గొప్ప మానవతావాది డాక్టర్‌ సిరిపురపు జ్యోతి

Jan 24,2024 10:34 #feature

కమ్యూనిస్టు నాయకులు నాగళ్ల జానకీరామయ్య, రాజేశ్వరమ్మల గారాలపట్టి డాక్టర్‌ సిరిపురపు జ్యోతి గొప్ప మానవతావాది. మత్తు డాక్టర్‌ (ఎనస్తీషియా)గా సుపరిచితురాలైన ఆమె గురించి, ఆమె సేవల గురించి ఉయ్యూరు ప్రాంతంలో చాలామందికి తెలుసు. తల్లి నుంచి కమ్యూనిస్టు భావాలను అంది పుచ్చుకున్న ఆమెలో నరనరాన ఉన్నది అభ్యుదయమే! సమ సమాజాన్ని కోరుకున్న ఆమె తన వంతుగా పేదరికాన్ని రూపుమాపే కృషిలో భాగంగా అనేక సేవలు అందించారు. సామాన్యులకు అనేక విధాలుగా సహాయపడ్డారు. తన తల్లిదండ్రులు నాగళ్ల జానకిరామయ్య, నాగళ్ల రాజేశ్వరమ్మ పేరున ఉన్న ట్రస్టు ద్వారా తాను మరణించాక కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వృత్తిలోనూ, ప్రవృత్తిగానూ మానవతావాదిగా మెలగిన డాక్టర్‌ జ్యోతి బుధవారం కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కాటూరులో తుదిశ్వాస విడిచారు.

           సిరిపురపు జ్యోతి (83) గురించి తెలుసుకునేముందు ఆమె తల్లి నాగళ్ల రాజేశ్వరమ్మ గురించి ప్రస్తావించటం ఎంతైనా సందర్భోచితం. మహిళా ఉద్యమనేతగా, కమ్యూనిస్టు నాయకురాలిగా ఆమె ఎంతో ఉద్యమస్ఫూర్తితో పనిచేసే వారు. మృదు స్వభావి అయిన భర్త నాగళ్ల జానకి రామయ్య కూడా ఆమెకు బాగా సహకరించేవారు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, తెలంగాణా సాయుధ పోరాటకాలంలో భయంకరమైన నిఘా ఉన్న సమయంలో వీరి ఇల్లు కమ్యూనిస్టులకు రహస్య స్థావరంగా ఉండేది. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామం కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా ఉండేది. జ్యోతిని చూసుకోవటానికి నాన్న తప్ప ఇంకా ఎవ్వరూ ఉండేవారు కాదు. కుటుంబ సభ్యులు కొంతమేరకు సహకరించేవారు. మిగతా అందరూ ఉద్యమ సంబంధికులే వారి బంధుమిత్రులు. వసతి గృహంలో ఉంటూనే జ్యోతి తన ఉన్నత విద్యాభ్యాసం, ఆ తర్వాత విశాఖలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. వారి ఇల్లు ప్రజా ఉద్యమకారుల రాకపోకలతో సందడిగా ఉండేది.

ప్రేమవివాహం

వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయం లోనే జ్యోతి, జగత్‌ ప్రేమించుకుని 1965 లో కులాంతర ప్రేమవివాహం చేసుకున్నా రు. ఆ తర్వాత వారు నెల్లూరు ప్రజా వైద్యశాలలో కొంతకాలం పనిచేశారు. 1967లో డాక్టర్‌ జగత్‌ అత్యంత సాహసో పేతంగా ఒక సర్జరీ చేశారు. ఆ సమయంలో జరిగిన పొరపాటు వల్ల ఆయనకు అంటువ్యాధి సోకి, చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనతో జ్యోతి, ఆమె కుటుంబం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ తర్వాత 1977లో డాక్టర్‌ ప్రసాద్‌ను జ్యోతి వివాహం చేసుకున్నారు. తర్వాత అమెరికా, ఇంగ్లాండ్‌, దుబాయ్ లలో వైద్యరాలుగా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌లోనూ ప్రాక్టీస్‌ కొనసాగించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో ఉయ్యూరుకు ప్రాక్టీస్‌ను మార్చారు. తల్లిదండ్రుల ఆశయ సాధనను కొనసాగిస్తూ ఎందరికో వైద్య సేవలు అందించారు.

ఆదర్శాల బాటలో …

కృష్ణా జిల్లాలో మహిళా ఉద్యమ నిర్మాతలు మానికొండ సూర్యావతి, నాగళ్ల రాజేశ్వరమ్మ. రాజేశ్వరమ్మ సనాతన, ధనిక కుటుంబంలో పుట్టినా 1930 కాలం నాటి అనేక కట్టుబాట్లను తెంచుకుని, సామాజిక స్ఫూర్తితో కుటుంబానికి సైతం దూరంగా ఉండి మహిళా చైతన్యం కోసం పనిచేశారు. 1936లో పితృస్వామ్య భావజాలాల పట్ల కొనసాగుతున్న వివక్ష పూరిత ధోరణులు, ఘోషా పద్ధతి, సనాతన ఆచారాలు, అవిద్య, బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటివి సమాజంలో పాతుకుపోయిన దుస్సంప్రదా యాలు. వాటికి వ్యతిరేకంగా రాజేశ్వరమ్మ పనిచేశారు. మహిళలను చైతన్యపరిచారు.

