హాయ్ నా పేరు అవ్నీ.. నేను పాలస్తీనా గాజా బాలుడిని

Jan 2,2024 10:11 #feature

           యూట్యూబ్‌ వీడియోలు చూసే వయసు ఆ బాలుడిది. అయితే అందరిలా తెర ముందు ప్రేక్షకుడిలా కూర్చోలేదు. తెరపై కనిపించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. జూన్‌ 2020లో సోషల్‌మీడియాలో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు. ప్రో ఎవల్యూషన్‌ సాకర్‌, కార్‌ రేసింగ్‌ గేమ్‌ బ్లర్‌, కౌంటర్‌ స్ట్రైక్‌ వంటి గేమింగ్‌ వీడియోలను అందులో పోస్ట్‌ చేశాడు. ఇప్పటివరకు పది వీడియోలు ఆ ఛానెల్లో ప్రసారమయ్యాయి. ‘హారు నా పేరు అవ్నీ ఎల్దూస్‌. పాలస్తీనా గాజాలో నేను నివసిస్తున్నాను. నా వయసు 12 ఏళ్లు. నా ఛానెల్‌ని ముందు పది వేలు, ఆ తరువాత లక్ష, వెంటనే 5 లక్షల మంది అనుసరించాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్యం చేరే వరకు మంచి మంచి వీడియోలు పోస్టు చేస్తూనే ఉంటాను. త్వరలో ఇంటర్వ్యూలు అప్‌లోడ్‌ చేస్తాను. మీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడమే నా ఛానెల్‌ లక్ష్యం. ప్రస్తుతం నా యూట్యూబ్‌ ఛానెల్‌ని అనుసరిస్తున్న వెయ్యిమంది వీక్షకులకు థాంక్స్‌’ అని చిరునవ్వులు చిందిస్తూ, ప్రకాశవంతమైన ముఖంతో భవిష్యత్తుపై గంపెడు ఆశలతో చెప్పిన అవ్నీ ఇప్పుడు లేడు. అతడు మరణించి దాదాపు 100 రోజులు అవుతోంది. అవ్నీ ఆ వీడియోని ఆగష్టు 2022లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఆ వీడియో మాత్రమే కాదు, అవ్నీ చేసిన మిగిలిన వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్‌ ఉన్నాయి. ఇప్పుడు అతడి చానెల్‌ 1.5 మిలియన్లకు చేరువలో ఉంది.

హృదయం ద్రవించే విషయమేమంటే ఇంతటి విశేష ఆదరణ సొంతం చేసుకున్న అవ్నీ ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధం మొదలైన అక్టోబరు 7 తొలి దాడిలోనే మరణించాడు. ఆ రోజు చనిపోయిన వేలాదిమంది చిన్నారుల్లో అవ్నీ ఒకడు. అతని కుటుంబంలోని 15 మంది కూడా ఆ దాడిలోనే హతులయ్యారు. ‘ఎప్పుడూ ఉత్సాహంతో తిరిగే అవ్నీ మా కళ్ల ముందు లేడన్న నిజాన్ని మేము ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాం. ఆ రోజు నా ఫోను ఛార్జింగ్‌ కోసం పెట్టాను. నెట్‌ ఆన్‌ చేశాను. నా స్నేహితుడి ఫేస్‌బుక్‌ ఖాతాలో నా సొదరుడి ఫొటో ప్రత్యక్షమైంది. దానికింద రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అని రాసి వుంది. నా కళ్లు బైర్లు కమ్మాయి. ఆస్పత్రికి పరుగులు పెట్టాను. గుట్టలుగా పోగుచేసిన ఆ శవాల మూటల్లో నా అన్నను, అతడి కుటుంబాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంట్లో అందరూ చనిపోయారు. భవనం మొత్తం కూలిపోయింది. ఆ దారుణానికి ఎంతోమంది బలయ్యారు’ అని ఆనాటి విషాద ఘటనను గుర్తుచేసుకున్నారు అవ్నీ మేనత్త ఆలా.

‘అవ్నీకి కంప్యూటర్‌ అంటే చాలా ఇష్టం. అతడిని నేను ఇంజినీర్‌ అవ్నీ అని పిలిచేవాడిని’ అంటూ ఆ దారుణం నుండి తృటిలో తప్పించుకున్న బంధువొకరు అవ్నీతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.అతడి స్కూల్‌ టీచర్లలో ఒకరు అవ్ని ఫోటోను షేర్‌ చేస్తూ ‘ఎన్నిటికీ మర్చిపోలేని చిరునవ్వు’ అని కామెంట్‌ చేశారు.’మమ్మల్ని క్షమించు. నువ్వు మరణించకముందే, మేం నిన్ను గుర్తించి ఉండాల్సింది’ అని ఓ యూట్యూబర్‌ భావోద్వేగ భరిత పోస్టు షేర్‌ చేశారు. అవ్నీ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇప్పుడు ప్రపంచమంతా వీక్షిస్తోంది. ఇంతటి ఆదరణ కావాలనే ఆ చిన్నారి కలలుగన్నాడు. ఆ ఆనందం తన స్నేహితులతో పంచుకోవాలని ఆశ పడ్డాడు. కానీ తను లేని ఈ ప్రపంచం ఆ విజయాన్ని విషణ్ణ హృదయాలతో పంచుకుంటోంది. ఆ విషాదానికి బలైన అవ్నీ లాంటి చిన్నారులను తలచుకొని రోదిస్తోంది.

➡️