వేసవి తాపానికి నిమ్మ రసాలు

Apr 25,2024 05:20 #jeevana

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే – మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాంటివాటిలో నిమ్మకాయ ఒకటి. ఇందులో సహజంగా ఉండే సి విటమిన్‌ మన శరీరాన్ని సంరక్షించడంలో గొప్ప మేలు చేస్తుంది. నిమ్మకాయతో చేసే వివిధ రకాల జ్యూసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెప్పర్‌ లెమన్‌ వాటర్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూను చొప్పున ఉప్పు, మిరియాల పొడి, చాట్‌ మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసి తీసుకుంటే చల్లగా ఉండడమే కాకుండా వేసవి తాపం నుండి ఉపశమనం ఇస్తుంది.
పుదీనా లెమన్‌ వాటర్‌ : ముందుగా పది నుంచి పన్నెండు పుదీనా ఆకులు, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూను ఉప్పు మిక్సీజార్‌లో వేసి రుబ్బుకోవాలి. లేదా దంచుకోవచ్చు. ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకొని అందులో ఈ పేస్టు, రెండు టీ స్పూన్ల నిమ్మరసం, పావు టీ స్పూను జీలకర్ర పొడి కలిపాలి. రెండు ఐస్‌ క్యూబ్స్‌ వేస్తే చల్లగా తాగేయొచ్చు.
జింజర్‌ లెమన్‌ వాటర్‌ : కొద్దిగా పుదీనా, అల్లం తీసుకొని మెత్తని పేస్టు చేసి రసం పిండుకోవాలి. ఒక గ్లాసు మంచినీళ్లలో ఈ రసాన్ని కలిపేయాలి. అందులో సగం టీస్పూను ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార వేసి బాగా కలపాలి. దీనిలో రెండు ఐస్‌ క్యూబ్స్‌ వేస్తే అల్లం లెమన్‌ వాటర్‌ రెడీ.
జీరా లెమన్‌ వాటర్‌ : ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల పంచదార, పావు టీస్పూన్‌ చొప్పున ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఈ నీళ్లల్లో రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసి తీసుకుంటే చల్లగా ఉంటుంది.

➡️