నేను మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాను…

Jan 10,2024 11:06 #Jeevana Stories

”ఈ రోజు.. నాకు నిజమైన కొత్త సంవత్సరం. ఏడాదిన్నర తరువాత మొదటిసారి చిరునవ్వు నవ్వాను. నా హృదయం మీద పెద్ద పర్వత మంత బాధ దూదిపింజలా ఎగిరి పోయిన భావం కలుగుతోంది. నేను ఈ రోజు మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాను. నేను కోరుకున్న న్యాయం జరిగింది. నాకే కాదు, నా పిల్లలకు, మహిళలందరికీ ఈ తీర్పు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. న్యాయం అందరికీ సమానమనే నమ్మకాన్ని కలిగించింది. ” ఇదీ, గుజరాత్‌ అమానుష కాండలో అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానో స్పందన. ఆమెపై అమానుషానికి పాల్పడ్డ వారికి గుజరాత్‌ ప్రభుత్వమూ, హైకోర్టూ క్షమాబిక్ష పెట్టి, విడుదలచేయటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాల్లో దోషులను జైలుకు పంపాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో బిల్కిస్‌ తన అంతరంగాన్ని ఇలా వ్యక్తం చేశారు.

నేను ఇంతకు ముందూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నాలాంటి వారి ప్రయాణం ఒంటరిగా ఉండదు. నాకు భర్త, పిల్లలు తోడున్నారు. స్నేహితులు అండగా నిలబడ్డారు. ప్రత్యర్థులు నాపై ద్వేషం చిమ్ముతున్న వేళ నాకు కోట్లాది మంది అండగా నిలబడ్డారు. కష్టం ఎదురైన ప్రతిసారీ నా చేయి పట్టుకుని నడిపించారు. నా న్యాయవాది శోభా గుప్తా 20 ఏళ్లుగా నాతో పాటు ప్రయాణించారు. న్యాయం పట్ల ఎప్పుడూ నిరాశపడకుండా ఆమె నన్ను ముందుకు నడిపించారు.

నా కుటుంబాన్ని నాశనం చేసి, నా ఉనికిని భయభ్రాంతులకు గురిచేసిన వారిని ఏడాదిన్నర క్రితం 2022 ఆగష్టు 15న విడుదల చేసినప్పుడు కుప్పకూలిపోయాను. ఇన్నేళ్ల పాటు ధైర్యంతో పోరాడిన నేను ఆ క్షణం భయంతో వణికిపోయాను. నిరాశతో కుదేలైన నాకు అండగా దేశ నలుమూలల నుండి అసంఖ్యాక జన సమూహాలు కదిలాయి. నాకు సంఘీభావంగా నిలబడ్డాయి. సాధారణ ప్రజలు, మహిళలు నా తరపున తమ గొంతుకలు వినిపించారు. నాకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టులో దరఖాస్తులు చేశారు. దేశం మొత్తం మీద 6000, ముంబయి నుండి 8500 పిల్స్‌ సుప్రీంలో నమోదయ్యాయి. 10 వేల మంది బహిరంగ లేఖలు రాశారు. 40 వేల మంది నాకు మద్దతుగా ఉత్తరాలు రాశారు. మీ విలువైన సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీరు చూపించిన ఈ మద్దతు నాలాంటి ఎంతోమందికి, ముఖ్యంగా బాధిత స్త్రీలకి ఎన్ని కష్టాలు ఎదురైనా న్యాయం పొందేవరకు పోరాడాలనే సంకల్పాన్ని ఇచ్చింది. ఈ తీర్పులో నా జీవితం, నా పిల్లల జీవితాల సంపూర్ణ అర్థాన్ని గ్రహిస్తున్నాను. ఆ ఆలోచనలలోనే బతుకుతున్న నాకు ఈ తీర్పు గొప్ప ఊరట నిస్తుంది. న్యాయం ముందు అందరూ సమానమని ఈ తీర్పు చాటిచెబుతోంది.

”75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున, ఎర్రకోటపై ప్రధానిమంత్రి మహిళల గురించి గొప్పగా మాట్లాడుతున్న వేళ, క్షమాభిక్ష పేరుతో, బ్రాహ్మణులు తప్పులు చేయరన్న నెపంతో, ఊరిపెద్ద ఆడవాళ్లను అగౌరవ పర్చరన్న అభిప్రాయంతో, ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణంగా బిల్కిస్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న మొత్తం నిందితులు జైలు నుండి బయటికి వచ్చేశారు. ఆ రోజుతో బిల్కిస్‌ కథ ముగిసిందని ఆ దుర్మార్గులు భావించి ఉంటారు. కానీ, బిల్కిస్‌ మళ్లీ లేచి నిలబడింది. న్యాయం అర్థిస్తూ సుప్రీం గడప తొక్కింది.

