అడ్డంకులను అధిగమించి…

Apr 16,2024 09:01 #feachers, #Jeevana Stories

‘సంకల్పం వుంటే ఎన్ని అవరోధాలైనా ఎదిరించవచ్చు’ అని ఎంతోమంది ఎన్నోసార్లు నిరూపించారు. విభిన్న ప్రతిభావంతులు కూడా తమ వైకల్యాన్ని అధిగమించి మరీ విజయ శిఖరాలు అధిరోహించారు. గుజరాత్‌కి చెందిన అమితా పాటెల్‌ కూడా వారిలో ఒకరు. పోలియోతో రెండు కాళ్లు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె చదువుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేయాల్సివచ్చింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తనలోని విజ్ఞాన కాంక్షతో న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఒక్క అడుగు కూడా వేయలేని ఆమె, ఉన్నత విద్యావంతురాలిగానే కాక, కవయిత్రిగా, క్రీడాకారిణిగా, సామాజికవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునేంత స్థాయికి వెళ్లారు.

అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరుగాడిన అమిత ఆరేళ్ల వయసులో పోలియో వ్యాధికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఇక నడవలేవని, లేచి నుంచోలేవని ఎంతోమంది సానుభూతి చూపారు. ఆ జాలి మాటలకు తలొంచకుండా, ఆ చిన్న వయసులోనే ఆ బలహీనతను అధిగమించే బంగారు భవిష్యత్తు కోసం కలలు కంది అమిత.


పంచాయతీ స్కూలు తప్ప మరే పాఠశాల లేని కుగ్రామంలో పుట్టిన అమిత లాంటి వారు అంతకుమించి చదివే వీలు ఉండదు. కానీ అమిత తల్లిదండ్రులు తనకా పరిస్థితి రానివ్వలేదు. కూతురు ప్రతి అడుగును తమ కాళ్ల మీద నడిపించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో పంచాయతీ స్కూలు విద్య కూడా పూర్తి చేస్తుందో లేదో అన్న అమిత, న్యాయవాద విద్య వరకు విద్యాభ్యాసం చేశారు.
విద్యావంతురాలిగా మారిన అమితలో విజ్ఞాన జిజ్ఞాస ఇంకా తీరలేదు. ఉద్యోగం కోసం అవసరమైన నైపుణ్యాలన్నింటిలో శిక్షణ తీసుకోవాలనుకున్నారు. కంప్యూటర్‌ విద్యలో రాణించారు. అయినా ఆమె చేసుకున్న ప్రతి దరఖాస్తునూ, వైకల్యం కారణంగా నిర్లక్ష్యం చేశారు. ఇదంతా మూడు దశాబ్దాల క్రితం నాటి సంగతి. ఉపాధి లేకపోతే తనలాంటి వారు ఎంత ఇబ్బందులు పడతారో అమిత తన ప్రయాణంలో స్వయంగా తెలుసుకున్నారు. ఆ అనుభవంతో మరో అడుగు ముందుకు వేశారు.

అవమానాలు వచ్చిన ప్రతిసారీ అమితలో సముద్ర కెరటమంత పట్టుదల పెరుగుతుంది. ఆ సంకల్ప బలంతోనే 1992 నుంచి తన జీవన పంథాని మార్చుకున్నారు. చిన్న గదిలో కంప్యూటర్‌ శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఎంతోమంది విద్యార్థులకు ఉపాధి చూపించారు. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టుకోవాల్సిన ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు ఆమె చొరవతో కంప్యూటర్‌ నైపుణ్యాన్ని సంపాదించారు. విద్య నేర్పించడమే కాదు, విభిన్న ప్రతిభావంతులు వివాహ బంధంలోకి ప్రవేశించేలాగా కృషి చేశారు. ఒకపక్క సామాజిక కార్యకర్తగా సేవామార్గంలో ప్రయాణిస్తూనే, తనలోని సాహిత్య అభినివేశాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. కవితలు రాయడం అభిరుచిగా మార్చుకున్నారు. అయినా, తనలో ఇంకా సాధించాలన్న తపన! అందుకే బాల్యంలో ఎన్నో ఆటలు ఆడుకోవాలనుకున్న ఆశలను, పెరిగి పెద్దయ్యాక తీర్చుకున్నారు. జావెలిన్‌ త్రోలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రశంసలు, అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు.


విభిన్న ప్రతిభావంతురాలిగా సాధారణ జీవితం గడపడమే కష్టసాధ్యమైన పరిస్థితుల్లో అమిత లాంటి ఎంతోమంది ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. వారి స్ఫూర్తితో మరెంతోమంది ముందుకు సాగాలని ఆశిద్దాం.

➡️