పదవికి పరీక్ష

Mar 21,2024 05:30 #jeevana, #mini katha

అమరావతి నగరంలోని జమిందారు రాఘవయ్యకు తన వ్యాపార విషయాలు చూసుకునేందుకు నమ్మకమైన ఉద్యోగి అవసరం అయ్యాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారందరినీ పరీక్షిస్తున్నారు. చివరికి రాముడు, సోముడు అనే యువకులు మిగిలారు. ఆ ఇద్దరిలో ఎవరు సరైనవాడో తేల్చాలని, ఇద్దరికీ చెరి ఐదు రూకలు ఇచ్చి ‘భోజనం చేసి రమ్మ’ని చెప్పాడు జమిందారు.భోజనం చేసి వచ్చిన రాముడు నాలుగు రూకలు జమిందారుకు అందించగా, సోముడు రెండు రూకలే తిరిగి ఇచ్చాడు. ఇంతలో ఓ యువకుడు వచ్చి ‘నమస్కారం జమీందారు గారు, నేను రంగనాథం గారి కుమారుడ్ని. నాన్న గారు ఈ రెండు వేల వరహాలు తమకు ఇచ్చి రమ్మన్నారు’ అని రెండు మూటలు ఇచ్చి వెళ్ళాడు.

‘నాయనలారా.. మీరు చెరో వరహాల మూటతో చెరొక గదిలోకి వెళ్ళి లెక్కించుకు రండి’ అన్నాడు జమిందారు. కొద్ది సేపటికి రాముడు వరహాల మూటను జమిందారుకు అందించి ‘ఇందులో ఐదు వరహాలు అధికంగా ఉన్నాయి’ అన్నాడు. అప్పుడే బయటికి వచ్చిన సోముడు ‘ఇందులో వేయి వరహాలు సరిగానే ఉన్నాయి’ అన్నాడు.ఇద్దరిలో సరైన ఉద్యోగి ఎవరో జమీందారుకు తెలిసిపోయింది. ఆ విషయమే వాళ్లకి వివరంగా చెప్పాడు. ‘నాయనా, సోముడు భోజనంలో నీ దుబారాతనం కనిపించింది. అలాగే మీకు ఇచ్చిన రెండు వరహాల మూటల్లో వెయ్యికి పైన ఐదు వరహాలు ఎక్కువ ఉండేలా ఏర్పాటు చేశాను. అంటే నీకు ఇచ్చిన వరహాల మూటలో ఐదు దొంగిలించావు. నీలో ధనం పొదుపు తెలియకపోవడం, దొంగతనం అనే అవలక్షణాలు ఉన్నాయి. కాబట్టి, నీవు ఈ పదవికి అనర్హుడివి. రాముడికే ఈ ఉద్యోగం ఇస్తున్నాను’ అని జమిందారు ప్రకటించాడు.

– బెల్లంకొండ నాగేశ్వరరావు, చెన్నయ్

➡️