ఎండల వేళ.. జాగ్రత్త ఇలా..

Mar 4,2024 10:17 #feachers, #Jeevana Stories

వేసవి ప్రారంభంలోనే ఎండలు భయపెడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతల ఉధృతి పెరుగుతోంది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా రోజువారీ పనులు చక్కబెట్టుకోవటం తప్పదు. కాబట్టి, వేడి నుంచి రక్షణ, ఉపశమనం పొందటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సాధ్యమైనంతవరకు ఎండలో తిరగకుండా ఉండటమే మంచిదని నిపుణుల సూచన. ఒక వేళ తప్పనిసరై వెళితే చేతిలో గొడుగు లేదా తలకు టోపీ ధరించాలి. దిన చర్యల్లో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా వేసవి సమస్యల నుంచి కొంతవరకైనా దూరంగా ఉండొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి : ఎండలకు శరీరం డీ హైడ్రేషన్‌ను గురవుతుంది. తద్వారా శరీరానికి ఎక్కువ ద్రవాలు అవసరం. తరచూ మజ్జిగ, లస్సీ, మిల్క్‌ షేక్‌ మొదలైన పానీయాలను తీసుకుంటే కొంత ఉపశమనం పొందొచ్చు. ఉప్పు, చక్కెర కలిపిన ద్రావణాన్ని కూడా తాగొచ్చు. ఇది శరీరంలో నీటి లోపాన్ని తొలగించటానికి సహాయపడే ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు, దోస తరచూ తీసుకుంటే వాటిల్లోని నీరు, పోషకాలతోపాటు ఎలక్ట్రోరైట్స్‌ కూడా శరీరానికి అందుతాయి. పండ్లు నేరుగాగానీ, రసాల రూపంలో గానీ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాప్ట్‌డ్రింక్స్‌ తీసుకోవటం వల్ల అందులోని సోడియం, పంచదార వల్ల దాహర మరింత పెరుగుతుందేకాని తగ్గదు. పైగా వాటిలో ఇతరత్రా పోషకాలు ఉండవు. ఎండు ద్రాక్ష, కర్జూరం నాన బెట్టిన నీళ్లను తాగినా మంచిదే!

పులుపు పదార్థాలతో మేలు : విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను ఈ కాలంలో తీసుకుంటే మంచిది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచటానికి దోహదపడతాయి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. తద్వారా సూర్యుని కఠినమైన కిరణాల నుంచి శరీరాన్ని రక్షించటానికి దోహద పడతాయి. విటమిన్‌ సి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినటం వల్ల చర్మం సూర్య కిరణాలు, వాయు కాలుష్యంతో పోరాడటానికి సహాయపడతాయి.

తాజా కూరగాయలు : శరీరంపై సూర్యరశ్మి చెడు ప్రభావాలను నివారించటానికి, ఆకుపచ్చ కూరగాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పాలకూర, పుదీనాలను తినటం వల్ల కాల్షియం, ఐరన్‌, పొటాషియం, నీరు ఎక్కువగా శరీరానికి అందుతాయి. కేరట్‌ వంటి పచ్చి కూరగాయలు తినటం ఎంతో మంచిది. వీటిలో కెరోటినాయిడ్‌ కంటెంట్‌ ఉంటుంది. వీటి ద్వారా శరీరంలో విటమిన్‌ ఎ ఉత్పత్తి అవుతుంది.

అరటి పండు, పెరుగు తీసుకోవాలి : వేసవిలో అరటిపండు, పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పెరుగులో ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. వీటి వల్ల కడుపు చల్లగా ఉంటుంది. వేసవిలో డయేరియా సమస్యలను తగ్గించటంలో అరటి పండు ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను కూడా బలపరుస్తుంది.

మసాలాలు వద్దు : ఎండల నుంచి బాహ్య శరీరాన్ని ఎలా కాపాడుకుంటామో అలాగే అంతర్గత శరీరాన్ని కూడా అలాగే కాపాడుకోవటం ముఖ్యం. ఈ కాలంలో చాలా కారంగా, ఘాటుగా ఉండే మసాలాలలతో కూడా ఆహార పదార్థాలు తినకుండా ఉండటమే మేలు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అధిక ప్రొటీన్‌, చక్కెర ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్ల రసాలు, కొబ్బరినీరు మొదలైనవి తరచూ తాగటం వల్ల చర్మ సంరక్షణకు కూడా మేలు జరుగుతుంది.

ఇవీ, పాటించండి!

  •  స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కలు వెనిగర్‌ను వేస్తే చెమట వాసన ఉండదు.
  •  నిమ్మరసం ముఖానికి రాసుకుని ఓ అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే ముఖం స్వచ్ఛంగా ఉంటుంది.
  •  ఎండలో తిరిగే సమయంలో జుట్టును గుడ్డతో కవర్‌ చేయాలి. లేదంటే ఎండ వేడికి వెంట్రుకలు చిట్లిపోయి రంగు మారిపోయే ప్రమాదం ఉంటుంది.
  •  ఎండ కారణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నల్లబడటం, దద్దుర్లు రావటం, మృదుత్వం కోల్పోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఒంటిని మొత్తం కప్పిఉండేలా కాటన్‌ దుస్తులు ధరించాలి.
➡️