HCU: రోహిత్‌ వేములను ఒత్తిడి చేసినట్లే మాపై కూడా…

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు

హైదరాబాద్ : రోహిత్‌ వేములపై చేసినట్లే తమపై ఒత్తిడికి గురి చేసే ప్రతీకార చర్యలకు హైదరాబాద్ యూనివర్సిటీ యజమాన్యం పాల్పతోందని యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు మండిపడ్డాయి. వైస్ ఛాన్సలర్ నివాసం ఎదుట ధర్నా చేసినందుకు మలయాళీ విద్యార్థులతో సహా ఐదుగురిని సస్పెండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ నివాసంపై చొరబాటు, దాడికి ప్రయత్నించారనే అభియోగాలపై మైనారిటీ-దళిత విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థులను జూలై 1 నుంచి ఆరు నెలల పాటు తరగతులకు దూరంగా ఉండాలని, హాస్టల్‌ను ఖాళీ చేయాలని అడ్మినిస్ట్రేషన్ కోరింది. అలాంటి చర్య జరిగితే, వారి ఫెలోషిప్ రద్దు చేయబడుతుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు హతిక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ… అడ్మినిస్ట్రేషన్‌ అక్రమాలను ప్రశ్నిస్తున్న తమను టార్గెట్‌ చేసి కేసులు పెడుతున్నారని, వాక్‌ స్వాత్రంత్రాన్ని కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ వేముల మరణం తర్వాత మరోసారి ఇక్కడ వెలివాడ వెలిసిందని, హెచ్‌సీయూ విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నిస్తున్న తమను వెలిసేస్తున్నారని, రోహిత్‌ వేముల లాగానే తమపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమ హక్కుల కోసం పోరాటానికి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. . యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి కృపా మరియా మాట్లాడుతూ.. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుల ఒత్తిడి వల్లనే తమపై కేసులు నమోదు చేశారని, విద్యార్థుల హక్కులపై వీసీని ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ, ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్‌ ధీరజ్‌ మాట్లాడుతూ.. సుకూన్‌ యానవల్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులను సస్పెండ్‌ చేశారని, కానీ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫెస్టివల్‌ చేస్తే వీసీ వారికి అన్ని విధాలా సహకరించారని, ఏబీవీపీకి ఓ న్యాయం.. మిగతా విద్యార్థి సంఘాలకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్న వీసీని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే విద్యార్థుల సస్పెండ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

➡️