పండగ వేళ.. ఇల్లు ఇలా శుభ్రపర్చుకోండి..

Jan 11,2024 07:39 #feachers, #jeevana

పండగ దగ్గర పడుతోంది. పిల్లలు, బంధువులు, సన్నిహితులతో ఇళ్లన్నీ కళకళలాడాలని అందరూ ఆశిస్తారు. ఇంత ఆహ్లాదకర వేళ, ఇంటి శుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపే గృహిణులకు ఇంటి శుభ్రత అదనపు పని. అయితే ఒక్కసారే పనంతా మీదేసుకుని ఒళ్లు హూనం చేసుకోకుండా ఒక ప్రణాళిక ప్రకారం శుభ్రం చేసుకుంటూ వెళితే శ్రమ లేకుండా తేలిగ్గా ఉంటుంది.

పల్లెటూళ్లో ఇప్పటికే పండగ పనులు మొదలయ్యే ఉంటాయి. నగర ప్రజలు కూడా అన్నీ సిద్ధం చేసుకునే వుంటారు. ఒకటి, రెండు గదులున్న మధ్య తరగతి ప్రజానీకం కూడా పండగలప్పుడు ఇల్లు సర్దుకోవడంలో తెగ గాబరా పడిపోతారు. అలా కాకుండా ఒక్కోక్క గది శుభ్రం చేసుకుంటే పని తేలిక అవుతుంది. ఒంటి నొప్పులు రాకుండా ఉంటాయి.

కొంతమంది ఇళ్లల్లో ఇత్తడి, గాజు, రాగి సామానులు ఎక్కువగా ఉంటాయి. పండగొచ్చిందంటే అటకమీద నుండి, అలమరల్లో నుండి అవన్నీ కిందకి వచ్చేస్తాయి. వాటితో పాటు ఇంట్లో ఇతర సామాను కూడా దించేస్తాం. అన్నీ ఒకసారే శుభ్రం చెయ్యాలని ముందేసుకుంటారు. అలా కాకుండా వేటికవే, ముందు రాగి, ఇత్తడి, గాజు సామాను శుభ్రం చేసుకుని వాటిని ప్రత్యేకంగా భద్రపర్చుకోవాలి. ఆ తరువాత స్టీలు సామాను శుభ్రం చేసుకుంటే వస్తువులు పాడవ్వవు. పనీ సులువవుతుంది.

సామాను శుభ్రం చేసుకోవడం కంటే ముందు ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ ఒకపక్క చేర్చుకోవాలి. దుస్తులు, ప్లాస్టిక్‌ సామాను, పిల్లలు వాడి పారేసిన బొమ్మలు ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కో రకంగా చెత్త పేరుకుపోతుంది. దానంతటినీ ముందే తీసి పారేస్తే, ఒక స్పష్టత వస్తుంది. వేగంగా శుభ్రం చేసుకోవచ్చు.

బూజులు దులిపిన తరువాత అలమర్లను శుభ్రం చేసుకునేటప్పుడు తడి గుడ్డ ఉపయోగించకూడదు. పొడి గుడ్డతోనే దుమ్ము తుడవాలి. అప్పుడే మరకలు పడకుండా ఉంటాయి. అలాగే అరమరల్లోని వస్తువులను ఇంతకు ముందు పెట్టిన స్థానాల్లో కాకుండా స్థానం మారిస్తే కొత్తగా వుంటుంది. కొత్తగా కనిపిస్తుంది.ఇక టీవీలు, ఫ్రిజ్‌ల పైభాగం శుభ్రం చేసేటప్పుడు మెత్తటి టవల్‌ ఉపయోగిస్తే దుమ్ము త్వరగా పోతుంది. అలాగే గ్లాస్‌ టేబుల్స్‌, డోర్లు, కిటికీలు, అద్దాలను మార్కెట్లో దొరికే క్లీనర్స్‌ లేక ఇంట్లో ఉండే సర్ఫ్‌ను నీళ్లల్లో కలిపి ఆ నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. కిటికీ, తలుపు మెష్‌పై ఉన్న దుమ్ము స్టీల్‌ బ్రష్‌ సహాయంతో సులభంగా శుభ్రం చేయొచ్చు. చెక్క తలుపులకు, కిటికీలకు, మంచం పట్టెలకు వార్నిష్‌ రాస్తే కొత్తగా ఉంటాయి. పుచ్చుపోకుండా ఉంటాయి. సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కలపై పేరుకుపోయిన దుమ్ము వదలాలంటే పాత దిండు కవర్‌ను ఫ్యాన్‌రెక్కకు తొడిగి రుద్దుతూ తుడవాలి. దీని వల్ల దిండు కవర్‌లో దుమ్ము, ధూళి పడుతుంది.

చాలామంది అరమరల్లో న్యూస్‌ పేపర్లు వేస్తుంటారు. ఈ పండక్కి తెల్ల పేపర్‌ వేసి చూడండి. అలాగే నీలం, లేత గులాబి రంగు కర్టెన్లు అమర్చుకుంటే ఇల్లంతా కొత్త శోభతో కళకళలాడుతుంది.

వాడకుండా ఉండే సామానంతా శుభ్రం చేసుకున్న తరువాత, తడి లేకుండా తుడుచుకుని ప్రత్యేకంగా సర్దుకోవాలి. మూట కట్టి అటక మీద పెట్టుకుంటే మంచిది. వాడుకునే సామానునే అరమరల్లో సర్దుకోవాలి. వాటి మధ్యలో మంచి వాసన వచ్చేలా కలరా ఉండలను అక్కడక్కడ వేయాలి.

ఇప్పుడు మార్కెట్లో బట్టలు భద్రపర్చుకునే బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. బీరువాలో బట్టలే కాకుండా కొంతమంది అరమరల్లో కూడా బట్టలు గుట్టలు గుట్టలుగా పేర్చేస్తుంటారు. ఈ సారి ఈ బ్యాగుల్లో ఎవరి బట్టలు వాళ్లకి ప్రత్యేకంగా సర్దుకుని చూడండి.

ఇల్లంతా శుభ్రం చేశాక ఇంటి మూలల్లో సీసాల్లో గాని, చిన్న డబ్బాల్లో గాని, మనీప్లాంట్‌, ఇండోర్‌ మొక్కలు పెడితే చాలా అందంగా కనిపిస్తాయి. ఇంటికి రంగులు వేసేటప్పుడు నీలం, లేత గులాబి రంగు పెయింట్‌ చేయిస్తే చాలా బాగుంటుంది. లోపల గోడల మీద అక్కడక్కడ పక్షులు, పూలు, చెట్లు చార్టులను అతికిస్తే గదంతా అందంగా కనపడుతుంది.

➡️