అమ్మకి ఇల్లు కట్టడం

Jun 20,2024 04:52 #chinnari, #feachers, #jeevana

ఆ రోజు ఆదివారం కావడంతో తల్లిని చూడ్డానికి స్వగ్రామం వెళ్ళాడు శంకరం. తల్లి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. ‘నాయనా ఈ గదిలో బల్బు పనిచేయలేదు. లక్ష్మణరావుకి చూపించి బాగు చేయించు. పెరట్లో కిటికీ తలుపు ఊడిపోతోంది. అది కూడా బాగుచేయించు.’ అంది ముసలి తల్లి.
‘ఇప్పుడు సమయం లేదమ్మా! మళ్ళీ వారం తప్పకుండా చేయిస్తాను’ అన్నాడు శంకరం. ‘నువ్వు అమ్మకి ఇల్లు కడతావురా నాకు తెలుసు’ అంది తల్లి.
‘అమ్మా ఎందుకలా అన్నావో కాస్త చెప్పవా?’ అని అడిగాడు శంకరం.
పూర్వం శివలింగపురంలో సత్తవ్వ ఒక పూరి గుడిసెలో నివసించేది. ఆమెకు చిన్నతనంలోనే రాజయ్యతో పెళ్ళయింది. కన్నవారి ఊరు అత్త వారి ఊరు అదే కావటంతో సత్తవ్వకి మరో ప్రపంచం తెలియకుండా పోయింది. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త కాలం చేశాడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. హాస్టల్లో ఉంచి చదివించింది. పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. వాళ్లంతా పట్నాల్లో స్థిరపడ్డారు. అమ్మకి ఇల్లు కట్టాలి అనుకున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి కడతామన్నారు. వారసత్వంగా వచ్చిన భూమి అమ్మడానికి సత్తవ్వ ఒప్పుకోలేదు. ముగ్గురు కొడుకులు కలిసి ఇల్లు కట్టాలి అనుకున్నారు. మూడో వాడి భార్య ‘రేపోమాపో మీ అమ్మ చచ్చిపోయేదే.. పల్లెటూళ్లో ఇల్లు ఎందుకు? పెట్టుబడి దండగ’ అంది.
రెండో వాడి భార్య ‘మీ అమ్మను తలొక మూడు నెలలు చూసుకుందాం. అప్పుడు ఇల్లు కట్టక్కర్లేదు’ అంది. దాంతో ఆ ఆలోచన వాయిదా పడింది. ఇలా అనేక సార్లు అమ్మకి ఇల్లు కట్టాలి అనుకోవడం, అది కార్యరూపం దాల్చకపోవడం జరిగింది.
సత్తవ్వను కొడుకులు పట్నం తీసుకువెళ్దామని శతవిధాల ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ ఊరిని, ఆ ఇంటిని వదిలి ఉండలేక ఎక్కడికీ వెళ్లేది కాదు. చివరకు ఆ ఇంట్లోనే ప్రాణాలొదిలింది. సత్తవ్వ ఊరు వదిలి వెళ్లలేదు, కొడుకులు ఇల్లు కట్టలేదు. బతికుండగా అమ్మకు ఇల్లు కట్టలేక పోయామని కొడుకులు ఎంతో బాధపడ్డారు. నాటినుంచి చేస్తామని చెప్పిన పని చెయ్యక పోయినా, వాయిదాలు వేసిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతున్నారు.
‘నీ వరస కూడా అలాగే ఉంది’ అని నిట్టూర్చింది తల్లి. తల్లి బాధను అర్థం చేసుకున్న శంకరం వెంటనే తల్లి చెప్పిన పనులు చేయించాడు.

కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️