బతుకు మీద ఆశ కల్పిస్తున్నారు..

May 7,2024 05:51 #feachers, #Jeevana Stories

అల్లారుముద్దుగా పెరుగుతున్న పిల్లలను ఆ మాయదారి రోగం కబళిస్తుందని ఆ తల్లిదండ్రులకు తెలుసు. అయినా ఎక్కడో, ఏ మూలో ఓ చిన్న ఆశ.. వాళ్లని ఉన్నపళంగా ఊరు విడిచేలా చేసింది. ఊరు కాని ఊళ్లో ఆ హాస్పటల్‌ చుట్టూ పిల్లలను తిప్పడానికే ఓపిక సరిపోవడం లేదు. పోషకాహారం పెట్టుకుంటే పిల్లలకు కాస్త ఓపిక వస్తుందని తెలిసినా వాళ్లకా శక్తి లేదు. తడవ తడవకి ఊరు వెళ్లి వచ్చే స్థోమత లేక, అక్కడే ఆ హాస్పటల్‌ ఎదురుగా పుట్‌పాత్‌పైనే తెచ్చుకున్న సంచులు, సామానుతో నివసిస్తున్నారు. వారితోపాటే చికిత్స తీసుకుంటున్న పిల్లలు కూడా. ఈ దృశ్యాలు అక్కడ సర్వసాధారణం. ఎన్నో ఏళ్లుగా అక్కడ కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎంతోమంది వాళ్లని ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. సాయం చేసే మనసు ఉన్నా, అందరివీ అవే పరిస్థితులు. అయితే ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు స్నేహితులు, అంకిత్‌ దవే, గిరిష్‌ నాయర్‌ ఈ సమస్యకి పరిష్కార దిశగా అడుగులు వేశారు. పదేళ్ల క్రిందటే అంటే 2014 నుండి ‘లైఫ్‌ సెంటర్స్‌’ పేరుతో వసతి గృహాలు ఏర్పాటు చేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. ప్రస్తుతం 8 వసతి గృహాలు 2000 మంది పిల్లలకి వసతి అందిస్తున్నాయి. వారి సేవా ప్రస్తానం గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..

ముంబయి, టాటా మెమోరియల్‌ ట్రస్ట్‌ హాస్పటల్‌కి సుదూర తీరాల నుండి ప్రతి రోజూ వేలాది మంది రోగులు వస్తారు. ముఖ్యంగా కేన్సర్‌ చికిత్స కోసం కొన్ని వందల మంది బారులుతీరి ఉంటారు. చికిత్సలో భాగంగా కీమోథెరపీలు చేయించుకునేందుకు వారంతా కొన్నినెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే వీరందరికీ ఆస్పత్రిలో వసతి లభించదు. దీంతో వారంతా హాస్పటల్‌ ఎదుట పుట్‌పాత్‌లపైనే నివసిస్తారు. ముంబయి ఒక్క చోటే కాదు, దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ చికిత్స కోసం వెళుతున్న ఎన్నో కుటుంబాలది అదే పరిస్థితి. కీమో థెరపీ తరువాత సరైన పోషకాహారం లేక, నీరసించిపోయి, బతుకు మీద ఆశ చచ్చిపోయి, చికిత్స పూర్తవ్వకుండానే ఎంతోమంది వెనుదిరుగుతారు. అయితే చికిత్స కోసం చిన్న బిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు మాత్రం వెళ్లలేక, ఉండలేక అక్కడే నెలల తరపబడి ఉండిపోతారు. శుష్కించి పోతున్న దేహాలతో కళ్లెదుటే చావుకు దగ్గరౌతున్న బిడ్డలను చూస్తూ ఆ అమ్మానాన్నలు గుండెలు చెరువయ్యేలా ఏడుస్తారు.
ఇదంతా ఒకప్పడు.. ఇప్పుడు అలా లేదు. ఆ బిడ్డలందరూ అంకిత్‌, గిరీష్‌ ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో తలదాచుకుంటున్నారు. ఒక్క ముంబయిలోనే కాక, పూణె, అహ్మదాబాద్‌, ఛండీగఢ్‌, బెంగళూరు, మణిపూర్‌లో మొత్తం 8 వసతి కేంద్రాల్లో వీరి సేవా ప్రస్థానం కొనసాగుతోంది.
డిసెంబరు 2023లో వంశిక చికిత్స కోసం, తన కుటుంబం ముంబయికి చేరుకుంది. డాక్టరును కలిసిన తరువాత అక్కడే కొన్ని నెలల పాటు ఉండిపోవాలని ఆ కుటుంబం నిశ్చయించుకుని మరీ వచ్చింది. కానీ అక్కడి పరిస్థితులు ఆ తల్లిదండ్రికి విపరీతమైన భయాన్ని, అంతకుమించి దు:ఖాన్ని తెచ్చిపెట్టాయి. అప్పుడే అంకిత్‌, గిరీష్‌ గురించి వాళ్లకి తెలిసింది. తమ వసతి గృహంలో పిల్లలకు మెరుగైన జీవితాన్ని ఇస్తామని ఆ స్నేహితులు భరోసా ఇచ్చారు. అంతేకాదు, బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ అక్కడే ఉండిపోవచ్చని లేదా, పిల్లలను వదిలిపెట్టి ఊళ్లకు వెళ్లి పనులు చేసుకోవచ్చని చెప్పారు.

