సంక్రాంతి శతకం

Jan 13,2024 10:26 #jeevana

రైతు పంటలన్ని రాశులు పండించి

పొలము నుంచి తెచ్చి పూర్తి జేసి

పంటచేతి కొచ్చి పరవశమ్మును పొంది

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

ముచ్చట గొలిపేటి ముంగిట ముగ్గులు

ముగ్గులందు గొబ్బి పూల సొబగు

రంగు రంగులొలుకు రంగవల్లుల శోభ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

పనికి రానివన్ని పాత వస్తువులన్ని

తెల్లవారుజాము తెచ్చి వేసి

పోటి పడుతు ప్రజలు భోగిమంటలు వేయ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

పైరు పంటలన్ని పచ్చగా పండించ

పశువు కష్టపడుతు బరువు మోసె

పశువు పూజ జేయు పశువుల పండుగ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

గంగిరెద్దు వచ్చి గడపలన్ని తిరిగి

కొత్త ధాన్యపు రుచి కొరకి జూచి

పరవశించి యాడు పండుగ రోజున

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

హరి హరి యని వచ్చి హరిదాసు పాడంగ

చిడతలు కొడుతున్న చెవులకింపు

కొత్త ధాన్యములను కొత్త కోడలు వేయ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

దేశమును విడిచి విదేశమ్ము వెళ్ళిన

పిల్లలంత వచ్చి ఇల్లు నిండు

సంకురాత్రి కలిపె సకుటుంబమును జూడ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

పిల్లలంత జేరి అల్లరి జేయుచు

పైకెగురు పతంగు పైకెగురని

గాలి పటము వదిలి గంతులు వేయగ

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

పేద వాడు జూడ పేగులు మాడ్చుచు

మంచి భోజనమ్ము మరచిపోవు

పంచభక్ష్యములను పండుగ తినమని

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

గూడు లేని భిక్ష గాడు పంటను జూచి

భిక్ష మెత్తుకొనగ బింకమిడుచు

తిండికి తిన లేని దీనుల బ్రతుకున

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

మారునర్కుని కక్ష్య ఆగమనంలో

ఉత్తరాయణమ్ము కొత్త కాంతి

మకర సంక్రమణము మార్చును స్థితులను

సంబరాలు తెచ్చె సంకురాత్రి

 

ఆంధ్ర రాష్ట్రమందు నాచార వ్యవహార

సంప్రదాయ మనగ సంస్కృతియన

పండుగలను చూసి పసిగట్టు పిల్లలు

సంబరాలు తెచ్చె సంకురాత్రి

– ఆవుల చక్రపాణి యాదవ్‌, 99633 50973.

➡️