కాప్‌ సదస్సులో గళమెత్తిన మణిపూర్‌ బాలిక

Dec 13,2023 10:21 #Jeevana Stories

            ‘మన భవిష్యత్తు కోసం మన భూగ్రహాన్ని రక్షించండి. శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి’ అంటూ తలపై ప్లకార్డు పట్టుకొని 12 ఏళ్ల లిసీప్రియా కంగుజం, దుబారు వేదికగా ‘కాప్‌-28’ ప్రపంచ వాతావరణ సదస్సులో గళమెత్తింది. తనను వారించ వచ్చిన పెద్దల నుండి తప్పించుకుంటూ, స్టేజిపై అటూ ఇటూ తిరుగుతూ, ఇంధన వినియోగం వల్ల కలిగే అనర్థాలను ఎత్తిచూపింది. నివారణా చర్యలు తీసుకోమని సభ్యదేశాలకు సూచించింది. లిసి ప్రసంగించినంత సేపూ వేదిక నుండి తనని దింపేంచేందుకు నిర్వాహకులు తెగ ప్రయత్నం చేశారు. అయినా తనని ఆపలేకపోయారు. తాను చెప్పాల్సింది చెప్పి, లిసి, స్టేజి దిగిపోయింది.

అక్కడున్న పెద్దలంతా లిసి సాహసానికి ముగ్ధులయ్యారు. ఆమె ధైర్యానికి తమ చప్పట్లతో ప్రశంసించారు. ఆ వేదికమొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయిన వేళ, ‘కాప్‌ 28’ డైరెక్టర్‌ జనరల్‌ అంబాసిడర్‌, మరొక్కసారి సభికులతో ఆ చిన్నారికి చప్పట్లు కొట్టించారు. ఇంతటి సాహసం చేసిన ఆ చిన్నారి మన దేశం నుండి కాప్‌ సదస్సుకు హాజరైంది. ఆరునెలలకు పైగా అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్‌ వాసి ఆ బాలిక.

నవంబర్‌ 30న ప్రారంభమైన ‘కాప్‌ 28’ సదస్సు డిసెంబర్‌ 12తో ముగిసింది. దీనికి 190 దేశాల నుంచి 60 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈస్ట్‌ తైమూర్‌ ప్రత్యేక రాయబారిగా మన లిసీ సదస్సుకు హాజరైంది.

పర్యావరణంపై గళమెత్తడం లిసీకి కొత్తకాదు. చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. ‘క్లైమేట్‌ ఛేంజ్‌ లా’ తీసుకురావాలంటూ మన పార్లమెంటు ముందూ ప్రదర్శనలు చేసింది. లిసీ కృషికి గాను ‘వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌ 2019’ తనని వరించింది.

‘ఈ రోజు వాతావరణ సంక్షోభానికి ప్రధాన కారణం బొగ్గు, చమురు, గ్యాస్‌. వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. ఈ రోజు మీ చర్యే రేపటి మా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మేము ఇప్పటికే వాతావరణ మార్పుల బాధితులం. నేను, నా భవిష్యత్‌ తరాలు అదే పర్యవసానాలను ఎదుర్కోవాలి. నాయకుల వైఫల్యాలకు లక్షలాది మంది అమాయక పిల్లల ప్రాణాలను బలి ఇవ్వడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.

‘వాతావరణ వైపరీత్యాల కారణంగా నాలాంటి లక్షలాది మంది పిల్లలు తమ జీవితాలను కోల్పోతున్నారు, వారి తల్లిదండ్రులను కోల్పోతున్నారు, నివాసాలను కోల్పోతున్నారు. ఇది నిజమైన వాతావరణ అత్యవసర పరిస్థితి. యుద్ధాలకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసే బదులు, ఆకలిని అంతం చేయడానికి, విద్యను అందించడానికి, వాతావరణంతో పోరాడటానికి ఖర్చు చేయండి’ అంటూ ఎన్నోసార్లు తన గళాన్ని వినిపించిన లిసీ, కాప్‌ సదస్సులో తన ప్రసంగాన్ని ముగించేముందు, ‘మేము పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, త్రాగడానికి స్వచ్ఛమైన నీరు, జీవించడానికి స్వచ్ఛమైన గ్రహం కావాలి. వీటన్నింటినీ కోరడం మా ప్రాథమిక హక్కు’ అని తీవ్ర స్వరంతో నినదించింది.

‘నేను నిరసన తెలియజేయడంతో వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే.. నాకు మద్దతు ఇవ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది. ఐరాస వద్ద నా గళాన్ని వినిపించే హక్కు ఉంది’ అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను ట్యాగ్‌ చేస్తూ ఈ సంఘటన తరువాత లిసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దేశంలో ఎంతోమంది చిన్నారుల ప్రతినిధిగా తన గళాన్ని వినిపించిన లిసీ సాహసానికి మనమూ జైకొడదాం.

➡️