కుమారుడితో ఓటు వేయించిన బిజెపి నేత

May 9,2024 23:25 #bhopal

భోపాల్‌ : బిజెపి నేత ఒకరు మంగళవారం జరిగిన పోలింగ్‌లో తన బదులు.. తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన భోపాల్‌లో జరిగింది. బెరాసియా లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్‌ జరిగింది. అక్కడ స్థానిక బిజెపి నేత వినరు మెహర్‌ తన కుమారుడితో కలిసి పోలింగ్‌ బూత్‌కి వెళ్లారు. కమలం గుర్తుపై తన బదులు.. తన కుమారుడితో ఓటు వేయించారు. కమలం గుర్తుపై ఓటు పడిందా లేదా? అని మళ్లీ ఆయన వివిపాట్‌లో చూసుకున్నారు. ఈ దృశ్యాన్ని మొత్తం మెహర్‌ తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పోలింగ్‌ బూత్‌లోకి మొబైల్‌ఫోన్‌ను, పిల్లవాడిని ఎలా అనుమతించారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. బిజెపి నేతపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ను.. పిల్లల ఆట వస్తువుగా బిజెపి మార్చిందని విమర్శించారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ప్రిసైడింగ్‌ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఇసి స్పందించలేదు.

➡️