దివిసీమలో గెలుపెవరిదో?

May 11,2024 23:59 #dhiviseema

ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి :కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు అసక్తికరంగా మారింది. వైసిపి, ఎన్‌డిఎ కూటమి తరపున జనసేన, ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠగా మారింది. వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ సింహాద్రి రమేష్‌బాబు, టిడిపి, బిజెపి బలపరిచిన జనసేన అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, సిపిఎం, సిపిఐ, ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థిగా అందె శ్రీరామమూర్తిలు పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులంతా పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహరచనలో మునిగిపోయారు. 2009లో ఎంఎల్‌ఎ రమేష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి తొలుత పిఆర్‌పి అభ్యర్థిగా, 2014లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఫ్యాన్‌ హవాలో 20,725 ఓట్ల అత్యధికతో గెలుపొందారు. మరోసారి వైసిపి తరుపున పోటీలో ఉన్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లోనూ తనను గట్టెక్కిస్తాయని రమేష్‌ ఆశిస్తున్నారు. ఆయన గెలుపు ఈసారి అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రహదారుల మరమ్మతులతోపాటు ధాన్యం సేకరణపైన తీవ్ర నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. దీంతో రైతులు తమ ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లకు అయినకాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. 75 కిలోల బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు మద్దతు ధరలో కోత పడింది. ఎక్కువ సంఖ్యలో రైతులు పెద్దమొత్తంలో నష్టపోయారు. ఆక్వా సాగు సంక్షోభంలో పడినా స్పందించకపోవడంతో రమేష్‌పై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. నాగాయలంక మండలం ఎదరుమొండి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని, డ్రెయినేజీ ముంపు సమస్య పరిష్కారం కోసం, అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల నిర్మాణం, పాత ఎడ్లంక వంతెనల నిర్మాణం, కరకట్టలను పటిష్ట పరుస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఈ నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా పెద్దఎత్తున జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్‌పై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మాజీ మంత్రి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు తొలుత కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు, రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపి నుండి ఎంఎల్‌ఎగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటును కేటాయించింది. దీంతో బుద్ధప్రసాద్‌కు ఈ సీటు కేటాయించలేమని టిడిపి స్పష్టం చేసింది. దీంతో ఆయన అనూహ్యంగా టిడిపి కండువా మార్చి జనసేన అభ్యర్థిగా రంగంలో దిగారు. ఈ సీటును అశించిన జనసేన నేతలు బుద్ధప్రసాద్‌కు సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. వీరితో చర్చలు జరిపి అసమ్మతి వ్యక్తం చేసిన వారిలో ఎక్కువ మందిని తన వెంట ప్రచారంలో తిప్పుకున్నారు.
ఇదే నియోకజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేనకు 28,556 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి. సంప్రదాయంగా టిడిపికి ఉన్న బలానికి జనసేన ఓట్లు తోడవ్వడం, ప్రభుత్వ వ్యతిరేకత బుద్దప్రసాద్‌కు కలిసి వస్తాయని చెబుతున్నారు. బిజెపితో కలవటం వల్ల ముస్లిములు, మైనార్టీల ఓట్లు ఎటుపడతాయనేది అర్థం కాకుండా ఉంది.
మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్ధి శ్రీరామమూర్తి సైతం నియోజకర్గంలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. రైతాంగ సమస్యలు, మౌలిక వసతుల కల్పన, లక్ష్మీపురంలో కెసిపి చక్కర కర్మాగారం మూతపడటం తదితర సమస్యలు ప్రస్తావిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇండియా వేదిక, కాంగ్రెస్‌ పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక ముగ్గురు అభ్యర్థులు చివరి నిమిషంలో పోల్‌ మేనేజ్‌మెంట్‌కు సన్నాహాలు చేసుకున్నారు. ప్రచారం ముగిసిన వెంటనే దళాలను ఏర్పాటు చేసి డోర్‌ క్యాంపెయిన్‌ చేపట్టారు. మరోపక్క వైసిపి, జనసేన పార్టీలు ఓటుకు రూ.1000 చొప్పున ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పంపిణీ చేశాయి. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలను సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.

➡️