ఆపన్నులకు అమ్మానాన్నలు

navajeevan bala bhavan story jeevana

 

  • ఆపదలో ఉన్నవారికి మేమున్నాం మీకు అండగా అంటూ అక్కున చేర్చుకుంటోంది విజయవాడలోని నవజీవన్‌ బాలభవన్‌ సంస్థ. అమ్మానాన్న ఆదరణకు నోచుకోని వీధిబాలల ఆలనాపాలనా చూస్తోంది. వారి ఆకలిని తీరుస్తూ…విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఈ సంస్థ నీడలో తలదాచుకుంటున్న నిరాశ్రయులు, వీధిబాలలు ఎంతోమంది ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. మరికొందరు విదేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారూ ఉన్నారు. తనవారెవ్వరూ లేకపోయినా మీకోసం మేమున్నాం అంటూ నవ జీవన్‌ సంస్థ ప్రతినిధులు వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. మంచి పౌష్టికాహారం, చక్కటి ఆరోగ్యం, మంచి కుటుంబ వ్యవస్థను సైతం ఏర్పాటుచేస్తున్నారు. జీవితంలో మునుపటిలాంటి విపత్తులు రాకుండా ఎదుర్కొనటానికి అవసరమైన సన్నద్ధతను తెలియజేస్తూ పురోభివృద్ధికోసం పాటుపడుతున్నారు. నవజీవన్‌ బాలభవన్‌ సొసైటీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఎలా చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!

1986లో ఫాదర్‌ రాయ్ మొదట్లో తల్లిదండ్రులు లేని వారిని ఆదరించటం ప్రారంభించారు. ఆ తర్వాత ఫాదర్‌ థామస్‌ కోషి ఆధ్వర్యంలో 1989లో నవజీవన్‌ బాలభవన్‌ పేరిట కార్యక్రమాలు చేపట్టారు. తొలుత నలుగురికి ఆశ్రయం ఇవ్వటంతో ఈ సంస్థ సేవలు మొదలై ఇప్పటివరకు సుమారు 60వేల మంది ఆశ్రయం పొందారు. తల్లిదండ్రులు లేని, వారి ఆదరణకు దూరమైన చిన్నారులు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వీధి బాలలను అక్కున చేర్చుకుంటోందీ సంస్థ. ఎంతో మంది నేడు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. మరికొందరు మెకానిక్‌లుగా, ఎక్ట్రీషియన్లుగాను, కార్పెంటర్లుగా స్థిరపడినవారూ ఉన్నారు. కొంతమంది వివాహాలు చేసుకుని తమ జీవితాలను హాయిగా గడుపుతున్నారు.

  • ఓపెన్‌షెల్టర్‌లో ఆశ్రయం

ప్రధానంగా వీధి బాలలు, తల్లిదండ్రులు లేనివారు, బాల కార్మికులు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, బడి బయట చిన్నారులను గుర్తించి విజయవాడ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని నవజీవన్‌ బాలభవన్‌ ఓపెన్‌ షెల్టర్‌లో చేరుస్తారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సిడబ్లుసి) ద్వారా జువెలెన్‌ జస్టిక్‌ యాక్ట్‌ (జెఎస్‌పి) ప్రకారం అధికారికంగా నవజీవన్‌ కుటుంబంలోకి చేర్చబడుతున్నారు. వారికి నవజీవనే తల్లిదండ్రులుగా మారి విద్యాబుద్ధులు నేర్పిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి కరకట్ట ప్రాంతంలో చిగురు బాలల గ్రామం (బాలబాలికలు), మొగ్గ, యువ భవన్‌, దీప నివాస్‌ పేరిట నిర్వహిస్తూ బ్రిడ్జ్‌ కోర్సులు, ఒకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. పోటీ పరీక్షలకు కూడా అవకాశం కల్పించటంతో రైల్వే, బ్యాంక్‌ తదితర విభాగాల్లో ఉన్నత స్థానాలను సైతం అధిరోహించిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి కొందరి గురించి తెలుసుకుందాం.

