1952 తొలి అసెంబ్లీ ఎన్నికలు – హంగ్‌

Apr 9,2024 07:37 #ap assembly, #elections

మనకు స్వాతంత్య్రం వచ్చాక 1952లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి తమిళనాడు ప్రాంతం, కేరళలోని మలబారు ప్రాంతం, మైసూరు రాష్ట్రం (నేటి కర్నాటక)లోని బళ్లారి, హౌస్పేటు, సిరిగుప్ప తదితర ప్రాంతాలు, ఇప్పటి మన రాష్ట్రంగా పిలువబడే ఉమ్మడి 26 జిల్లాలు (అటూఇటూగా), ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాతో కలిపి మద్రాసు రాష్ట్రంగా పిలవబడేది.
మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల చరిత్ర
1952 నాటి మద్రాసు రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్య 309. ద్విసభ్య నియోజకవర్గాలతో కలిపి 375 సీట్లు ఉండేవి. మన ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో 123 అసెంబ్లీ సీట్లు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలతో కలిపి 144 ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఆనాడు మన రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. 1951 నాటి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీలోని ద్విసభ్య స్థానాలతో కలిపి 375 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 367 సీట్లకు పోటీచేసిన భారత జాతీయ కాంగ్రెస్‌ 152 సీట్లు గెలిచి అధికారానికి ఆమడ దూరంలో నిలిచిది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు మరో 36 సీట్లు కావాలి. కమ్యూనిస్టు పార్టీ 62 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే కమ్యూనిస్టు పార్టీ 367 సీట్లకుగాను కేవలం 131 స్థానాలకు మాత్రమే పోటీ చేసి దాదాపు సగం స్థానాలను తెచ్చుకోగలిగింది. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇండిపెండెంట్లు భారీ స్థాయిలో 667 మంది పోటీ చేసి 62 మంది గెలుపొందారు. ఈ ఎన్నికల్లో హంగ్‌ రావడంతో (ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో).. మంత్రివర్గంలో చేర్చుకునే షరతుతో పలు పార్టీలతో, ఇండిపెండెంట్లతో సంఘటన ఏర్పరిచి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్‌కు మద్రాసు రాష్ట్రంలో మాత్రం పూర్తి మెజారిటీ రాలేదు. ఆనాడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌పార్టీలో అంతర్భాగంగా ఉండి స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొనడమే దీనికి కారణం. అందువల్లే నాటి ప్రజలు పూర్తిగా కాంగ్రెస్‌ వైపు మొగ్గలేదు. స్వాతంత్రోద్యమంలో భాగస్వామ్యం వహించిన పార్టీలను కూడా గణనీయంగా ఎన్నుకున్నారు. గణనీయ సీట్లు సాధించిన కమ్యూనిస్టు పార్టీతోపాటు కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ, సోషలిస్టు పార్టీ, కృషికార్‌ లోక్‌ పార్టీ వంటి పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావవంతమైన సీట్లు గెలుపొందాయి.

ముఖ్యమంత్రిగా రాజాజీ, ప్రతిపక్ష నేతగా నాగిరెడ్డి
కొన్ని కమ్యూనిస్టేతర, ఇండిపెండెంట్ల మద్దతుతో.. స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన రాజాజీ అని పిలవబడే చక్రవర్తి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రతిపక్ష నాయకుడుగా ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే 1952 ఎన్నికల తరువాత మద్రాసు రాష్ట్రం ఒక్క సంవత్సరమే కొనసాగింది.

1953లో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు, ప్రతిపక్ష నేతగా నాగిరెడ్డి
1953లో మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భ వించింది. (అదే నేటి 26 జిల్లాలు గల ఆంధ్రప్రదేశ్‌) 1952 ఎన్నికలప్పుడు 12 జిల్లాల ఆంధ్రగా ఉండేది. నేటి ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా కూడా ఆనాడు ఆంధ్రలోనే కలిసి ఉండేది. ఇప్పటి విశాఖ జిల్లా ఆనాడు విజయనగరం జిల్లాలోనూ, ఇప్పటి ప్రకాశం జిల్లా ఆనాడు గుంటూరు జిల్లాలోనూ కలిసి ఉండేది. దీంతో మద్రాసు అసెంబ్లీకి ఆంధ్ర ప్రాంత 12 జిల్లాల నుంచి 1952 ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిపి.. 1953లో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అలా మద్రాసు రాష్ట్రం నుంచి విభజించబడి కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం స్థానాలు 123 కాగా, ద్విసభ్య నియోజకవర్గాలతో కలిపి 141 సీట్లు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీకి 41 స్థానాలు, కాంగ్రెస్‌ 40 స్థానాలు ఉన్నాయి. సాలూరు నుంచి గుంటూరు జిల్లా వరకూ కాంగ్రెస్‌కు పట్టుమని 15 సీట్లు కూడా రాలేదు. మొత్తంగా కాంగ్రెస్‌కన్నా కమ్యూనిస్టు పార్టీకి ఒక స్థానం అధికంగా వచ్చింది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా 72 సీట్లు కావాలి. ఇరు పార్టీలకూ చెరో 30 సీట్ల వరకూ అవసరం. కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీకి 20 సీట్లు, ఇండిపెండెంట్లకు 18 సీట్లు, కృషికార్‌ లోక్‌ పార్టీకి 15, సోషలిస్టు పార్టీకి 6 సీట్లు ఉన్నాయి. దీంతో కమ్యూనిస్టేతర పార్టీలైన మిగతా అన్ని పార్టీలనూ కాంగ్రెస్‌ సంప్రదించి, ఆయా పార్టీలకు, ఇండ ిపెండెంట్లకు మంత్రి పదవులిచ్చి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కూడా గణనీయ సంఖ్యలో 18 మంది గెలు పొందారు. టంగు టూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మద్రాసు శాసనసభకు ఎన్నికైన కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో ఆయన మళ్లీ ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు.

యు. రామకృష్ణ

➡️