రైతు గౌరవం

Feb 7,2024 10:30 #jeevana

భీమ్గడ్‌ అనే ఊరిలో రామాచారి అనే రైతు ఉన్నాడు. అతను చాలా మంచివాడు. వ్యవసాయం చేసి పండించిన ధాన్యం గిర్నిలో పట్టించి వచ్చిన బియ్యంతో రోజులు గడిపేవారు. తిండి గింజల కోసం ఇంటికి ఎవరు వచ్చినా కాదనకుండా సాయం చేసేవాడు. రామాచారి స్నేహితుడు రాజశేఖర్‌ ఒకరోజు పట్నం నుంచి ఊరికి వచ్చాడు. రామాచారి ఇంటికి వెళ్లాడు. అది ఒక చిన్న ఇల్లు. పెరట్లో కొన్ని పూల మొక్కలు, రెండు పశువులు ఉన్నాయి. ఖరీదైన వస్తువులు ఏవీ ఆ ఇంట్లో లేవు. రాజశేఖర్‌ అక్కడికి వెళ్లేసరికి ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. వాళ్లతో రామాచారి పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. వాళ్లందరి ముందూ తన దర్పం చూపించుకోవాలని, స్నేహితుని పేదరికాన్ని హేళన చేయాలని అనుకున్న రాజశేఖర్‌ ‘ఏరా రామాచారి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏముంది?’ అంటూ ప్రశ్నించాడు. ఆ మాటలకు రామాచారితో పాటు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాజశేఖర్‌ అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉన్న కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొన్నాడు. అప్పుడే రామాచారి ఇంట్లోకి వెళ్లి తట్టలో బియ్యం తెచ్చాడు. అక్కడ ఉన్న జనాలకు తలా కొంత పంచిపెట్టాడు. ప్రజలంతా ‘దండాలు బాబు’ అంటూ రామాచారికి నమస్కరించి వెళ్లారు. ‘చూడు రాజశేఖర్‌ వీళ్లంతా నాతోటి రైతులు. పంట పండితే కడుపునిండా తింటారు. లేకపోతే లేదు. ఈసారి వీళ్లకి బాగా నష్టం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేమైనా సాయం చేస్తానేమోనని ఇక్కడికి వచ్చారు. నా దగ్గర డబ్బు లేదు. కానీ వీళ్లని ఒట్టి చేతులతో పంపడం ఇష్టం లేక ధాన్యం ఇచ్చాను. చాలా చిన్న సాయమే చేశాను. అయినా వాళ్లు ఎంతో సంతోషంతో వెళ్లారు. ఆకలితో ఉన్న వీళ్లకి అన్నం పెడితే ఆనందిస్తారు. అలాగే ఎంత డబ్బు ఉన్నా తిండి గింజలు పండించే రైతును అవమానించకూడదు’ అని చెప్పాడు. రాజశేఖర్‌ ఆలోచనలో పడ్డాడు. తన తప్పుకు క్షమించమని రామాచారిని అడిగాడు. ఆ తరువాత రైతులను ఎప్పుడూ తక్కువగా చూడలేదు.

– ఎం.పూజ, 8వ తరగతి, జెడ్‌పిహెచ్‌ఎస్‌, హవేలీ ఘనపూర్‌, మెదక్‌ జిల్లా.

➡️