పనిలో ఆనందం

Mar 23,2024 05:15 #jeevana

తిరుపతిలో ఉన్న కృష్ణస్వామి మామయ్య రాసిన ‘నాన్నరం’ కథల పుస్తకాన్ని ఇంటికి తెచ్చి ఇస్తూ, ‘తిరుపతిలో అనుకోకుండా కృష్ణస్వామి గారిని కలిసాము. ఈ వీధిలో మేమున్నామని తెలిసాక ఆయన రాసిన పుస్తకాన్ని మీ ఇంటిలో ఇవ్వమని ఇచ్చారు’ అంటూ చెప్పి వెళ్ళింది పక్కింటి బామ్మ.
పుస్తకాలు చదవడం బాగా ఇష్టమున్న, ఆరవ తరగతి చదువుతున్న అద్విక్‌ ‘ఇప్పుడే ఈ పుస్తకం చదవాలి’ అనుకొంటూ పుస్తకాన్ని తీసుకోబోయాడు. ‘పుస్తకానికి అట్ట వేసాక చదవాలి’ అని అమ్మ షరతు పెట్ట్టింది. అట్ట వేయడానికి కావలసిన అట్ట పేపరు, కత్తెర, బంక బాటిల్‌ను టేబుల్‌ మీద వుంచి, నిదురపోతున్న నాన్న ఎపుడు లేస్తారా అని చూడసాగాడు అద్విక్‌.
‘మీ నాన్న నిద్ర లేచే లోపున ఉగాది పచ్చడి చెయ్యాలి. లోకనాథం మామయ్య ఇంటిదగ్గరున్న వేపచెట్టులో పువ్వు అడిగి తీసుకునిరా’ అంది తల్లి. వేపపువ్వు కోసం అద్విక్‌ వెళ్ళాడు. అక్కడ ఐదవ తరగతి చదివే చైతన్య, ఓ పొడవాటి కర్ర చివరన కత్తి కట్టి చెట్టుపై ఉన్న వేపపువ్వు కోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోపు లోకనాథం వచ్చి ‘చైతన్యా, నేను కోస్తాను’ అన్నాడు.
‘మామయ్యా, నావల్ల కాకుంటే మిమ్మల్ని సాయం అడుగుతాను. ఎవరి పని వారు చెయ్యాలంట. అలా చేయడం వల్ల ఆనందం వుంటుందట. అలాగని మా రామ్మూర్తి తాతయ్య చెప్పారు’ అని లోకనాథాన్ని వారించాడు చైతన్య.
ఆ మాటలు అద్విక్‌ను ఆలోచింప చేశాయి. చైతన్య వెళ్ళాక ఆ కర్ర తీసుకొని వేపపువ్వు కోశాడు. వేపపువ్వు తీసుకెళ్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. తానే స్వయంగా కోశానని అమ్మతో చెబితే తను కూడా సంతోషించింది. ‘పుస్తకానికి అట్ట కూడా నేనే వేసుకుంటాను. నాన్న లేచేదాకా ఎదురుచూడను’ అని చెప్పి అట్ట వేసి పుస్తకం చదవడం ప్రారంభించాడు.
ఎప్పుడూ లేనిది ఈ ఏడాది ఉగాది పచ్చడి తింటున్నప్పుడు అద్విక్‌కి అందులో చేదు అనిపించలేదు. బహుశా అది ఇతరుల మీద ఆధారపడకుండా పనిచేయడంలో ఉన్న ఆనందం తాలూకు తీపి కాబోలు.

– ఓట్ర ప్రకాష్‌ రావు, తిరుత్తణి, 097874 46026.

➡️