శీతాకాలం.. ఇవి పాటిద్దాం..

Dec 27,2023 10:20 #feature, #winter

ఏటేటా వచ్చేదే కదా శీతాకాలం అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగా ఉంది. పొగమంచు కమ్మి ఉంటుండటంతో ఉదయం 7 గంటలు దాటినా బయటకు రావటానికి భయపడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. రాత్రివేళల్లో గతేడాదితో పోలిస్తే(22 నుంచి 23 డిగ్రీలు) ఈ ఏడాది 20 నుంచి 19 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బయటకు రావాలంటే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖతోపాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

            రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు చలితో వణికిపోతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో ప్రజలు రాత్రిళ్లు, అందులోనూ వేకువ జామున నిద్ర నుంచి లేవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం చేసే పనుల్లో కొన్నింటిని రాత్రివేళల్లో పూర్తిచేయగలిగితే సమయం ఆదా అవుతుంది. ఇరు రాష్ట్రాల్లో శీతల ప్రాంతాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు గుర్తింపు పొందాయి. మన్యం ప్రాంతాల్లో మంచు తెరలు తెరలుగా విపరీతంగా కురుస్తుండటంతో ఆ వాతావరణాన్ని వీక్షించటానికి సందర్శకులు కూడా పెరుగుతున్నారు. లంబసింగి, అరకు, పాడేరు, మారేడుమిల్లి, భైరవకోన, తనకోన, హార్సిలీహిల్స్‌ తదితర ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఈ కాలంలో ఆహార, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

చలిగాలులతో జాగ్రత్తలు సుమా…

           సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తుండటం, ఉదయం ఏడుగంటలైనా తగ్గకపోవటంతో ఇళ్లల్లో పిల్లలు, వృద్ధులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు చలికివణికి పోతున్నారు. పలుచోట్ల రహదారులు కనిపించనంతగా ఉదయం పూట మంచుతెరలు కప్పేస్తుండటంతో ప్రమాదాలు కూడా జరుగుతుండటం, కొందరు మృతిచెందటం, క్షతగాత్రులు కావటం వంటివి జరుగుతుండటంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలంటూ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యం కాపాడుకోవాలి

ఈ కాలంలో వచ్చే ఫ్లూ జ్వరాలు, జలుబుతోపాటుగా ఇప్పుడు కోవిడ్‌ భయం తోడైనందున మరిన్ని జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకూ తాజాగా వండిన ఆహారాన్నే తినాలి. కార్బోహైడ్రేడ్లు అధికంగా ఉండే బియ్యం, చపాతి, కేక్‌లు వంటివి తగ్గించి తాజా పండ్లు, ధాన్యాలు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్‌, దంపుడు బియ్యం, ఓట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ వంటివి మేలు చేస్తాయి. క్యారెట్లు, ముల్లంగి, బంగాళా దుంపలు, ఉల్లి, అల్లం వంటివి కూడా ఆరోగ్యం మెరుగుదలకు దోహదం చేస్తాయి. ప్రొటీన్‌ అధికంగా ఉండే గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్‌ ఎక్కువగా ఉండే మొక్కజొన్న, రాగి, క్వినోవా వంటి తృణధాన్యాలు; విటమిన్‌ సి అధికంగా ఉండే కివి, టమాటా, జామ, నిమ్మ, బొప్పాయి, నారింజ వంటివి శరీరం ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి.

రోగ నిరోధక శక్తికి…

వంటింట్లో లభించే దినుసులతో చేసిన కషాయాలతో కూడా రోగ నిరోధక శక్తి పెంచుకోవటంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన కషాయాలు, హెర్బల్‌ టీలు కూడా మేలు చేస్తాయి. రోజూ నాలుగు లేదా ఐదు తులసి ఆకులు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి రక్షణ కోసం అల్లం వాడాలి. పసుపు, మెంతి, వెల్లుల్లిలో తినే ఆహారంలో భాగస్వామ్యం చేసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

వ్యాయామంతో చురుకుదనం

ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం ఒక అరగంటైనా వ్యాయామం చేస్తూ శరీరం చురుకుదనంతో ఉంటుంది. ఇది అలవాటు చేసుకుంటూ శరీర బరువు నియంత్రణతోపాటుగా మొత్తంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే…

  • కరోనా భయం వెంటాడుతున్నందున ప్రయాణాల్లో మాస్కులు ధరించటం మేలు.
  • ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వైరస్‌ ఎక్కువ కాలం జీవించొచ్చు. ఇతరులకూ వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
  • శానిటైజర్‌, సబ్బుతో చేతులను శుభ్రపర్చుకోవాలి.
  • వాతావరణంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా పెరిగితే బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించటం తప్పనిసరి.
  • ఉదయం,రాత్రిళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సివస్తే స్వెట్టరు ధరించాలి. తలకు టోపీ లేదా మప్లర్‌ వంటివి సుఖవంతంగా ఉంటాయి. పడుకునేటప్పుడు ఉన్నితో తయారుచేసిన దుప్పట్లు కప్పుకోవటం ఉత్తమం.
  • గ్రామీణ ప్రాంతాల్లోనైతే రగ్గులు వంటివి ఎంత చలినైనా తట్టుకుంటాయి.
  • పొగ మంచు కురిసే సమయంలోనైతే శరీరం తడవకుండా మందపాటి దుస్తులు ధరించాలి. జలుబు, దగ్గు, ఆయాసం, సైనస్‌ వంటి సమస్యలు ఉన్నవారు చలిలో బయటకు రాకుండా ఉండటమే మంచిది. కాచి చల్లార్చిన నీటినే తాగటం మేలు.
  • నిల్వవున్న ఆహార పదార్థాలు తినొద్దు.. వేడి వేడివి తినాలి. ఈగలు వాలిన, వీధుల్లో (స్ట్రీట్‌ఫుడ్‌) మానేయటం మంచిది.
  • ప్రతిరోజూ ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడేలా చూసుకుంటే అవసరమైన డి-విటమిన్‌ లభిస్తుంది. శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా సరిపడా నీటిని తాగాలి.
  • సరిపడా నిద్ర పోవాలి. ఒత్తిడి తగ్గటంతోపాటుగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
➡️