ఇంధన పొదుపు .. అందరి బాధ్యత …

Dec 14,2023 07:25 #Energy, #Jeevana Stories, #Special Days
energy conservation day article jeevana story

నేడు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం

ధనమూ, ఇంధనమూ … సమాజాన్ని నడిపించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. రెండు శ్రమ జనితాలే! కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. చేతిలో ఉన్న దానిని తెలివిగా, పొదుపుగా వినియోగించుకోవాలి. నేడు మన కోసమే కాదు; భవిష్యత్తు తరాల అవసరాల కోసమూ ఇంధన పొదుపు అన్ని విధాలా అవసరమని ఆర్థిక నిపుణులు, పర్యావరణ హితులూ చెబుతున్నారు. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా … ఆ సంగతులను ఓ సారి గుర్తు చేసుకుందాం!

ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే పెట్రోలు వాహనాలు… ఇంట్లో భోజనం సిద్ధం చేయాలంటే గ్యాస్‌… గృహాల్లో జీవనం సాఫీగా సాగాలంటే విద్యుత్తు … మన నిత్య జీవితానికి ఎంతో అవసరం. ఇవన్నీ ఇంధన వనరుల్లో భాగమే! ప్రకృతి వనరుల నుంచి ఇవి లభ్యమవుతాయన్న విషయం తెలిసిందే! మనిషి తన ఇష్టానుసారం ప్రకృతి వనరులను వాడేస్తుంటే – భవిష్యత్తులో తీవ్ర కొరత ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మనమందరం మళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. అందుకనే ఇప్పుడు అన్ని దేశాల్లోనూ పెట్రోలుతో నడిచే వాహనాల స్థానే విద్యుత్‌ వాహనాలు ముందుకు వచ్చాయి. మన దేశంలో కూడా వీటి వినియోగం నానాటికీ పెరుగుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు అమాంతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలు తమపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి ఎలక్ట్రికల్‌ వాహనాలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఫ్యాన్లు, లైట్లు

తక్కువ విద్యుత్‌ను ఉపయోగించే ఫ్యాన్లు నేడు మార్కెట్లో ఉన్నాయి. విద్యుత్‌ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. 35 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. గతంలో ఎల్‌ఇడి బల్బులు వాడే చోట్ల ఎల్‌సిడి బల్బుల వినియోగంతో విద్యుత్‌ ఆదా అవుతుంది. అధునాతన ఎలక్ట్రికల్‌ స్టవ్‌లు, బల్బులతో కార్బన్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

ఎల్‌ఈడీ బల్బులు

లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌ (ఎల్‌ఈడీ) బల్బులు తెల్లని కాంతిని ప్రకాశింప జేయటంతో పాటు విద్యుత్‌ను ఆదా చేస్తాయి. విద్యుత్‌ బిల్లును తగ్గించేందుకు దోహదపడతాయి. ఎల్‌ఈడీ బల్బులు దీర్ఘకాలంగా పనిచేస్తాయి. అతి తక్కువ వేడిని విడుదల చేస్తాయి. ఇళ్లల్లో ఉపయోగించటం ద్వారా 95 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. గృహాలు, వాణిజ్య అవసరాలకు సాధారణ విద్యుత్‌ ఉపకరణాలను వినియోగించటం వల్ల విద్యుత్‌ వినియోగం అధికంగా ఉంటోంది. వాటి స్థానంలో ఆధునిక పరికరాలను వినియోగిస్తే 15 శాతం విద్యుత్‌ వృథాను తగ్గించొచ్చు.

ఇథనాల్‌

పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండటానికి పలు దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను వినియోగిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇథనాల్‌ ఉత్తమ పరిష్కారం. ఇథనాల్‌, గ్యాసోసిలిన్‌ మిశ్రమం పర్యావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాన్ని తగ్గిస్తుంది. ఇది ఫ్యూయెల్స్‌తో పోలిస్తే శుభ్రంగా మండుతుంది. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ వినియోగంతో ప్రమాదకరమైన గ్రీన్‌హౌస్‌ వాయువులు, ఉద్గారాల కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌ ఏర్పడుతుంది. ఇథనాల్‌ వినియోగం వల్ల పర్యావరణ నష్టాన్ని తగ్గించొచ్చు. సౌర విద్యుత్తు గృహాలు, ఆఫీసులపై సౌరఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తే కర్బన ఉద్గారాల బెడద తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఈ పథకానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, ప్రోత్సహిస్తోంది. ప్రారంభంలో ఎక్కువ పెట్టుబడి పెట్టటానికి సిద్ధపడితే ఇళ్లకు, మోటార్లకు సౌర విద్యుత్‌ను సులభంగా, ఉచితంగా పొందవచ్చు.మన భూగోళం ఆరోగ్యంగా ఉండటానికి, మనపై ఆర్థిక భారం తగ్గటానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి సారించాలి. ఒక్కో కుటుంబం ఒక్క నెలకు ఒక్క యూనిట్‌ విద్యుత్తును, ఒక్క లీటరు పెట్రోలును పొదుపు చేస్తే- దేశంలో కొన్ని కోట్ల ఖర్చు మిగులుతుంది. భూగోళం ఆరోగ్యం కొంత శాతమైనా చెడిపోకుండా కాపాడబడుతుంది.

కుకింగ్‌ స్టవ్‌లు

ఇప్పుడు గ్యాసును, విద్యుత్‌ను పొదుపు చేసే గృహోపకరణాలు చాలా అందుబాట్లోకి వచ్చాయి. బీఎల్‌డీసీ ఫ్యాన్లు, ఇండక్షన్‌ కుకింగ్‌ స్టవ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇండక్షన్‌ స్టవ్‌ ద్వారా సంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఇంధనం ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో వంటను పూర్తిచేయొచ్చు. ఈ స్టవ్‌లు పర్యావరణ హితం కూడా! ఈ స్టవ్‌లు అనేక రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

energy conservation day article jeevana story
ఈ-విద్యుత్‌ వాహనాలు

ప్రపంచవ్యాప్తంగానూ, మన దేశంలోనూ ఈ-విద్యుత్‌ ద్విచక్ర వాహనాల వినియోగం పెరుగుతోంది. మామూలు వాహనాలతో పోలిస్తే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ దూరం ప్రయాణించేవారు, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉండేవారు ఈ-వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మంచి మైలేజీ, స్లైల్‌, ఇంజన్‌ సామర్థ్యం ఉండటంతో వీటి వినియోగంపై ఆసక్తి పెరిగింది. ఏథర్‌ ఎనర్జీ, బజాజ్‌, టీవీఎస్‌, హీరో, ఎడిఎంఇ ఈ-బైక్‌లకు మంచి ఆదరణ ఉంది. భవిష్యత్తులో వీటి లభ్యత, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. బ్యాటరీ ఛార్జింగు, సర్వీసు అందుబాటులో ఉన్న సమస్యలు పరిష్కరిస్తే ఈ-బైకుల వినియోగం మరింత పెరుగుతుంది. దీనిపై గతేడాది వరకూ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రాయితీ ఇచ్చేది. ఈ మధ్య తగ్గించింది. ఈ-సైకిళ్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. దగ్గరి ప్రయాణాలకు మామూలు సైకిళ్లు వాడడం ఆరోగ్యానికి, ఆర్థిక పొదుపునకు చాలా దోహదం చేస్తుంది. తక్కువ దూరాలకు బైకులు వాడకుండా నడిచివెళ్లటం కూడా మంచిది. అత్యవసరం కానప్పుడు సొంత కార్లు, బైకులు వాడటం కన్నా ప్రజా రవాణాను ఉపయోగించటం మేలు.

➡️