‘హరి హర వీర మల్లు’ టీజర్‌ విడుదల

పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్‌, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వీరమల్లుగా వెండితెరపై పవన్‌ కళ్యాణ్‌ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా నిర్మాతలు ఓ తీపి కబురు చెప్పారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు. మొదటి భాగం ”హరి హర వీర మల్లు పార్ట్‌-1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ”ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక.


టీజర్‌ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. ”ఎనక్కు 20 ఉనక్కు 18”, ”నీ మనసు నాకు తెలుసు”, ”ఆక్సిజన్‌” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు ”నట్పుక్కాగ”, ”పడయప్ప” వంటి కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం షుటింగ్‌ ను, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను క్రిష్‌ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

➡️