యూపీలో నాల్గవ దశలో బిజెపి ’ఇండియా‘ ఢీ

May 10,2024 08:02 #election

-ఎన్నికలు జరిగే 13 స్థానాల్లో ఆరు కీలకం
– ఒక వైపు కమలం, మరోవైపు ఎస్‌పి-కాంగ్రెస్‌
– విడిగా బిఎస్‌పి
– కన్నౌజ్‌ బరిలో అఖిలేష్‌

ఉత్తరప్రదేశ్‌లో నాలుగో దశలో 13 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్బర్‌పూర్‌, బహ్రైచ్‌, ధౌరాహ్రా, ఇటావా, ఫరూఖాబాద్‌, హర్దోయి, కన్నౌజ్‌, కాన్పూర్‌, ఖేరీ, మిస్రిఖ్‌, షాజహాన్‌పూర్‌, సీతాపూర్‌, ఉన్నావ్‌ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్‌ జరగనుంది. ముఖ్యంగా ఏడు స్థానాల్లో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిల్లో సమాజ్‌వాది పార్టీకి కంచుకోటగా నిలిచిన కన్నౌజ్‌ స్థానం కూడా ఉంది.


కాన్పూర్‌
గతంలో ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌ బలంగా ఉన్నాయి. సిపిఎం నుంచి 1989లో సుభాషిణిఅలీ, బిజెపి అభ్యర్థి జగత్‌వీర్‌ సింగ్‌ మాలేపై సుమారు 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1991లో జగత్‌ వీర్‌ సింఫ్‌ు ద్రోణా (బిజెపి) నుంచి గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో బిజెపినే గెలిచింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపి సత్యదేవ్‌ పచౌరిని పక్కనపెట్టి.. బిజెపి రమేష్‌ అవస్తికి టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి అలోక్‌ మిశ్రా బరిలో ఉన్నారు. బిఎస్‌పి కుల్దీప్‌ బదౌరియానుని నిలబెట్టింది.

ఉన్నావ్‌
2019లో బిజెపి అభ్యర్థి సాక్షి మహారాజ్‌ చేతిలో అనూటాండన్‌ ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఈమె 2020లో కాంగ్రెస్‌ని వీడి ఎస్‌పిలోకి చేరారు. ఇప్పుడు ఎన్నికల్లో ఈమె సమాజ్‌వాది పార్టీ నుంచి పోటీ చేసి సాక్షికి మరోసారి గట్టిపోటీ ఇవ్వనున్నారు. ఈమె హృదరు నారాయణ్‌ ధావన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ని నడుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. ఇక బిఎస్‌పి నుంచి అశోక్‌కుమార్‌ పాండే పోటీ చేశారు. బిజెపి నుంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే సాక్షి మహారాజ్‌నే మరోసారి బిజెపి బరిలో నిలిపింది.

షాజహాన్‌పూర్‌
2014లో బిజెపి నుంచి అరుణ్‌కుమార్‌ సాగర్‌ గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా బిజెపి అరుణ్‌కుమార్‌నే బరిలో నిలిపింది. ఎస్‌పి నుంచి జ్యోస్న గోండ్‌, బిఎస్‌పి నుంచి దౌద్రామ్‌ వర్మ పోటీ చేస్తున్నారు. ఎస్పీ తొలుత రాజేశ్‌ కశ్యప్‌కి టిక్కెట్‌ ఇచ్చింది. కానీ తర్వాత జ్యోత్స్న గోండ్‌ను ప్రకటించడంతో కశ్యప్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

సీతాపూర్‌
ఈ నియోజకవర్గంలో 2019లో బిజెపి నుంచి రాజేశ్‌ వర్మ గెలిచారు. ఈసారి కూడా ఈయన్నే బిజెపి నిలబెట్టింది. నకుల్‌ దూబే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మహేంద్రసింగ్‌ యాదవ్‌ బిఎస్‌పి నుంచి పోటీ చేస్తున్నారు.

ఖేరి
2014, 2019 ఎన్నికల్లో బిజెపి నుంచి అజరు మిశ్రా గెలుపొందారు. మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ఇండియా’ బ్లాక్‌ తరపున ఎస్‌పి అభ్యర్థి ఉత్కర్స్‌ వర్మ, బిఎస్‌పి నుంచి అన్షరు కల్రా బరిలో ఉన్నారు.

 

 

ఫరూఖాబాద్‌

ఈ నియోజకవర్గంలో 2019లో బిజెపి అభ్యర్థి ముఖేష్‌ రాజ్‌పుత్‌ గెలిచారు. ఈసారి కూడా బిజెపి ఆయన్నే నిలబెట్టింది. ఎస్‌పి నుంచి డాక్టర్‌ నవల్‌ కిశోర్‌ శాక్యా పోటీలో ఉన్నారు. బిఎస్‌పి నుంచి క్రాంతి పాండే బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా హర్నందన్‌ సింగ్‌ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్‌పి, బిఎస్‌పి, బిజెపి మధ్యే పోటీ ఉంది.

కణోజ్‌
ఉత్తరాది రాజకీయాల్లో కణోజ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గుర్జర ప్రతీహార రాజవంశానికి చెందిన వారు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. బౌద్ధిజాన్ని విస్తృతంగా వ్యాప్తిచేసే పాలాస్‌లూ ఉన్నారు. మరో రాజవంశానికి చెందిన రాష్ట్ర కూటులు కూడా ఉన్నారు. వీరంతా ఇక్కడ పట్టు కలిగినవారు. కణోజ్‌ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. కవులు కళలకు ప్రధాన నిలయంగా ఉంది. ఈ స్థానం నుంచి ఈ సారి ఎస్‌పి అధినేత అఖిలేష్‌యాదవ్‌ బరిలోకి దిగారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ములాయంసింగ్‌ యాదవ్‌ సంభాల్‌, కణోజ్‌ స్థానాల నుంచి పోటీ రెండు స్థానాల్లోనూ గెలిచాడు. 2014 వరకు ఎస్‌పినే గెలిచింది. 2019లో మాత్రం అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌పై బిజెపి నేత సుబ్రత్‌ పాఠక్‌ గెలిచారు. మళ్లీ ఈ సారి ఆయనే బిజెపి అభ్యర్థి. కాగా ఎస్‌పి నుంచి డింపుల్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌లు కాకుండా అఖిలేష్‌ బరిలోకి దిగడంతో అందరి దృష్టి ఈ సీట్‌పైనే పడింది. అఖిలేష్‌కి స్థానిక బలంతో పాటు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం కలిసొచ్చే అవకాశం.

ఎలక్షన్‌ డెస్క్‌

➡️