అప్పట్లో రచ్చబండలపై కూర్చున్న మగవారి హేళనలు ఒకవైపైతే, ఆడవాళ్ల ఛీత్కారాలు మరోవైపు ఎదురైనా ఆమె నిరుత్సాహపడలేదు. శాంత స్వభావి అయిన భర్త జానకిరామయ్యను కూడా ఊళ్లో పెద్దలు రెచ్చగొట్టేవారు. ఆడవాళ్ళు ఇలా ఊళ్ళవెంట తిరిగితే కుటుంబ ప్రతిష్ట, వంశగౌరవం గంగ పాలవుతూ వుంటే చూస్తూ ఊరుకుంటున్నావనే వారు. అయినా, ఆయన భార్య పక్షానే నిలిచారు. ఆమె చేస్తున్నది సంఘసేవ తప్ప నష్టం కలిగించే పని కాదని అనేవారు. ఇలాంటి ఎన్నో ఘటనలను బాల్యంలో కూతురు జ్యోతికి తల్లి చెప్పేవారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, నడుస్తున్న బాట మంచిది అయినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఉద్బోధించేవారు. జ్యోతి కూడా తన వృత్తిలో, సేవాదృక్పథంలో ఆ అమ్మ బాటనే కొనసాగించారు. జీవితాంతం తోటివారికి తోడ్పాటును అందిస్తూ, వారి అభ్యున్నతి కి సహాయపడుతూ మానవతావాదిగా నిలిచారు.

సామాజిక సేవల్లోనూ …

           ఆలయాల వద్ద బిక్షాటన చేసేవారికి అన్నదానం, వస్త్రదానం చేసేవారు. చలికాలంలో దుప్పట్లు వంటివి పంపిణీచేసేవారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేయటానికి ఐదుగురు సహాయకులను పెట్టుకున్నారు. వారు చనిపోయిన తర్వాత కూడా వర్కర్ల పట్ల దయార్థ హృదయంతో వ్యవహరించేవారు. వారి అవసరాలను శ్రద్ధాశక్తులతో బాధ్యతగా తీసుకుని వీలైనంత సహాయాన్ని అందిస్తున్నారు. ఆయా కుటుంబాల్లో పిల్లల చదువులకు సైతం ఆమే ఆర్థిక సహాయం చేస్తున్నారు.

మానవత్వంతో వైద్య సేవలు

ఉయ్యూరులో ఎనస్తీషియా సేవల కోసం వెళ్లిన పేదల వద్ద నుంచి ఎలాంటి డబ్బులు తీసుకునేవారు కాదు. ఇంకా వారికే ఫండ్లు కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చేవారు. ఇక్కడి నుంచి విజయవాడ, ఉయ్యూరులో ఆసుపత్రికి ఎవరైనా రోగులను పంపించాల్సివస్తే సంబంధిత డాక్టర్లతో ఆమె స్వయంగా మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చును తానే భరించేవారు. తన వద్దకు వచ్చే పేద రోగులకు మందులు, ఛార్జీలు సైతం ఇచ్చి పంపించిన సందర్భాలు ఎన్నో!                                పేదరికంవల్ల చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఎవ్వరు వెళ్లినా డాక్టర్‌ జ్యోతి కాదనకుండా ఆర్థిక సహాయం చేసేవారు. మెరిట్‌ విద్యార్థులను ప్రోత్సహించేవారు. వైద్యాన్ని డబ్బు తెచ్చి పెట్టే వృత్తిగా తాను ఎప్పుడూ భావించలేదు. వైద్యపరమైన సలహాలు, సూచనలు మానవతా దృక్పథంతోనే అందించేవారు. తనకు తెలిసిన రోగులకు ఇతర ఆసుపత్రుల్లో వైద్యం జరుగుతున్నప్పుడు డాక్టర్లతో మాట్లాడి, ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు.

అమ్మానాన్నల ట్రస్టు కోసం …

          ఉయ్యూరులో నాగళ్ల జానకిరామయ్య, తల్లి నాగళ్ల రాజేశ్వరమ్మల పేరిట విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు. దానికి డాక్టర్‌ జ్యోతి రూ.30 లక్షలను సమకూర్చారు. కరెంట్‌, జనరేటర్‌ వంటి సదుపాయాలూ కల్పించారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్‌ నడవటానికి అనుగుణంగా కార్ఫస్‌ నిధి ఏర్పాటు చేశారు. తల్లి జ్ఞాపకార్థంగా ఏ పని తలపెట్టినా దానికి అవసరమైన నిధిని ఆమె స్వయంగా భరించేవారు. ట్రస్టుకు కేటాయించిన నిధుల ద్వారా పేదలకు, మహిళలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు.

మనుషులు పుట్టటం గిట్టటం సహజ ప్రక్రియే. ఆ రెండు సంఘటనల మధ్య జీవితాన్ని గడిపే మనిషి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ఎలా ప్రవర్తించారన్నదే ముఖ్యమైనది. అమ్మ రాజేశ్వరమ్మ ఆశయాన్ని, ఆదర్శాన్ని అనుక్షణం పాటించిన ధన్యజీవి డాక్టర్‌ జ్యోతి. ఆమె ఈ సమాజం గురించి ఆలోచించిన తీరు వల్లా, మనుషుల పట్ల చూసిన ప్రేమ వల్లా ఆమె ఒక మానవతామూర్తి. ఆమె భౌతికంగా దూరమైనా – ఆమె సేవలను, ప్రేమను పొందిన మనుషులు ఎప్పటికీ ఆమెనొక సేవామూర్తిగా గుర్తు పెట్టుకుంటారు. తల్లికి తగ్గ తనయగా జ్ఞప్తి చేసుకుంటారు.   – యడవల్లి శ్రీనివాసరావు

 

➡️