‘ప్రేమ’ చికిత్సకు పద్మ శ్రీ

Jan 31,2024 10:23 #feachers, #jeevana

పాటలు పాడడం ఆమెకిష్టం. గొప్ప గాయని కావాలని కలలు కన్నది. స్టేజ్‌ షోలు ఇచ్చింది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇదే ప్రస్థానం కొనసాగితే ఆమె ఓ నేపథ్య గాయని అయ్యుండేది. కానీ ఇప్పుడామె ప్రముఖ వైద్యురాలిగా, వైద్యసేవలో నిరుపమాన సేవలు అందించినందుకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. బెంగళూరుకు చెందిన డా. ప్రేమా ధనరాజ్‌ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది. గాయని కావాలనుకున్న ప్రేమ వైద్యురాలిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆమె జీవితాన్ని మలుపుతిప్పిన ఆ సంఘటన ఏంటి?

బెంగళూరు జె.పి.నగర్‌లో నివసిస్తున్న 72 ఏళ్ల ప్రేమా ధనరాజ్‌ వెల్లూర్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి (సిఎంసి) ప్రొఫెసర్‌గా, హెడ్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణురాలిగా విధులు నిర్వర్తించి 2010లో రిటైర్‌ అయ్యారు. 1980లో సిఎంసిలో హౌస్‌ సర్జన్‌గా మొదలైన ఆమె ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. వైద్యురాలిగా ప్రస్థానం మొదలుపెట్టి మూడు దశాబ్దాల కాలంలో అదే విభాగానికి అధిపతిగా మారడం అంత ఆషామాషీ కాదు. కానీ ప్రేమ సాధించారు. ఎంతో దీక్ష, పట్టుదలకు తోడు ఓ ప్రభావంత సంఘటన ఆమెని ఇంత ఉన్నత స్థితికి చేర్చింది.

సరిగ్గా 64 ఏళ్ల క్రితం అంటే ప్రేమకి 8 ఏళ్లప్పుడు అదే విభాగానికి చికిత్స కోసం వచ్చారు. ముఖమంతా 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చిన ప్రేమకు ఎన్నో శస్త్రచికిత్సలు చేశారు. ‘చికిత్స తీసుకున్న ప్రతిసారీ భరించరాని నొప్పి వచ్చేది. 12 గంటలు ఏకధాటిగా చికిత్స తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతలా బాధపడుతున్న నన్ను అమ్మ ఎంతో ఓదార్చేది. ‘ఏడ్వకమ్మా.. నొప్పి తగ్గిపోతుందిలే. రేపు నువ్వు పెద్దాయ్యాక ఆ డాక్టరు సీట్లో కూర్చొందువు గాని. ఈ బాధతో నీ దగ్గరికి ఎవరు వచ్చినా వైద్యం చేద్దువు గాని’ అని చెప్పేది. కానీ నా మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. చిన్నప్పటి నుండి నేను పాటలు బాగా పాడేదాన్ని. పెద్ద గాయని కావాలని కోరుకున్నాను. స్కూల్లో పాటల పోటీల్లో నాకే ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చేది. అవన్నీ ఒక్కసారిగా నా కళ్లు ముందు ప్రత్యక్షమయ్యాయి’ అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ప్రేమ.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

చిన్నారి ప్రేమ ఒకసారి ఒక పాటల పోటీలో పాల్గొంది. ‘ఆ కార్యక్రమంలో కాసేపు విరామం దొరికింది. కాఫీ తాగాలనిపించి స్టౌ వెలిగించాను. అంతే పెద్ద శబ్దం చేస్తూ స్టౌ అంతెత్తున పైకి ఎగిరింది. అందులోని కిరోసిన్‌ నా ముఖంపై పడింది. ఒక్కసారిగా నా ముఖమంతా భరించరాని వేడి. అదుపు చేయలేని స్థితిలో మంటలు వ్యాపించాయి. పక్కింటివారి చొరవతో ఎలాగోలా బయటపడ్డా ముఖమంతా కాలిపోయింది. మంటల వల్ల శరీరంపై కూడా లోతైన గాయాలు పడ్డాయి’ అని ఆనాటి సంగతి గుర్తుచేసుకున్నారు ప్రేమ.

