మ్యూజిక్‌ షాపు మూర్తిగా లీడ్‌ రోల్‌లో …

Dec 24,2023 10:25 #feature

ప్రజాకళల వేదిక ప్రజానాట్యమండలి నుంచి వెండితెరకు వెళ్లిన నటులు ఎంతోమంది ఉన్నారు. నేటి తరంలో అలా వెళ్లి, ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో పత్తిపాటి అజరుకుమార్‌ అలియాస్‌ అజరు ఘోష్‌ ఒకరు. ప్రజా కళాకారుడిగా ప్రారంభమైన ఆయన కళాజీవితం పాన్‌ ఇండియా స్థాయికి వెళ్లింది. దీని వెనుక ఆయన కృషి, పట్టుదల ఎంతో ఉంది. అజరు ఖద్దరు బనియన్‌, పంచె, భుజంపై ఎర్రటి తువ్వాలు ధరించి సింపుల్‌గా ఉంటారు. పాత ప్రకాశం జిల్లా వేటపాలెంలో ప్రారంభమై, వెండితెర వరకూ వెళ్లిన వైనం గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.

వైవిధ్య పాత్రల్లో నటించాలని ఉంది

తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు చేశాను. బాలీవుడ్‌ నుంచి ప్రతినెలా సినిమాల కోసం పిలుపులు వస్తున్నాయి. టాలీవుడ్‌లోనే మరిన్ని సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. నటనలో నాకు కోట శ్రీనివాసరావు రోల్‌మోడల్‌. ఎస్‌వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు మాదిరిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది.

                                                                                           – అజయ్ ఘోష్‌, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌

             ”పాత ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోని వేటపాలెం మా సొంతూరు. నాన్న పత్తిపాటి ఆదినారాయణ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. ఆయనకు ముగ్గురు పిల్లలం. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి అజరుఘోష్‌ పేరు నాకు; డాక్టర్లుగా ఉండి కమ్యూనిస్టులుగా జీవితాన్ని గడిపిన చాగంటి భాస్కరరావు, దేవినేని మల్లికార్జునరావుల పేర్లు మా తమ్ముళ్లకూ పెట్టారు. అమ్మ పేరు రామసీతమ్మ. మా పిల్లల పేర్లు కూడా నాన్నే పెట్టారు. పెద్దోడు చంద్రశేఖర్‌ ఆజాద్‌, చిన్నోడు భగత్‌సింగ్‌. నాన్న దేశభక్తి, అభ్యుదయ భావాలు మా పేర్లలో ప్రతిబింబిస్తాయి.

ఇంటర్మీడియట్‌ వరకూ మా ఊరు వేటపాలెంలో చదివాను. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఎంతో ఇష్టం. అందుకే నాటక ప్రదర్శనలు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లేవాడిని. కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, సదస్సులు సాంస్క ృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఎర్రజెండా సభలు ఎక్కడ జరిగినా వెళ్లేవాడిని.

పనులకు వెళుతూ పోషణ

మాది చాలా సాధారణ కుటుంబం. వివాహమైన తర్వాత కూలి పనులకు వెళ్లేవాడిని. నాటక, కళాప్రదర్శనలు ఉంటే పనులకు వెళ్లేవాడిని కాదు. నా సతీమణి సాంబలక్ష్మి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని సాకేది. గంభీరంగా కనిపించే రూపం, దూకుడుగా వినిపించే మాట కొన్ని సార్లు జీవన వ్యాపకానికి అడ్డంకి అయ్యాయి. ఇతడికి పని ఇస్తే ఏం చేస్తాడులే అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకనే స్థిరమైన ఆదాయమిచ్చే పనిలో కుదురుకోలేకపోయాను. కుటుంబ పోషణలో నా భార్య ముఖ్య పాత్ర పోషించేది. నాకేమో నటనపై ఆసక్తి. తోటి మిత్రుల వద్ద డైలాగులు చెప్పటం, పద్యాలు పాడటం, రాగాలు తీయటం చేసేవాడిని. కళలపై నాకున్న ఆసక్తిని గమనించి హైదరాబాద్‌కు వెళ్తే బుల్లితెర, వెండితెరలపై నటించటానికి అవకాశాలు ఉంటాయనీ, నీకా టాలెంట్‌ ఉందని అనేవారు మిత్రులు. వినీ వినీ కొన్నాళ్లకు సాహసం చేశాను. ధైర్యం చేసి హైదరాబాద్‌ వెళ్లాను.

