అమ్మ పాత్రకు ఆమె వెండితెర రూపం

Dec 31,2023 07:14 #Jeevana Stories

వెండితెరపై తమ అభినయాన్ని పరిచయం చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది భావిస్తారు. అయితే సినిమా అనే రంగుల ప్రపంచంలో అది అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి. బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. అయితే అలాంటిదేమీ లేకుండానే టాలీవుడ్‌లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవిశ్రీ రూపలక్ష్మి. ఇప్పుడు ఆమె వెండితెరపై అమ్మగా ప్రేమను కురిపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఆమెకు ఈ అవకాశాలు ఊరకే రాలేదు. ‘ఈమెకు నటన వచ్చా? నటించగలదా?..చూద్దాంలే…! అని నిట్టూర్పులు విడిచిన వారూ ఉన్నారు. సినిమాల్లో నటించాక కూడా ఆడిషన్స్‌కు రావాలని కోరిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అవేమీ పట్టించుకోలేదామె. ఆమె నటనను చిన్న పాత్రలకే పరిమితం చేసినా భరించారు. మొండిగా ముందడుగు వేశారు. తాను నమ్మిన సినిమా రంగంలో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో అవకాశాల కోసం ఎదురుచూశారు. ‘బలగం’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడి నుంచి ఇండిస్టీకి వచ్చారు? ఇప్పుడెలా రాణిస్తున్నారో? తెలుసుకుందాం.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రూపలక్ష్మి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సొంత తల్లిదండ్రులు గోపాల నాయుడు, నాగమ్మ. పెంచిన తల్లిదండ్రులు వైష్ణవిశ్రీ, సీతారామ్‌. రెండు నెలల వయసులోనే ఆమెను ఓ ఎకనామిక్స్‌ లెక్చరర్‌కు దత్తత ఇచ్చేశారు. ఆయన వద్ద పెరిగిన ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి యుక్తవయస్సు రాగానే పెళ్లి చేశారు.

టాలీవుడ్‌లో ‘మదర్‌’ ఫేమ్‌కు కేరాఫ్‌

అందం, అభినయమే కాదు, ఆత్మవిశ్వాసంతో తనకు నచ్చిన, మెచ్చిన, వచ్చిన పాత్రల్లో తల్లిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తూ తెలుగు పరిశ్రమలోనే నేడు బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఉన్నారు. దూరదర్శన్‌, ఈటీవీ సీరియళ్లలో బుల్లితెరపై నటిగా మెప్పించి, షార్ట్‌ ఫిలిమ్స్‌లో రాణించిన ఆమె వెండితెరపైనా తన అభినయాన్ని పండిస్తూ ‘బలగం’ ద్వారా మంచి నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

బుల్లితెరలోనూ మెప్పించారు

చిన్నప్పటి నుంచే రూపకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అద్దం ఎదురుగా డ్యాన్సులు చేయటం, డైలాగులు చెప్పటం ప్రాక్టీస్‌ చేసేవారు. సెలవు రోజుల్లో సినిమాలను బాగా చూసేవారు. ఆ తర్వాత తమ్ముడి స్నేహితుడి ద్వారా వచ్చిన అవకాశాలతో ఈటీవీ పలు ధారావాహిక కార్యక్రమాల్లో నటించారు. పలు షార్ట్‌ఫిలిమ్స్‌లో అనేక పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి ద్వారా వచ్చిన పరిచయాలతో సినిమాల్లో మొదట్లో ఇలా కనిపించి అలా వెళ్లిపోయే పాత్రలకు అవకాశం వచ్చింది.

తల్లిపాత్రల్లో మెప్పిస్తున్నారు

జయ జానకి నాయక, వినయ విధేయ రామ, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ తదితర సినిమాల్లో రూపకు ఎక్కువ నిడివి ఉన్న పాత్రలను పోషించారు. ఆయా పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు. పలు సందర్భాల్లో కామెడీని సైతం పండించారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకటే కథ’లోనూ తల్లి పాత్రలో ఆమె డైలాగులు ఆలోచింపజేస్తాయి. కామెడీ పంచులను కూడా ప్రేక్షకులు ఆదరించారు. జాంబిరెడ్డి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, నర్తనశాల, టెన్త్‌క్లాస్‌ డైరీస్‌ వంటి చిత్రల్లో ఆమె పాత్రకు పేరొచ్చింది. హరీష్‌ శంకర్‌, బోయపాటి శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకులు పలు సినిమాలకు అవకాశం వచ్చేలా చేశారు.