ఆమె తమ ఇంట నలుగురు పిల్లల్లో పెద్ద సంతానం. చిన్న చిన్న పనులు తానే స్వయంగా చేసుకునే అలవాటుతో ఆరోజు కాఫీ తనే పెట్టుకోవాలనుకుని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంతో ఆమె ముఖం కళావిహీనమైపోయింది. ‘నా పెదవులు హృదయానికి తాకాయి. మెడ కుంచించుకుపోయింది. ఆకర్షణీయమైన నా ముఖమంతా మాంసముద్దలా మారిపోయింది. మంటలకు చర్మమంతా ఉడికిపోయింది. ఆ స్థితిలో బెంగళూరులో ప్రాథమిక చికిత్స ఇప్పించి, వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లారు. 14 శస్త్రచికిత్సలు చేశారు. ప్లాస్టిక్‌ సర్జరీ చేసి నా ముఖానికి కొత్త రూపం తీసుకువచ్చారు. మూడేళ్ల స్కూలు రోజులన్నీ ఆస్పత్రిలోనే గడిచిపోయాయి.

ఆ రోజు ఇప్పటికీ గుర్తే..

ఇంటికి వచ్చాక మా బంధువుల పిల్లలు రోజూ నాతో ఆడుకోవడానికి వచ్చేవారు. కొన్ని రోజులకు ఒక్కొక్కరుగా రావడం మానేశారు. ఎందుకు రావడం లేదని అడిగితే మాకు భయమేస్తోంది అని చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు నా కంటే ఏడాది చిన్నవాడైన నా తమ్ముడు నా వంక అమాయకంగా చూస్తున్నాడు. ఆ తరువాత ఒకసారి ఆడుకుంటూ అమ్మ గదిలోకి వెళ్లాను అక్కడ నిలువెత్తు అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసి భయంతో వెక్కివెక్కి ఏడ్చాను. ప్రమాదం జరిగిన నాటి నుండి అద్దంలో నా ముఖాన్ని చూసుకోకుండా ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే అంతలా ఏడ్చాను’ అంటూ ఆ రోజు సంఘటనని గుర్తుచేసుకున్నారు ప్రేమ.

మానవ సేవలోనూ ముందున్నారు..

ప్రమాదం తరువాత స్కూలుకి వెళ్లినా పిల్లల హేళనలు, అవమానకర మాటలకు భయపడి ఇంటినుండే విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తరువాత ‘అమ్మ ఇచ్చిన మానసిక ధైర్యంతోనే వైద్యవిద్య అభ్యసించాన’ని ఆమె ఎన్నో సార్లు చెప్పారు. అలా హుబ్లీ మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ పూర్తిచేసి, సిఎంసిలో సర్జన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక పక్క వైద్యురాలిగా సేవలందిస్తూనే, తన సోదరి స్థాపించిన ‘అగ్ని రక్ష’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 1999 నుండి ఇప్పటివరకు 25 వేల మంది కాలిన గాయాలకు ఉచిత శస్త్రచికిత్సలు అందించారు. విదేశాల్లోనూ ఆమె సేవలు కొనసాగాయి. ఇథియోపియాలో కాలిన గాయాలకు చికిత్స అందించే విభాగాన్ని నెలకొల్పిన మొదటి భారతీయురాలు ప్రేమ. కెన్యా, టాంజానీయా, నార్వే, ఇథియోపియా దేశాల్లో డాక్టరు విద్య అభ్యసించే వారికి చేయూత అందించారు. యుద్ధ సమయాల్లో బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స చేసేవారు. ‘విదేశాల్లో సేవ చేసినందుకు 1998లో యుఎస్‌ ప్రభుత్వం ప్రకటించిన బహుమతి సొమ్ముతోనే ‘అగ్ని రక్ష’ స్థాపించామ’ని ఒక సందర్భంలో ఆమె చెప్పారు. జీవితాన్ని మలుపు తిప్పింది..’ఆ రోజు ఆ ప్రమాదం జరగకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ఇది నేను కోరుకున్నదాని కంటే ఎక్కువ తృప్తినిస్తున్న జీవితం. నా ముఖంతో నేను ఇంత దూరం ప్రయాణిస్తానని అనుకోలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిలబడాలి. మన స్థితిని ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు, జీవితంలో ముందుకు సాగిపోవడానికే నిరంతరం సిద్ధపడాలి’ అంటున్న పద్మ శ్రీ ప్రేమ తన సంస్థ ద్వారా వైద్య సేవలతో పాటు బాధితులు మానసికంగా కుంగిపోకుండా కౌన్సిలింగ్‌ సెషన్లు కూడా నిర్వహిస్తుంటారు. ప్రమాదం నుంచి కోలుకొని, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడమే కాక, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రేమ జీవితం అభినందనీయం.

➡️