స్నేహితులే బలం

ఇక్కడ కూడా నాకు మంచి మిత్రబృందం తయారైంది. పైట్‌మాస్టర్‌ రాజుది కూడా మా ఊరే. ప్రజానాట్యమండలి కళాకారులు జగ్గరాజు, అప్పారావుల తోడ్పాటుతో చందన స్టూడియోలో ఆరేళ్లపాటు ఆశ్రయం పొందాను. అక్కడ నటనలో మెళకువలు నేర్చుకున్నాను. అక్కడికి వచ్చే కళాకారులు, రచయితలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు ముళ్లపూడి వర ద్వారా బాపుతో మాట్లాడటానికి అవకాశం కుదిరింది. ఆ తర్వాత భీమ, వల్లభనేని వాసు మాస్టారు తదితరులు దర్శకుడు దేవా కట్టాకు నన్ను పరిచయం చేశారు. ఈ క్రమంలో దూరదర్శన్‌ నటుడు అశోక్‌రావు నటనలో మెళకువలను నేర్పించారు. దూరదర్శన్‌లో పలు సీరియళ్లలో నటించాను. అక్కడి తోటి నటీనటులంతా సినిమాల్లోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించేవారు. ఈ క్రమంలో కొన్ని రోజులపాటు సినీ స్టూడియోల చుట్టూ తిరిగాను. అవకాశాలు రాలేదు.

2010లో దేవా కట్టా ‘ప్రస్థానం’ సినిమాలో గౌడ్‌ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ‘రామచిలకమ్మా’ సినిమాలో లాయర్‌ పాత్రలో నటించాను. పూరీ జగన్నాధ్‌ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నటనకు గుర్తింపొచ్చింది. ఆ తర్వాత ఏడాది వరకూ సినిమా అవకాశాలు రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మామూలుగా కూలి పనులకు వెళ్లిపోయాను. కొన్ని రోజుల తర్వాత కొత్త దర్శకుల నుంచి పిలుపులు వచ్చాయి. కొరటాల శివ ‘ఆచార్య’లో విలన్‌ పాత్రకు పిలిచినా అనారోగ్య కారణాలతో చేయలేకపోయాను. ఆ తర్వాత గాఢ్‌పాదర్‌, వాల్తేరు వీరయ్యలో నటించటానికి అవకాశం వచ్చినా రుద్రమాంబపురం, ఇతర షూటింగుల్లో ఉండి చేయలేకపోయాను. రంగస్థలంలో నా పాత్రకు మంచి పేరొచ్చింది. డైలాగు డెలివరీ అందరినీ ఆకట్టుకొంది. ఇప్పటివరకూ తెలుగులో 50కి పైగా, తమిళంలో 15, కన్నడలో రెండు సినిమాలు చేశాను. వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే గుంటూరుకారం, ఈగల్‌లో నటించాను.

సినీ ప్రస్థానం సాగిందిలా…

రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్‌ పాత్రధారి జగపతిబాబు పక్కన ముఖ్య అనుచరుడుగా పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ఆదరణ, గుర్తింపూ లభించాయి. అప్పటివరకూ చిన్న పాత్రలు పోషిస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబం గడవని పరిస్థితి! తరువాత టాలీవుడ్‌లో మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు వచ్చింది. వెండితెరపై దేవ కట్టా అవకాశం ఇవ్వగా, పూరీ జగన్నాథ్‌ ఒక మెట్టు ఎక్కించారు, సుకుమార్‌ శిఖరాలకు తీసుకెళ్లారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఎంతగానో ప్రోత్సహించారు. వారందరికీ రుణపడి ఉంటాను. అగ్రహీరోలందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. రాజుగారి గది 3 సినిమాలో నా నటనకు 2019లో సైమా ఉత్తమ హాస్యనటుడు అవార్డు పొందాను. నా స్వీయరచనతో వచ్చిన రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ఓటీటీలో విడుదలైంది.

                                                                   – సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు

ఆ స్వరం.. ఓ ప్రత్యేకం…

జయ్ ఘోష్‌ గొంతు గంభీరంగా ఉంటుంది. విలనిజానికి కొత్త బలం అవుతుంది. బి.జయ సినిమాలో తమిళ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. ఆ తర్వాత దేవాపై ఉన్న గౌరవంతో ఆటోనగర్‌ సూర్య సినిమాలో విలన్‌కు డబ్బింగ్‌ చెప్పారు. తరువాత కొన్ని ప్రత్యేక పాత్రలకు డబ్బింగ్‌ చెప్పాల్సిందిగా చాలామంది దర్శకులు కోరినా, ఆయన తిరస్కరించారు. ఎందుకంటే ఆయన నటుడిగా ప్రాచుర్యంలో ఉన్నప్పుడు గొంతును అరువివ్వడం బాగుండదని అనుకున్నారు. అలాగే, డబ్బింగ్‌ చెప్పాలంటే చాలా సమయం కూడా కేటాయించాల్సి ఉంటుంది.

డైరెక్టర్‌ రామదండు సినిమాలో సర్పంచి పాత్రను పోషించారు. జాతీయస్థాయి డైరెక్టర్‌ వెట్రిమారన్‌ విసారణై సినిమాలో అవకాశం కల్పించారు. 2016లో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజరు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. రాబోయే ‘మ్యూజిక్‌షాపు మూర్తి’లో ఆయనే లీడ్‌రోల్‌ చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా కృషిచేస్తే ఏదైనా సాధించొచ్చుననే భావనతో కుటుంబ సంబంధాలకు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రం ఇది.

➡️