బాలికా వివాహాలను ఆపి .. భరోసాగా నిలుస్తారు!

Mar 12,2024 08:10 #balya, #feachers, #jeevana

వారిద్దరూ వేర్వేరు ప్రాంతాల వారైనా, వారు ఎంచుకున్న మార్గం ఒక్కటే! తమ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో వయసుకు ముందే పెళ్లిపీటలు ఎక్కిస్తున్న బాలబాలికలను కాపాడడమే వారి దినచర్యగా ఉంటోంది. శరత్‌(16) తన అక్క పెళ్లిని నిలుపుదల చేయడంతో మొదలుపెట్టి ఇప్పటికి రెండు బాల్య వివాహాలను ఆపాడు. అదే రాష్ట్రంలోని సరిత(18) కోవిడ్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఐదు బాల్య వివాహాలను నిలుపుదల చేసింది. ఆ బాలికలను చదువుల వైపు, చక్కని భవిష్యత్తు వైపూ మళ్లించి, వారికి భరోసాగా నిలుస్తున్నారు.
చట్టబద్ధంగా నిర్ణయించబడిన వివాహ వయస్సు కంటే ముందే కౌమార బాల బాలికలకు వివాహాలు జరపటం ఒరిస్సాలోని నబరంగ్‌పూర్‌, కంధమల్‌ జిల్లాల్లో సర్వసాధారణం. పెళ్లితో ఆ బాలికలు తమ కలలను, లక్ష్యాలను దూరం చేసుకుని జీవచ్ఛవాల్లా బతకడం చాలామందికి మామూలు విషయం. కానీ, ఆ ప్రాంతాల్లో ఉంటున్న సరిత, శరత్‌ మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. తమ కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. అదేమని వాదించిన పెద్దలకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు జరిపించడం వల్ల కలిగే అనర్థాలు, అనారోగ్య సమస్యలను ఒక్కో కుటుంబానికి వివరించడం మొదలుపెట్టారు. నాలుగేళ్లుగా ఇదే పని చేస్తున్నారు. శరత్‌ 13 ఏళ్లప్పుడే తన అక్క రష్మితకి జరుగుతున్న బాల్య వివాహాన్ని నిలుపుదల చేశాడు. 16 ఏళ్ల రష్మిత డ్రాపౌట్‌గా ఇంటికే పరిమితమవ్వడంతో కుటుంబంలోని పెద్దలు ఆమెకి పెళ్లి నిశ్చయించారు. ఆ సంగతి తెలిసిన, ముగ్గురు పిల్లల్లో చిన్నవాడైన శరత్‌ పెళ్లి వద్దని వాదించాడు. చదువుకోవాలనుకుంటున్న అక్కను మళ్లీ స్కూల్లో చేర్పించమని చెప్పాడు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో అక్క పెళ్లిని నియంత్రించాడు. ఆ రోజు శరత్‌ చూపించిన చొరవ వల్ల రష్మిత ప్రస్తుతం ప్లస్‌-2 చదువుతోంది. చదువుకుంటూనే తమ్ముడు శరత్‌ చేస్తున్న బాల్యవివాహాల నిలుపుదలలో కూడా తన వంతు సాయం చేస్తోంది.


తన ప్రాంతంలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి శరత్‌ చాలా ఆందోళన చెందుతాడు. ‘ఇక్కడ 15 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు చేయడం చాలా సాధారణం. ఈ పరిస్థితిని మార్చాలన్న లక్ష్యంతో నేను ప్రతి రోజూ నా తీరిక సమయంలో మా చుట్టుపక్కల ఇళ్లకు వెళతాను. వివాహానికి చట్ట బద్ద వయసు గురించి అక్కడి వాళ్లల్లో చాలామందికి అవగాహన లేదు. వాళ్లందరినీ ఒక్కొక్కరిగా కలుస్తాను. మా ప్రాంతంలోని బాలురని కూడా స్థానికంగా వారానికొకసారి నిర్వహించే అద్వైక సెషన్స్‌కి తీసుకెళతాను’ అంటున్న శరత్‌ ఈ పనులన్నింటినీ అక్క రష్మితతో కలసి చేస్తున్నాడు.
సరిత … తన స్నేహితుల్లో చాలా మందికి 18 ఏళ్ల లోపే వివాహం జరగటం ప్రత్యక్షంగా చూసింది. వారంతా ఆకర్షణకు లోనై ఇంటి నుండి వెళ్లిపోయినవారు. ఈ పరిస్థితినే సరిత మార్చాలనుకుంది. ‘ఇక్కడ చాలామంది యువకులు మైనర్‌ బాలికలను ప్రలోభాలకు గురిచేస్తారు. ఎంతలా అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి డబ్బు, నగలతో తమతో వచ్చేసేలా వారిని సిద్ధపరుస్తారు. అలా ఇల్లు వదిలిన ఆడపిల్లలు, గర్భిణీలుగా ఇంటికి తిరిగివచ్చిన సంఘటనలు అనేకం. కోవిడ్‌ సమయంలో ఈ పరిస్థితి బాగా కనిపించింది. ఎప్పుడైతే ఆ పిల్లలు ఇంటికి చేరుతారో వెంటనే ఆ ఇంటివారు ఎవరికో ఒకరికి వారిని ఇచ్చి పెళ్లి చేసేయాలని నిశ్చయిస్తారు. అలా జరగకుండా ఉండాలని స్థానిక అంగన్వాడీ వర్కర్లతో కలసి పనిచేస్తున్నాను.
కోవిడ్‌ నుండి ఇప్పటి వరకు 5 బాల్య వివాహాలను నిలుపుదల చేశాను. ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన బాలికలను ప్రత్యేకంగా కలుస్తాను. వాళ్లంతా బడి మానేసి ఇంటికే పరిమితమైనవారు. అందుకే వారిని తిరిగి స్కూలుకు వెళ్లమని చెబుతాను’ అని తన కార్యాచరణని సరిత వివరిస్తోంది.
ఈ ఇద్దరూ అనుసరిస్తున్న విధానాలు బాల్య వివాహాల్లో పెద్ద మార్పుకు దారితీస్తాయని బలంగా నమ్ముతున్నారు. వీరు ఎంచుకున్న మార్గం ప్రస్తుతం చిన్నదిగా కనిపించవచ్చు. కలిసివచ్చిన చేయూత కూడా తక్కువగా ఉండవచ్చు. కానీ, వీరి అడుగులు ఎంతోమంది యువత అనుసరించదగ్గవి. తమ ప్రాంతంలో జరుగుతున్న మూఢ నమ్మకాలకు, ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత నేటి యువత మీద ఎంతో ఉంది.

➡️