ఇలా శుభ్రం చేయండి..

May 10,2024 04:20 #jeevanaa

శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. సాధారణంగా వంట పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే.. పాత్రలను మురికి లేకుండా శుభ్రంగా కడగడం మరో ఎత్తు. ప్రస్తుత కాలంలో దాదాపు అందరి ఇళ్లలోనూ స్టీల్‌ పాత్రలలోనే వంటలు చేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడం సులభమే. కానీ, రోటీ, దోశ, చపాతి చేసే ఐరన్‌ పాత్రల జిడ్డు వదిలించడం కష్టమైన పని. ఐరన్‌ పాత్రలో కూరలు వండటం వల్ల అవి త్వరగా నల్లగా మారుతాయి. నూనె పొరలు పేరుకుపోతాయి. నల్లగా మారిన ఐరన్‌ పాత్రలో వండిన ఆహారం కూడా నల్లగా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను శుభ్రం చేయడం కూడా కష్టం. అయితే, చిన్న చిట్కాలతో వంటపాత్రలను తళతళలాడేలా చేసుకోవచ్చు.
బేకింగ్‌ సోడా, ఉప్పుతో : ఒక లీటరు నీటిలో నాలుగు చెంచాల బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి మరిగించాలి. ఆ వేడి నీటిని నల్లగా మారిన ఐరన్‌ పాత్రలో పోసి అరగంట సేపు ఉంచాలి. తర్వాత స్క్రబ్బర్‌తో కడిగేస్తే సరిపోతుంది.
నిమ్మకాయతో : చాలా వస్తువులను శుభ్రం చేయడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, నాలుగు చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్‌ పౌడర్‌, నూనె వేసి పది నిమిషాలు మరిగించాలి. ఆ నీరు పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్‌ : పాత్రలకు పట్టిన మరకలను తొలగించడంలో వెనిగర్‌ బాగా పనిచేస్తుంది. మరకలు పడిన గిన్నెలో నీరు, వైట్‌ వెనిగర్‌ సమాన పరిమాణంలో వేసి నానబెట్టాలి. నానబెట్టిన అనంతరం బ్రష్‌తో స్క్రబ్‌ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వెనిగర్‌లో ఉండే యాసిడ్‌ లక్షణాలు మరకలను వదిలించడానికి సహాయపడతాయి.

➡️