వ్యతిరేకతను చూసి ప్రతిఘటిస్తున్నాయి.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబీలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) మంత్రుల పదమూడవ సమావేశం (ఎంసి13) జరిగింది. 166 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నాచితకా అంశాల మీద కొన్ని ఒప్పందాలు జరిగాయి తప్ప కీలకమైన వ్యవసాయం, మత్స్య సంపద సబ్సిడీలు, తదితర అంశాలపై ఎలాంటి ముందడుగు పడలేదు. ఉమ్మడి ప్రకటన కోసం నాలుగవ రోజు మూడు సార్లు సమావేశం వాయిదా పడింది. కుదరలా. మరో రోజు పొడిగించారు. చివరికి మరిన్ని చర్చలు కొనసాగిద్దాం అనే అంశం మీద తప్ప మరొక ఏకాభిప్రాయం లేదు. పేద వర్ధమాన దేశాలు తమ ప్రయోజనాల కోసం పట్టుబడితే, ధనిక దేశాలూ అంతకంటే గట్టిగా ఉడుం పట్టు పట్టాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలలో సంధికాలం నిబంధన (పీస్‌ క్లాజ్‌) ప్రకారం మన వంటి దేశాలు యథాతథ స్థితిని కొనసాగించేందుకు లభించిన ఊరట తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదు.వాణిజ్య వివాదాల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉండే విధంగా సంస్కరించాలన్నది ఒక ప్రతిపాదన. ఇప్పుడున్న వ్యవస్థనే పని చేయనివ్వకుండా 2019 నుంచి అమెరికా, దాని వెనుక ఉన్న ఇతర ధనిక దేశాలు మోకాలడ్డుతుండటంతో ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఎలక్ట్రానిక్‌ (ఇ) కామర్స్‌లో జరిగే లావాదేవీలపై సభ్యదేశాలు కస్టమ్స్‌ సుంకాలు విధించకూడదన్న నిర్ణయాన్ని 1998 నుంచి ప్రతి సమావేశంలో పొడిగించినట్లుగానే అబుదాబీలో కూడా 2026 వరకు అనుమతించారు. ఇది ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలకే లబ్ధి చేకూర్చుతుందని వేరే చెప్పనవసరం లేదు. మన వంటి దేశాలు ‘ఎప్పుడైనా వాటి సరసన చేరకపోతామా, మార్కెట్లలో ప్రవేశించకపోతామా, మన కార్పొరేట్లకూ లబ్ధి చేకూర్చలేకపోతామా’ అనే ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాల సబ్సిడీలకు గండికొట్టేందుకు చూడటంతో పాటు తమ సబ్సిడీలను మరింతగా పెంచుకుంటున్నాయి. వాటిని ప్రతిఘటించే స్థితిలో మిగతా దేశాలు లేవు. అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా మన వంటి దేశాల పరిస్థితి ఉంది. ఒకవైపు లబ్ధి కోసం రాజీ పడుతున్నాయి, మరోవైపు జనం నుంచి వ్యతిరేకతను చూసి ప్రతిఘటిస్తున్నాయి. మన రైతాంగానికి రక్షణ కల్పించేందుకు గాను కొన్ని పంటలకు కనీస మద్దతు ధర విధానం, ఆహార భద్రతకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ద్వారా ప్రభుత్వమే ఆహారధాన్యాల సేకరణ విధానాన్ని అమలు జరుపుతున్నాం. ఈ రెండూ కూడా డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్ధమని వాటిని ఎత్తివేయాలని అమెరికా, ఐరోపా దేశాలు 2013 నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నాయి. వాటిని సంతుష్టీకరించేందుకు 2020లో నరేంద్ర మోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలు రాజీలో భాగమైతే, రైతుల ప్రతిఘటనతో క్షమాపణలు చెప్పి మరీ తోక ముడవటం రెండోదానికి నిదర్శనం. మొదటిది వాస్తవం, రెండవది వంచన. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు మొరాయించటమే దీనికి నిదర్శనం. అంతిమ ఫలితం ఏమంటే ధనిక దేశాల ఒత్తిడే ఎక్కువగా పని చేస్తున్నది. ముందే చెప్పుకున్నట్లుగా సంధికాలం నిబంధన (పీస్‌ క్లాజ్‌) ఇంకా అమల్లో ఉన్నందున ఎఫ్‌సిఐ, ప్రజా పంపిణీ వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో వివిధ దేశాలు రైతాంగానికి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు వీటిని ఎత్తివేసి మార్కెట్లో ప్రవేశించే హక్కు తమకు కల్పించాలని పట్టుబడుతున్నాయి. ఇదే సమయంలో నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి పెద్ద ఎత్తున అవి సబ్సిడీలు ఇస్తున్నాయి. ఐరోపా దేశాలు ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేస్తే ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎనిమిది శాతం పెరుగుతాయని, అది న్యూజిలాండ్‌ రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఒక సంస్థ చేసిన విశ్లేషణను న్యూజిలాండ్‌ ప్రతినిధి ఉటంకించారు.