ఆమె ఒంటరి కాదని, అశేష భారతావని ఆమెకు అండగా నిలబడింది. దోషుల విడుదలలో అన్యాయాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది. గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెల్లదని సుప్రీం తాజా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగానే బిల్కిస్‌ పైవిధంగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆమె న్యాయవాది శోభా గుప్తా బిల్కిస్‌ రాసిన ఈ లేఖను బాహ్య ప్రపంచానికి చూపించారు.

ఒక అసహాయ మహిళకు మేమున్నామని అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ బిల్కిస్‌ ఈ లేఖలో కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. ఈ దేశంలో బిల్కిస్‌ లాంటి మహిళలు నిత్యం న్యాయం కోసం పోరాడు తున్నారు. బిల్కిస్‌ విషయంలో జరిగిన న్యాయమే బాధిత మహిళలందరూ పొందాలంటే ప్రశ్నించే గొంతుకలు, మద్దతు నిచ్చే లేఖలు, చేయి చేయి కలిపి నడిచే చేతులు ఎన్నో, మరెన్నో బయటికి రావాలి. ఆ రోజులు త్వరలోనే రావాలని ఆశిస్తూ…

అసలేం జరిగింది ?

              2002 గుజరాత్‌ అల్లర్లలో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది బిల్కిస్‌బాను. ఆమె ఉదంతం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా ప్రతి మహిళా ఉలిక్కిపడుతుంది. అంతలా ఆమెకు అన్యాయం జరిగింది. ఆ దారుణ ఘటనలో కళ్లముందే కన్నబిడ్డను, కుటుంబసభ్యులను కోల్పోయింది. గర్భిణీ అని చూడకుండా పదే పదే అత్యాచారానికి గురైంది.

గుజరాత్‌ కోర్టులో తనకు న్యాయం జరగదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్‌ కేసు ముంబయికి బదిలీ చేశారు. కోర్టులో కేసు నడుస్తుండగానే బెదిరింపులు వల్ల 10 సార్లు ఇంటి అడ్రెస్‌లు మార్చుకోవాల్సివచ్చింది. గుజరాత్‌ నుంచి బయటికి వచ్చేసి సంచార కుటుంబాల మాదిరి ఊళ్లు తిరిగింది ఆ కుటుంబం. ఎట్టకేలకు 2017లో ముంబయి హైకోర్టు 11 మంది నిందితులపై జీవితఖైదు విధించింది.

అయితే 2022 మే నాటికి 11 మంది నిందితుల్లో ఒకరికి 15 ఏళ్లు జైలుశిక్ష పూర్తయిన సందర్భంగా క్షమాభిక్ష పెట్టమని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోరడమూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేయడం.. సదరు కమిటీ ఆ ఒక్క నిందితుడికే కాక మిగిలిన పది మందికీ అంటే మొత్తం 11 మంది నిందితులను విడుదల చేయాలంటూ నివేదిక అందించడం మూడు నెలల్లోనే జరిగిపోయింది. 2022 ఆగష్టు 15న నిందితులు విడుదలయ్యారు. పూలదండలతో, బాజా భజంత్రీలతో బిజెపి నేతలు వారికి ఘనంగా స్వాగతాలు పలికారు. న్యాయం కోసం పోరాడిన బిల్కిస్‌పై నిప్పులు చెరిగారు.

ఆ రోజు.. నిందితులంతా బయటకు వచ్చారన్న వార్త వినగానే బిల్కిస్‌ నిలువెల్లా కంపించిపోయింది. ‘ఈ తీర్పుతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ స్త్రీకైనా న్యాయం ఇలా ముగుస్తుందా? మన దేశంలోని న్యాయవ్యవస్థను నేను ఎంతో విశ్వసించాను. నా జీవితంలో జరిగిన గాయం ప్రతిరోజూ నన్ను వెంటాడుతుంది. మా భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నా దు:ఖం, నా విశ్వాసం నాకు మాత్రమే సంబంధించినది కాదు. నాలాగే న్యాయం కోసం పోరాడుతున్న ఎంతోమంది మహిళలది’ అంటూ ఆవేదన చెందింది. ఆ తరువాత గుజరాత్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

➡️