డీప్‌ ఫేక్‌ వీడియో నిందితుడు అరెస్ట్‌ : రష్మిక హర్షం

ఇంటర్‌నెట్‌ : డీప్‌ ఫేక్‌ వీడియో ఘటనకు సంబంధించి నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై నటి రష్మిక హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మార్ఫింగ్‌ వీడియోలు, ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు.

అది నేరం : రష్మిక

”ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు. ప్రేమతో నన్ను ఆదరించి.. అన్నివిధాలుగా అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నా. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. యువతకు చెప్పేదొక్కటే.. అనుమతి తీసుకోకుండా మీ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఎక్కడైనా ఉపయోగిస్తే అది నేరం” అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.

సోషల్‌ మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి అసభ్యకర వీడియో సఅష్టించిన సంగతి విదితమే. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ … రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ నుంచి పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నవంబరు 10న ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం ఎపిలోని గుంటూరుకు చెందిన ఈమని నవీన్‌ (24)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడే ఈ వీడియో సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయని ఢిల్లీ డిసిపి హేమంత్‌ తివారీ అన్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్‌ పేజీని నడిపిన నిందితుడు.. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికే ఈ వీడియో తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

➡️