20 నుంచి ‘విశ్వంభర’ తుది షెడ్యూల్‌

May 18,2024 20:00 #Megastar Chiranjeevi, #movies

చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఫాంటసీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా సమాచారం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ చాలా కీలకమైనందున వీలైనంత ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. జూన్‌ చివరి నాటికి షూటింగ్‌ మొత్తం పూర్తవ్వాలన్న లక్ష్యంతో చిత్ర బృందం పని చేస్తోంది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూల్‌ మొదలు కాబోతుంది. చిరంజీవి, త్రిషతో సహా మిగిలిన టీమ్‌ మొత్తం ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. ఈ షెడ్యూల్‌లో పాటల్ని కూడా తెరకెక్కిస్తారు. చిన్న బ్రేకులు మినహా.. జూన్‌ చివరి వారం వరకూ సుదీర్ఘంగా షెడ్యూల్‌ సాగనుంది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. జులై నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం అవుతాయని చిత్ర బృందం తెలిపింది. సీజీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుందని ఇప్పటికే దర్శకుడు చెప్పారు. అందుకోసం కొన్ని విదేశీ కంపెనీలను చిత్రబృందం సంప్రదించబోతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

➡️