విపత్తు – వివేకం

Jan 22,2024 10:10 #feachers, #katha

పూర్వం సింహళం రాజ్యాన్ని సింహబలుడు అనే రాజు పాలిస్తుండే వాడు. ఆయన పాలనలో ఓ పెద్ద అరణ్యం వుండేది. అందులో అరణ్యానందుడు పర్ణశాలను నిర్మించుకుని విద్యాభ్యాసం నేర్పేవాడు. ఆయన వద్ద ఎందరో విద్య నేర్చుకుని ఉన్నత స్థానాలను అధిరోహించారు. అందులో రాజు వద్ద వున్న మంత్రి మరీచుడు కూడా వున్నాడు. నిరక్షరాస్యుడైన సింహబలుడికి తలలో నాలుకలా ఉంటూ రాజ్యాన్ని ప్రగతి పథంలో నడిపించేవాడు. అయితే రాజు, తన మూర్ఖత్వంతో, తెలివి లేని ఆలోచనలతో మంత్రిని ఎప్పుడూ ముప్పు తిప్పలు పెట్టేవాడు.ఓసారి రాజ్యంలో వరదలు వచ్చి, అపరిశుభ్రత అధికమైంది. దోమలు ఎక్కువై విష జ్వరాలు ప్రబలాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చూస్తున్న సింహబలుడు మంత్రిని పిలిచి ‘దేవుడు మన రాజ్యంపై పగపట్టాడు. అందరూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. పూజలు చెయ్యమని ప్రజలకు చెప్పండి’ అని ఆజ్ఞాపించాడు.మంత్రి మరీచుడుకి ఇది నచ్చలేదు. ‘ప్రభూ! దోమలు వ్యాపించి ప్రాణాలు పోతుంటే పూజలు చేస్తే ఏం వస్తుంది? జ్వరాలు అదుపులోకి వస్తాయా? జ్వరాలు అదుపులోకి రావాలంటే దోమల్ని నిర్మూలించాలి. ఆ పని చేయండి..!’ అని హితవు చెప్పాడు. ఆ మాటలు సింహబలుడికి నచ్చలేదు. తను చెప్పినట్లు చేయాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు.రోజులు గడుస్తున్నా, జ్వరాలు అదుపులోకి రాలేదు. రాజు ప్రవర్తనతో విసిగిపోయి ప్రజలు బాధపడసాగారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎలాగైనా ప్రజల్ని బయటపడేయాలని, మరీచుడు అరణ్యానందుడిని కలిసి ఉపాయం అడిగాడు.పరిస్థితిని విన్న అరణ్యానందుడు రాజ్యంలోకి వచ్చాడు. ప్రజలు పడుతున్న పాట్లు గమనించాడు. అపరిశుభ్ర పరిసరాలను శుభ్రం చేశాడు. దోమల నివారణ మందు తెచ్చి పిచికారీ చేశాడు. కొద్ది రోజులకు దోమలు అదుపులోకి వచ్చాయి. దీన్ని చూసి ప్రజలు అరణ్యానందుడిని, మంత్రిని ప్రశంసించారు. ఈ విషయం సింహబలుడుకి తెలిసింది. ‘మీరంతా దైవానికి పూజలు చేయడం వల్లే విష జ్వరాలు తగ్గాయి. ఇదంతా నా కృషి. మీరు నన్ను గౌరవించాలి కాని.. వాళ్లని ప్రశంసిస్తారేంటి’ అని ఆగ్రహించాడు. అప్పుడు ప్రజలు జరిగింది వివరించారు. అది విన్న సింహబలుడికి నిజం బోధ పడింది. విపత్కర సమయంలో వివేకంతో ఆలోచించాలని తెలిసింది. తను చేసిన పొరపాటుకు ‘క్షమించండి’ అని కోరాడు. ఆ తర్వాత అరణ్యానందుడిని తన సలహాదారుగా నియమించుకొని, వివేకంతో పాలించసాగాడు.- బోగా పురుషోత్తం, తుంబూరు.

➡️