ఆ వసతి గృహంలో తలదాచుకున్న వంశిక ఇప్పుడు అక్కడి పిల్లలందరితో కలసి చక్కగా ఆడుకుంటుంది. డ్యాన్సులు వేస్తోంది. పోషకాహారం తింటూ త్వరగా కోలుకుంటోంది. వంశిక మాదిరే అక్కడున్న వేలాది మంది చిన్నారుల చిరునవ్వులకు కారణమైన అంకిత్‌, గిరీష్‌ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

అంకిత్‌ మీడియా రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు. గిరీష్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణుడు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటే వీరు కొద్దికాలానికే ప్రాణస్నేహితులయ్యారు. 2012లో వారికి ఈ ప్రాజెక్టు ఆలోచన వచ్చింది. దేశంలోని ప్రముఖ పీడియాట్రిక్‌ కేన్సర్‌ హాస్పటల్స్‌ని సందర్శించడం మొదలుపెట్టారు. ‘అక్కడ నెలల పిల్లల దగ్గర నుండి కీమో చికిత్స తీసుకుంటున్న వారు ఉన్నారు. మొదట, వారికి పడకలు ఇవ్వడం, ఆహారం అందించడం చేయాలని అనుకున్నాం. కానీ ఆ తర్వాతే మాకు తెలిసింది. ఆ పిల్లలకు అంతకు మించి ఇవ్వాలని. గుడారాలు వేసుకుని, రోడ్ల మీదే తిని పడుకుంటున్న ఆ కుటుంబాలు పిల్లలకు చికిత్స చేయించకుండానే వెనుదిరగడం మేము చూశాం. ఎంతో ఆశతో బిడ్డను బతికించుకోవాలనుకున్నా, అది నెరవేరకుండానే వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు ఎంత కష్టం? ఆ మానసిక పరిస్థితి తలచుకుని ఎంతో బాధేసింది. అందుకే ఆ బిడ్డలు అందరిలా జీవించేలా, వ్యాధి నుండి త్వరగా కోలుకునేలా చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాం.

దాతల నుండి నిధులు వసూలు చేశాం. ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలోనే వచ్చాయి. కానీ వసతి గృహాలకు ఇళ్లు ఇచ్చేవారే కనిపించలేదు. ఎంతోమంది తిరస్కరించారు. ఒక్క ఇళ్లు దొరకడానికి ఏడాది కాలం పట్టింది’ అంటూ తమ సేవామార్గం తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఈ ప్రయాణంలో గిరీష్‌ తన ఇంటిని సైతం అమ్మేశాడు. అయినా ఆ విషయం బయటికి చెప్పడానికి కూడా అతను ఇష్టపడడు’ అంటూ అంకిత్‌ స్నేహితుని గురించి గర్వంగా చెబుతాడు.

ప్రస్తుతం 140 కుటుంబాలు 2000 మంది పిల్లల్తో ఈ వసతి గృహాల్లో నివసిస్తున్నాయి. పిల్లలకు పోషకాహారం వండేందుకు కేర్‌ టేకర్లు నియమించారు. కొంతమందికి స్వయంగా తమ పిల్లలకు వండిపెట్టుకునే సౌలభ్యం కూడా ఇచ్చారు. సాయంత్రం వేళల్లో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రోజంతా విపరీతమైన ఒత్తిడి, అలసట వేధిస్తున్నా, అంతటి బాధను మైమరిపించేలా ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతున్నారు. జీవితం పట్ల ఆశ కోల్పోయిన ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చిందింప జేస్తున్న అంకిత్‌, గిరీష్‌ లాంటి యువకులు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

➡️