సినిమాకు ‘బలగం’

తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన ‘బలగం’ చిత్రం ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లోని కథను ఓ కుటుంబం పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని సినిమా సాగుతుంది. అంత్యక్రియలు, దశ దినకర్మ, పిట్టకు పిండం పెట్టడం, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్ధలు, భావోద్వేగాలు వంటి అంశాల్లో ప్రతి సందర్భంలోనూ ఆమె పాత్రలో ఒదిగిపోయి నటించారు. సందేశాత్మకంగానూ, హాస్యపూరితంగానూ ఎమోషనల్‌ కామెడీ డ్రామాగా సాగుతుందీ సినిమా. హీరోగా ప్రియదర్శి (సాయిలు), హీరోయిన్‌గా కావ్య కళ్యాణ్‌రామ్‌ (సంధ్య) నటించారు. మరణించిన తండ్రి కొమరయ్య (సుధాకర్‌రెడ్డి)కి కూతురిగా రూపలక్ష్మి (లక్ష్మి-లచ్చవ్వ) పాత్రలో జీవించేశారు. ముఖ్యంగా తండ్రి కొమరయ్య శవానికి చివరగా స్నానం చేయించే సీన్‌లో భౌతికకాయాన్ని హత్తుకుని ఏడ్చే సీన్‌ ప్రేక్షకులకు సైతం కన్నీళ్లు తెప్పించింది. ఆమె అందులో అంతగా ఒదిగిపోయారంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు ఈ సీన్‌ చెప్పకపోయినా ఇది ఉంటే బాగుంటుందని ఆమె చెప్పగా అంగీకరించారు. హీరోయిన్‌కు తల్లిగా, హీరోకు మేనత్తగా ప్రతి సందర్భంలోనూ ఆమె పాత్రలో ఒదిగిపోయారనే చెప్పొచ్చు. దర్శకుడు వేణు ఇచ్చిన రోల్‌కు ఆమె న్యాయం చేశారనే చెప్పొచ్చు.

ఏ పాత్రలోనైనా జీవిస్తారు

పల్లెటూరి అమ్మాయిగా మాస్‌ రోల్‌లోనైనా, సిటీ యువతిగా లేటెస్ట్‌ ట్రెండ్‌తో ఆకట్టుకునేలానూ, అమ్మతనానికి వన్నెతెచ్చేలాగా నటించి మెప్పిస్తున్నారు రూపలక్ష్మి. టీవీ సీరియళ్లలో చెల్లెలు, అక్క, విలన్‌ పాత్రలు పోషించారు. చిన్న హీరోల నుంచి నేడు పెద్ద హీరోలకు వరకూ తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోతున్నారు. స్వతహాగా తనకున్న జ్ఞాపకశక్తి, ఏది చెప్పినా ఇట్టే పట్టేసే తత్వంతో డైలాగులు సులభంగా చెప్పగలుగుతారు. పల్లెలో కుటుంబ నేపధ్యం, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను పండింపజేసే పాత్రల్లో మెప్పిస్తున్నారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రస్థానం

జయ జానకి నాయక, సుబ్రహ్మణ్యం ఫల్‌ సేల్‌ సినిమాలో ఆమె కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. నటనతోనూ మెప్పించి ప్రశంసలు పొందారు. ఇప్పటికి 50కిపైగా సినిమాల్లో నటించారు. ఆమె ప్రభావవంతమైన నటనకు ప్రేక్షకులు ఆమోద ముద్ర వేస్తున్నారు.

కొత్త సినిమాల్లోనూ…

కరుణాకరణ్‌ దర్శకత్వంలో వస్తున్న మట్కా, ఎన్టీఆర్‌ నటిస్తున్న దేవర, నాగార్జున ‘నా సామిరంగ’ వంటి పలు సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.

ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలనుంది :విఎస్‌ రూపలక్ష్మి, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌

కెరీర్‌పరంగా సినిమాల్లో ఎలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలు వచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించాలని వుంది. పెద్ద హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలని అవకాశాలు వస్తున్నాయి. ఈ రంగంలోకిరావటానికి, నిలబడటానికి ఎన్నో కష్టాలను ఎదిరించా. ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతున్నాను. జీవితంలో మహిళ సంతృప్తిగా ఉండే స్థానం అమ్మ.. అందుకే అలాంటి పాత్రల్లో నటించటాన్ని ఇష్టంగా భావిస్తాను.

సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు

➡️