అబుదాబీలో తేలని మరొక అంశం సముద్ర ఉత్పత్తులకు సబ్సిడీలు. ప్రపంచంలో 26 కోట్ల మంది వీటి వేటలో ఉపాధి పొందుతున్నారు. చిన్న స్థాయిలో చేపలను పట్టే దేశాల వారు సబ్సిడీల వలన నష్టపోతున్నారు. ఆయా దేశాల సముద్ర తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల అవతల ఎవరైనా చేపలు పట్టవచ్చు. చైనా, ఐరోపా లోని ధనిక దేశాల దగ్గర భారీ నౌకల ద్వారా చేపలను పట్టే సంస్థలు ఉన్నాయి. వాటితో చిన్నవారు పోటీ పడలేరు. భారీ నౌకలకు వ్యతిరేకంగా వర్ధమాన, పేద దేశాలు తెస్తున్న ఒత్తిడికి ఎలాంటి ఫలితమూ కనిపించటం లేదు. రెండవది సముద్ర ఉత్పత్తుల నిర్వచనాల్లో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని ధనిక దేశాలు వ్యవసాయానికి ఇస్తున్నట్లుగానే వీటికి భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి.రెండు సంవత్సరాల క్రితం కుదిరిన ఒప్పందం ధనిక దేశాల సంస్థలకు మేలు చేకూర్చేదిగా ఉంది. చట్టవిరుద్ధంగా, వివరాలు వెల్లడించని, నియంత్రణ విధానం లేకుండా పట్టినవాటికి, పరిమితికి మించి నిల్వలు ఉన్న చేపలకు సబ్సిడీ ఇవ్వకూడదన్న నిబంధనను 2022లో ఆమోదించారు. ఈ ఒప్పందాన్ని నూట పది దేశాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది, మరొక 39 దేశాలు సంతకాలు చేయాల్సి ఉంది. దీని నిబంధనల్లో ఉన్న లోపాల కారణంగా ఏకీభావం కుదరలేదు. ఈ ఒప్పందం మీద జరిగిన ప్రజా విచారణలో పాల్లొన్న వారు ఇప్పటి వరకు కార్పొరేట్లు భూములను కొల్లగొట్టారని, ఇది అమల్లోకి వస్తే సముద్రాలను ఆక్రమిస్తారని, నియంత్రణలు లేకపోతే దోపిడీకి హద్దే ఉండదని హెచ్చరించారు. పేద దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వెలుపలికి వచ్చి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాలన్న ధనిక దేశాల డిమాండ్‌కు అబుదాబీలో మరో అడుగు ముందుకు పడింది. మన దేశంలో నరేంద్ర మోడీ సర్కార్‌ సబ్సిడీలను ఎత్తివేయటమేగాక, సెస్సుల రూపంలో జనం జేబులను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటం కంటే తక్షణమే ప్రత్యామ్నాయంగా పేద దేశాలకు ఆహార సర్వసత్తాక హక్కు, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సౌహార్ద్రతల ప్రాతిపదికన సంస్కరణలు జరగాలని అబుదాబీ సమావేశాలను ఉద్దేశించి అనేక రైతు, వ్యవసాయ కార్మిక, ఇతర వ్యవసాయ సంబంధ సంస్థలు కోరాయి. బహుముఖ సంక్షోభాలు తలెత్తిన వర్తమానంలో వాటిని పరిష్కరించేందుకు డబ్ల్యుటిఓ పనికిరాదని, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని కోరాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలలోని 65 దేశాల్లో 2023లో రైతులు పోరుబాట పట్టారని వారిలో ఉన్న అశాంతికి ఇది నిదర్శనమని పేర్కొన్నాయి. ధనిక దేశాల నుంచి చౌకగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులతో అనేక దేశాల్లో రైతులు నష్టపోతున్నారు. కొన్ని చోట్ల పర్యావరణ రక్షణ పేరుతో వ్యవసాయం మీద ఆంక్షలు విధిస్తున్నారు. పంజాబ్‌, హర్యానాల్లో వరుసగా వరి వేయకుండా పంటల మార్పిడి పద్ధతిని అనుసరిస్తే మూడు పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నలను కనీస మద్దతు ధరలకు ఐదు సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

