కఫం సమస్య పోవాలంటే …

Jan 6,2024 09:44 #feature

లికాలం చాలామందికి దగ్గు, జలుబు సమస్యలతో పాటు ఛాతీలో కఫం పేరుకుపోతుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోలేరు. ఇదిలాగే కొనసాగితే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్‌ న్యుమోనియాకి దారి తీస్తుంది. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో కషాయం తయారుచేసుకుని ఈ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఏవేం కావాలంటే.. : అంగుళం అల్లం ముక్క, 8-10 ఎండుమిర్చి, 8-10 తులసి ఆకులు, ఒక పచ్చి పసుపు కొమ్ము, ఒక దాల్చిన చెక్క, ఒక పెద్ద బెల్లం ముక్క, ఒక గ్లాసు నీరు.

తయారీ విధానం : మట్టి కుండలో నీటిని పోసి మరిగించుకోవాలి. అందులో తులసి ఆకులు, ఎండుమిర్చి, పచ్చి పసుపు వేసి కలపాలి. ఆ తరువాత దాల్చిన చెక్క, బెల్లం, అల్లం వేసి ఇంకాసేపు మరిగించుకోవాలి. పోసిన నీరు సగమయ్యే వరకు సుమారు 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దాదాపు సగం గ్లాసు అయిన తర్వాత, వడకట్టుకుని వేడి, వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా 3-4 రోజులు తాగితే జలుబు, దగ్గు సమస్యతో పాటు కఫం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో పచ్చి పసుపును ఉపయోగించడం వల్ల కఫం వదులుతుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. ఎండుమిర్చి తింటే జలుబు, కఫం తగ్గుతాయి. డికాక్షన్‌ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ నిర్ణీత పరిమాణంలో మాత్రమే కలపాలి. ఎక్కువ జోడించడం వల్ల గుండెల్లో మంట, వికారం, అన్నవాహికలో చికాకు వస్తుంది.

➡️