  • ఉద్యోగాల్లో రాణిస్తున్నారు

ఓపెన్‌ షెల్టరులో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో చసుచిత్ర, సీపాటి విజయ్ కుమార్‌, వినోద్‌కుమార్‌తోపాటు మరికొందరు ఉన్నారు. సుచిత్రకు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. షెల్టర్‌లో చేర్పించటంతో ఆమెకు ఫాదర్‌ కోశి, బాలశౌరి, ప్రదీప్‌, పికో జోస్‌, రత్న, అంతయ్య, తంబి, సుబ్బలక్ష్మి తదితరులు ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆమె యూనియన్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీధుల్లో యాచిస్తూ తిరుగుతున్న సీపాటి విజయ్ కుమార్‌ను స్థానికులు షెల్టరులో చేర్పించగా బికాం పూర్తిచేసి బ్యాంకు పిఒగా గుంటూరులో ఉద్యోగం చేస్తునారు. వినోద్‌కుమార్‌కు అమ్మానాన్న ఎవ్వరో కూడా తెలియదు. రైళ్లల్లో బోగీల్లో యాచిస్తుండగా షెల్టరుకు పంపారు. ఇక్కడే ఇంజనీరింగ్‌ పూర్తిచేసి రైల్వే లోకోపైలెట్‌ ఉద్యోగం పొందారు. ఇక్కడే మరో యువతితో వివాహం చేసి అందులో ఆమెకు కూడా ఉద్యోగం ఇచ్చారు. బిట్రా లావణ్య, ఆమె చెల్లెలు ప్రసన్నలు ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. కె.జ్యోత్స్నకు చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోవటంతో బంధువులు ఓ ఆర్చరీ అకాడమీలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడ బాలికల వసతిగృహం లేనందున నవజీవన్‌లో చేర్పించారు. 2014లో నేషనల్‌ ఆర్చరీలో హ్యాట్రిక్‌ ఛాంపియన్‌గా నిలిచి ప్రెసిడెంట్‌ అవార్డు ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. బిఎ పూర్తిచేసిన ఆమె చిగురు పాఠశాలకు సిసిఐ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. షెల్టరులో సేదతీరిన ఎందరో పిల్లలు నేడు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు.

 

navajeevan bala bhavan story jeevana
 
  • యువతకు నైపుణ్య శిక్షణ

నీతోడు మానసిక వికాస కేంద్రం (ఎన్‌ఐసిసి) ద్వారా 100 ప్రాంతాల్లో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నాం. విజయవాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఓపెన్‌ షెల్టరు, గుణదలలో దీపా నివాస్‌, నూజివీడుకు సమీపంలోని పోనసానపల్లిలో 25 ఎకరాలల్లో విముక్తి బోస్కో డీ అడిక్షన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నాం. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన (మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు) ఈ కేంద్రాలకు వచ్చి తమలో ఉన్న చెడు అలవాట్లు పోగొట్టుకుంటున్నారు. ఫ్రీ కౌన్సెలింగ్‌… ఫ్రీ గా మందులు ఇస్తున్నాం. హెచ్‌ఐవి బాధిత పిల్లలకు కూడా మంచి విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నాం. పాఠశాల, కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న యువతకు నైపుణ్యశిక్షణను సైతం అందజేస్తున్నాం.

– శేఖర్‌ ప్రోగ్రాం మేనేజర్‌, నీతోడు మానసిక వికాస కేంద్రం

  • ఆపన్నులకు అండగా…

నీ తోడు మానసిక వికాసకేంద్రం ద్వారా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కౌన్సెలింగ్‌ ఏర్పాటుచేయించాం. వైద్య సిబ్బంది సహకారంతో మత్తు పదార్థాల భారినపడిన వారికి ఉచితంగా మందులు ఇస్తూ బోస్కో డీ ఆడిక్షన్‌ సెంటరును నిర్వహిస్తున్నాం. నవజీవన్‌లో ఆశ్రయం పొంది ఉన్నతులుగా ఎదిగిన వారు ‘ఫ్రూట్స్‌ ఆఫ్‌ నవజీవన్‌’ పేరిన ఓ గ్రూపుగా ఏర్పడి ఏటా సంస్థ వార్షికోత్సవం రోజు సమావేశమై సంస్థకు తమ వంతుగా సాయం అందిస్తుంటారు. బాలల పరిరక్షణ వలయాలు (చైల్డ్‌ సేఫ్టీ నెట్‌ (సిఎస్‌ఎన్‌)ను ఏర్పాటు చేశాం. పేదలు, నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల్లో బడిఈడు పిల్లలు బడుల్లో ఉండేలా కషిచేస్తూ 150 గ్రామాల్లో ట్యూషన్‌ పాయింట్లు నిర్వహిస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ సింగ్‌నగర్‌లోని రాజరాజేశ్వరిపేటలో చదువుకోలేని యానాది పిల్లల కోసం షెల్టర్లు నిర్మించి డే స్కూళ్లు సైతం నిర్వహిస్తున్నాం.

– ఫాదర్‌ నీలం రత్నకుమార్‌నవజీవన్‌ బాలభవన్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌

 

  • యడవల్లి శ్రీనివాసరావు
➡️