చూడాల్సిన సినిమా ‘దేశం కోసం భగత్‌సింగ్‌’

May 6,2024 18:34 #New Movies Updates

అమరవీరుడు, అసమాన త్యాగధనుడు, దార్శనికుడైన భగత్‌సింగ్‌ జీవితంపై హిందీలో చాలా చిత్రాలు వచ్చాయి. ఇన్నేళ్లయినా తెలుగులో ఒక్క చిత్రం కూడా రాలేదు. ఆ లోటును పూడ్చుతూ రవీంద్ర గోపాల తెలుగులో ‘దేశం కోసం భగత్‌ సింగ్‌’ పేరుతో ఒక పూర్తి నిడివి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ప్రీమియర్‌ షో మే 5న ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దాశరధి థియేటర్స్‌ ఆధ్వర్యంలో జరిగింది. భగత్‌ సింగ్‌ కేవలం విప్లవ వీరుడే కాదు. చిన్న వయసులోనే చాలా అధ్యయనం చేసినవాడు. మంచి రచయిత. జైల్లో ఉంటూనే ఇంగ్లీష్‌, హిందీ, పంజాబీ పత్రికలకు వ్యాసాలు పంపేవారు. రష్యాలో జయప్రదమైన సోషలిస్టు విప్లవం భగత్‌సింగ్‌కి చాలా ఉత్తేజమిచ్చింది. దానితో కమ్యూనిస్టు గ్రంథాలను ప్రపంచ పరిణామాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. దేశం మతోన్మాదుల చేతుల్లో పడరాదని దేశ పౌరులను దాదాపు వందేళ్ల క్రితమే హెచ్చరించాడు. అంతటి గొప్ప విప్లవవీరుడి చిత్రానికి దర్శకుడు, పాటల రచయిత బాధ్యతలను కూడా రవీంద్ర గోపాల్‌ పోషించారు. ప్రముఖ నాటక రచయిత కంచర్ల సూర్యప్రకాశరావు రవీంద్ర కలిసి ఉమ్మడిగా సంభాషణలు రాశారు. ప్రీమియర్‌ షో సందర్భంగా దాశరథి ఫిల్స్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌వికే మేనేజింగ్‌ సెక్రటరీ ఎస్‌, వినరు కుమార్‌, సొసైటీ కార్యదర్శి బిడిఎల్‌ సత్యనారాయణ, సొసైటీ సంయుక్త కార్యదర్శి భూపతి వెంకటేశ్వర్లు రవీంద్ర గోపాల్‌ని సన్మానించారు.

➡️