టాలీవుడ్‌ కథా నాయికల జోరు

Mar 25,2024 08:33 #movies

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. వివిధ ప్రాజెక్టుల్లో బిజీగా గడుపుతున్నారు. కాజల్‌, రష్మిక మందన్న, సుమంత, కీర్తి సురేష్‌, పూజా హెగ్డే, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌, రాశీఖన్నా, నిధి అగర్వాల్‌, కృతిశెట్టి, తాప్సీ తదితరులు ఒకటికి మించిన సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొెత్త హీరోయిన్లు వస్తున్నా వీరి ప్రత్యేకత కొనసాగుతూనే ఉంది. వీరు దక్షిణాది సినిమాలపై కేంద్రీకరిస్తూనే బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకోవటానికి మిగిలిన వారు తాపత్రయపడుతున్నారు.
వర్థమాన నాయికలకు సైతం పలు అవకాశాలు రావటం ఆహ్వానించదగిన పరిణామంగా చనలచిత్ర పరిశీలకులు పేర్కొంటున్నారు. నటుడు రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌ కోటబమ్మాళి పిఎస్‌ సినిమా ద్వారా తెలుగుదనంతో అలరించారు. పాయల్‌ రాజ్‌పుత్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సూపర్‌ హిట్‌ అందుకున్నా ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశారు. మళ్లీ ‘మంగళవారం’ సినిమాతో హిట్‌ను అందుకున్నారు. శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్నారు. తాజాగా ఆర్‌సి16 సినిమాలో రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్నారు.

గతంలో ఫ్లాప్‌ సినిమాల్లో నటించిన నాయికలకు అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు ట్రెండ్‌ మారినట్లుగా కనిపిస్తోంది. భామల కెరీర్‌పై పరాజయాల ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. ఫ్లాపులున్నప్పటికీ కొందరు హీరోయిన్లను పిలిచి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్‌’లాంటి పెద్ద విజయాలను అందుకున్నారు. అడవి శేషు సినిమా ‘డకాయిట్‌’, హాలీవుడ్‌ చిత్రం ‘ది ఐ’లో కూడా నటించారు. ‘సలార్‌-2’లో కూడా ఆమె కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘వారసుడు’, ‘యానిమల్‌’ చిత్రాలతో అలరించిన రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్పా2 ది రూల్‌’లో నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో, ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాలు రాబోతున్నాయి. ‘దసరా’తో విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్‌ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ సినిమాల్లో నటిస్తున్నారు. సమంత టైటిల్‌ రోల్‌లో చేసిన ‘శాకుంతలం’ బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. అయితే విజరు దేవరకొండతో చేసిన ‘ఖుఫి ఖుషి..’ కాస్త ఆదరణ పొందటంతో ఆమెలో జోష్‌ నింపిందనే చెప్పాలి. అనారోగ్యం సమస్యల నుంచి కోలుకున్న ఆమె కూడా వరుస సినిమా ప్రాజెక్టులపై నటించే అవకాశం ఉంది. ‘సిటాడెల్‌’ ఓటీటీ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. ‘భారతీయుడు-2’, ‘సత్యభామ’ చిత్రాల్లో కాజల్‌ నటించారు.

‘ఉమ’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. గతేడాది ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రంతో ఆకట్టుకున్న అనుష్క తాజాగా కొత్త సినిమాలపై దృష్టిపెట్టారు. ‘భాగమతి’కి పార్ట్‌ 2 చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ‘కథనార్‌ ది వైల్డ్‌ సోర్సెరర్‌’ అనే మలయాళం సినిమాను అంగీకరించారు. గతేడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. మహేష్‌బాబుతో గుంటూరు కారంతో సందడిచేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లోనూ ఆమెనే హీరోయిన్‌. మీనాక్షి చౌదరి విజరుతో గోట్‌ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్‌తేజ్‌తో మట్కా, దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’, విశ్వక్‌సేన్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. పూజాహెగ్డే గతేడాది తక్కువ సినిమాలే చేశారు. గుంటూరు కారం సినిమాకు మొదట ఆమెనే ఎంపిక చేశారు. ఆమె తప్పుకోవటంతో మీనాక్షి చౌదరి ఛాన్స్‌ దక్కించుకున్నారు.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో సాహిద్‌ కపూర్‌తో ‘దేవా’ చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమాకు పూజానే హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సీతారామం తర్వాత సినిమాల సంఖ్య కంటే పాత్రలపైనే మృణాల్‌ఠాకూర్‌ కేంద్రీకరించారు. గతేడాది ‘హారు నాన్న’తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు అంగీకరించారు. గతేడాది లియో, ‘పీఎస్‌ 2’తో సందడి చేసిన త్రిష స్పీడు పెంచారు. వశిష్ట దర్శకత్వం చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘థగ్‌ లైప్‌’లో ఆమెనే హీరోయిన్‌. ‘రామ్‌’, ‘ఐడెంటిటీ’ అనే మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘తండేల్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో రామాయణంలో సీత పాత్రలో కనిపించనుంది. సాయిపల్లవి, కృతిశెట్టి, రాశీఖన్నా తదితర కథానాయికల సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. ‘ఉప్పెన’ విజయం తర్వాత కృతిశెట్టికి మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగానే ఉంటున్నారు.

➡️