గ్రహాల కథ!

May 10,2024 04:42 #jeevana

బన్నీ పార్కులో ఒక్కడే ఆడుకుంటున్నాడు. ‘హారు బన్నీ!” అంటూ అక్కడకు గుండ్రంగా బంతిలా ఉండే ఆకారం వచ్చింది. ‘ఎవరు నువ్వు? నువ్వు దగ్గరకు వస్తుంటే చాలా వేడిగా ఉంది’ ఆశ్చర్యంగా అడిగాడు బన్నీ.
‘నా పేరు బుధుడు. నేను సూర్యుడికి అతి దగ్గరలో ఉండే గ్రహాన్ని. నన్ను మెర్క్యూరీ అని కూడా అంటారు. నేను పగటి పూట చాలా వేడిగా ఉంటాను. రాత్రి పూట చాలా చల్లగా ఉంటాను’ అంది.
‘అవునా! అదేంటి మరో బంతి వస్తోంది. ఇంకా వేడిగా అనిపిస్తోంది’ అన్నాడు బన్నీ.
‘బన్నీ! నా పేరు శుక్రుడు. నేను సూర్యుడి నుంచి రెండవ గ్రహాన్ని. నేను చాలా వేడిగా ఉంటాను. నేను అన్ని గ్రహాల్లాగా సవ్యదిశలో కాకుండా వ్యతిరేక దిశలో తిరుగుతాను. నన్ను పగటి పూట చూడటం చాలా కష్టం, రాత్రి పూట చూడవచ్చు’ అంది.
‘ఓV్‌ా! అలాగా… మరో బంతి వస్తోంది. కానీ హాయిగా ఉంది’ అన్నాడు బన్నీ.
‘ఎందుకంటే నేను భూమిని బన్నీ! సూర్యుడి నుంచి నేను మూడవ స్థానంలో ఉంటాను. నా ఉపరి భాగంలో డెబ్బయి శాతం నీరు ఉంటుంది. సమస్త జీవరాశులు నివసించే ఏకైక గ్రహాన్ని నేనే తెలుసా!’ అని నవ్వుతూ అంది.
‘అవును భూమీ! ఇప్పుడు నేనుంది భూమి మీదే! నీ వెనుకే మరో బంతి వస్తోంది’ అన్నాడు బన్నీ.
‘బన్నీ! నన్ను అంగారకుడు అంటారు. నేను సూర్యుడి నుండి నాలుగవ స్థానంలో ఉంటాను. నేను భూమిలో సగభాగం ఉంటాను. నా ఉపరితలంలో తుప్పు పట్టిన భాగం ఉంటుంది కాబట్టి, నన్ను రెడ్‌ ప్లానెట్‌ అని కూడా అంటారు’ అంది. ‘అవునా! అందుకేనా నీ మూతి ఎర్రగా ఉంది. నీ వెనుకే మరో పెద్ద బంతి వస్తోంది’ అన్నాడు.
‘అవును బన్నీ, నేను అన్ని గ్రహాల కన్నా పెద్దగా ఉంటాను. నా పేరు గురుడు. నాకు సరైన ఆకారం లేదు. నేను సుడులు తిరిగే మబ్బులతో కప్పబడి ఉంటాను’ అంది. ‘అవును నీ ఆకారం సరిగా లేదు. అదేంటి చుట్టూ రింగులు రింగులతో మరో బంతి వస్తోంది” అన్నాడు బన్నీ.
‘బన్నీ! నేను గ్రహాల్లో రెండవ పెద్ద గ్రహాన్ని. నా పేరు శని. నా చుట్టూ దుమ్ము, మంచు భాగాలతో కూడిన అందమైన వలయాలు ఉంటాయి. అవే నువ్వంటున్న రింగులు’ అంది. ‘భలే ఉంది! అదేంటి మరో బంతి వంగిపోతూ వస్తోంది’ అటే చూస్తూ అన్నాడు బన్నీ.
‘నన్ను యురేనస్‌ అంటారు బన్నీ! నేను సూర్యుడి నుండి ఏడవ స్థానంలో ఉంటాను. నా మీద దళసరిగా ఉండే నీలి రంగు పొర కప్పబడి ఉండటం వల్ల ఇలా వంగిపోయి ఉంటాను. నేను కూడా శుక్రుడు లాగా వ్యతిరేక దిశలో తిరుగుతుంటాను’ అంది.
‘అవునా? అదిగో మరో బంతి వస్తోంది. అదేంటి నాకు చాలా చలిగా అనిపిస్తుంది’ అన్నాడు బన్నీ . ‘నేను సూర్యుడికి దూరంగా ఉండే చివరి, ఎనిమిదవ గ్రహాన్ని. నన్ను నెప్ట్యూన్‌ అంటారు. నేను చాలా చీకటిగా, చల్లగానూ ఉంటాను. అందుకే నీకు చలి వేస్తోంది’ అంది.
‘మీరంతా ఎవరు? నా దగ్గరకు ఎందుకు వచ్చారు?” అన్నాడు బన్నీ. ‘మేము సౌర కుటుంబంలోని ఎనిమిది గ్రహలము. మేమంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాము. నువ్వు నివసించే భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగితే మీకు ఒక సంవత్సర కాలం అవుతుంది’ అందులో పెద్ద గ్రహమైన గురుడు చెప్పింది.
‘బన్నీ!… బన్నీ… ఎవరితో మాట్లాడుతున్నావు?’ నిద్రలేపింది అమ్మ. ‘అమ్మా! నిన్న మా టీచర్‌ సౌర కుటుంబం గురించి చెప్పారు. అది ఆలోచిస్తూ పడుకున్నాను. నాకు కలలో అదే వచ్చింది’ అన్నాడు బన్నీ. ‘అయితే నీకు పాఠం బాగా వచ్చినట్లే! శభాష్‌ బన్నీ’ చప్పట్లు కొట్టి అభినందించింది అమ్మ.

– కె.వి.సుమలత,
94926 56255.

➡️