కనువిప్పు

May 12,2024 04:20 #jeevana

గుత్తి గ్రామ శివారున పిచ్చయ్య, పిచ్చమ్మ దంపతులకు తిరకాసు అనే కొడుకు ఉండేవాడు. తిరకాసుకి చిన్నప్పటి నుంచి మొక్కలు పీకడమంటే మహా సరదా. కనిపించిన ప్రతి మొక్కనీ పీకేవాడు.
‘మొక్క లేకుంటే మనకి బతుకు లేదురా, వాటికి కాసిన్ని నీళ్ళు పోసి పెంచరా’ అని తల్లి ఎంత చెప్పినా తిరకాసు చెవికెక్కేది కాదు. కొన్నాళ్ళకి తిరకాసు పెరిగి పెద్దవాడయ్యాడు. చదువు సంధ్య అబ్బలేదు. కాలం గడిచింది. తల్లి తండ్రి ముసలి వాళ్లు అయ్యారు. వాళ్ల పోషణ బాధ్యత తిరకాసు మీద పడింది. చిన్నప్పటి నుంచి మొక్కలు పీకివేయడం వల్ల ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చెట్టు అనేది లేకుండా పోయింది. వంట చెరకు, కూరగాయలు, పళ్ళు అన్నిటికీ కొరత ఏర్పడింది. అలసిన తర్వాత కాసేపు సేద దీరుదామంటే చెట్టు నీడలేదు. తిరకాసుకు వయసు మీద పడింది, శక్తి సన్నగిల్లింది. వంట చెరకు కోసం దూరంగా వెళ్ల లేక ఆహారం లేక ఇబ్బంది పడేవాడు. తల్లితండ్రిని పస్తులుంచలేక వంట చెరకు కోసం దూరంగా ఉన్న అడవికి వెళ్ళాలి అనుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే లేచి అడవికి బయలుదేరాడు. చాలాసేపు నడిచాడు. ఎండ విపరీతంగా కాస్తోంది. నోరు తడి ఆరిపోయింది. కొంత సేపటికి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడన కూర్చుని కాసేపు సేద దీరాడు. ఎంతో హాయిగా అనిపించింది. ఆ చెట్టుపై ఎన్నో పక్షులు గూడు కట్టుకుని ఉన్నాయి. చెట్టు కింద ఎండు కలప, పండ్లు రాలి ఉన్నాయి. వాటన్నింటినీ చూసిన తిరకాసుకు తాను చేసిన తప్పేంటో తెలిసివచ్చింది. చెట్లు పెంచకపోవడం వల్లే తను ఇంతదూరం రావాల్సి వచ్చిందని గ్రహించాడు. ఇకనుంచైనా చెట్లను పెంచాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. చెట్టుని పట్టుకుని ‘నన్ను క్షమించు. ఇంకెప్పుడూ నిన్ను చంపను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ ఏడ్వని కొడుకు నిద్రలో అలా ఏడుస్తుంటే పక్కనే ఉన్న పిచ్చమ్మ తెగ కంగారుపడిపోయింది. ‘ఏమైందిరా? లే..’ అని తట్టి లేపింది.
నిద్రలేచిన తిరకాసు కొంచెం సేపు అయోమయంగా ఉండిపోయాడు. పరుగున పెరట్లోకి వెళ్ళాడు. తల్లి చెప్పినా వినకుండా పీకిన మొక్కలను తలచుకొని బాధ పడ్డాడు. పరుగున ఇంట్లోకి వచ్చి కల మొత్తం అమ్మకి చెప్పాడు. ‘అది కలే. అయినా అదే వాస్తవం. ఆస్తులు పెరగక పోయినా పరవాలేదు. ఆక్సిజన్‌ పెరగాలి. లేకుంటే మనకి మనుగడలేదు. గాలి, నీరు, నీడ, ఆహారం అన్నిటికీ మొక్కే ఆధారం. అలాంటి మొక్కలను పెరగనివ్వాలి’ అని పిచ్చమ్మ చెప్పింది.
‘అమ్మా ఇక మీదట నువ్వు చెప్పినట్లే వింటాను. మొక్కలు పీకను. వాటికి నీళ్ళు పోసి పెంచుతాను’ అని అమ్మకి మాటిచ్చాడు తిరకాసు. కొడుకు మాటలు విని పిచ్చమ్మ మురిసిపోయింది. ‘నువ్వు తిరకాసువి కాదు బంగారు కాసువి’ అని ముద్దాడింది.
– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️