అబుదాబీలో మన దేశం వ్యవహరించిన తీరుతెన్నులను చూద్దాం. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వలు, కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగించాలని కోరటం తప్ప వాటిని వ్యతిరేకిస్తున్న అమెరికా, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాల మీద గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే అతిశయోక్తి కాదు. వ్యాపారేతర అంశాలను ఎజెండాలో చేర్చకుండా చూడటంలో, దేశ ప్రయోజనాలను కాపాడటంలో విజయవంతం అయినట్లు మన దేశ అధికారులు వర్ణించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. చైనాతో 120 దేశాలు ముందుకు తెచ్చిన ”అభివృద్ధి కోసం పెట్టుబడుల ఒప్పంద” ప్రతిపాదనను మన దేశంతో పాటు దక్షిణాఫ్రికా అడ్డుకున్నాయి. ఈ పెట్టుబడులు డబ్ల్యుటిఓ ద్వారా వస్తే అభ్యంతరం లేదని, వేరే మార్గంలో ప్రతిపాదించినందున వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. అదే విధంగా ఎగుమతులకు లింగవివక్షను ముడి పెట్టటాన్ని కూడా అడ్డుకున్న వాటిలో మనదేశం ఒకటి. ఆహార సబ్సిడీకి 1986-88 సంవత్సరాల ధరలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారని, దీన్ని తాజా ధరలతో నవీకరించాలని మన దేశం కోరింది. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు (వీరికి అతిధి కార్మికులని ముద్దుపేరు) తమ దేశాలకు పంపే పొదుపు మొత్తాల ఖర్చు ఆరు శాతానికి మించి ఉంటోంది. దీన్ని తగ్గించాలని ఆ యా దేశాలు కోరుతుండగా వీల్లేదని ధనిక దేశాలు పట్టుబడుతున్నాయి. ఎందుకు అంటే నగదును బదిలీ చేసే సేవా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి, వాటి లాభాలు తగ్గకూడదన్నది వాటి వాదన. మన కార్మికులు 2023లో విదేశాల నుంచి 125 బిలియన్‌ డాలర్లు పంపారు. దీన్నిబట్టి విదేశీ సంస్థలకు దాదాపు ఎనిమిది బిలియన్‌ డాలర్ల మేర లబ్ధి చేకూరినట్లే.

అంతా మీరే చేశారంటూ అబుదాబీ సమావేశాల వైఫల్యం గురించి ఐరోపా యూనియన్‌ దేశాలు మన మీద విరుచుకుపడ్డాయి. ఈ సమావేశాల్లో మన ప్రతినిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ వాణిజ్యేతర అంశాలను ప్రధాన ఎజెండాలోకి రాకుండా చూడగలిగామని చెప్పారు. శాంతి సంధి నిబంధన మనకు అనుకూలంగా ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ఏ లక్ష్యాలతో మన దేశం ఆ సమావేశాల్లో పాల్గొన్నదో వాటి గురించి సంతృప్తితో తిరిగి వచ్చామని, దేశ ప్రయోజనాలను కాపాడామని సంతోషం వెలిబుచ్చారు. శాంతి నిబంధన ఉన్నందున ఆహార ధాన్యాలను నిల్వచేయవచ్చని, పేదలకు ఉచితంగా పంచవచ్చని చెప్పారు. చేపల సబ్సిడీలకు సంబంధించి నిర్వచనాలు సంతృప్తికరంగా లేవన్నారు. మూడు దశాబ్దాలుగా డబ్ల్యుటిఓ సాధించిందేమీ లేనందున అసలు ఈ సంస్ధే పనికి మాలిందనే అభిప్రాయం కూడా వెల్లడించిన వారు లేకపోలేదు. బహుళజాతి కార్పొరేట్‌ సంస్థల మేలు కోసం ధనిక దేశాలు ముందుకు తెచ్చిన ఈ సంస్థ మీద ఇలాంటి వ్యాఖ్యలు వెలువడుతున్నాయంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యానికి బలమైన నిదర్శనంగా చెప్పవచ్చు.

ఎం. కోటేశ్వరరావు
ఎం. కోటేశ్వరరావు
➡️