గాజా సంఘీభావ శిబిరాలపై ఉక్కుపాదం

  • వందలాది మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల అరెస్టు
  • కాలిఫోర్నియా వర్సిటీ కేంపస్‌లో పోలీసుల క్రౌర్యం

లాస్‌ఏంజెల్స్‌ : గాజాకు సంఘీభావంగా అమెరికాలోని డజనుకుపైగా విశ్వవిద్యాలయాల్లో గుడారాలు వేసుకుని గత రెండు వారాలుగా శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై బైడెన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మొన్న కొలంబియా యూనివర్సిటీ, నిన్న న్యూయార్క్‌ యూనివర్సిటీ సిటీ కాలేజి, నేడు కాలిఫోర్నియా యూనివర్సిటీతో సహా పలు వర్శిటీ కేంపస్‌లపై పోలీసులు దాడి చేసి వందలాది మంది విద్యార్థులను, ప్రొఫెసర్లను, అకడమిక్‌ కమ్యూనిటీ సిబ్బందిని అరెస్టు చేశారు. కొంత మందిని యూనివర్సిటీ యాజమాన్యాలు సస్పెండ్‌ చేశాయి. కేంపస్‌లలో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకే యూనివర్సిటీ యాజమాన్యాలు ఈ దమనకాండకు పూనుకున్నాయనేది స్పష్టం. .విద్యార్థుల నిరసన శిబిరాలను పోలీసులు ధ్వంసం చేశారు. మాడిసన్‌లోని విస్కాన్సిన్‌ యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజుల్లో 400 మందిని అరెస్టు చేశారు. మన్‌హటన్‌లోని రెండు యూనివర్సిటీలపై పోలీసులు బుధవారం అర్ధ రాత్రి దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. కొలంబియా యూనివర్సిటీపై దాడి చేసిన 24 గంటల్లోనే మిగతా యూనివర్సిటీలపై పెద్దయెత్తున పోలీసులు విరుచుకుపడ్డారు. గేట్ల పై నుంచి దూకి,, పిప్పర్‌ స్ప్రేను ప్రయోగించి విద్యార్థులను ఈడ్చుకెళ్లారు. కొలంబియా వర్సిటీలో శిబిరాలను పోలీసులు తొలగించడంతో విద్యార్థులు నిచ్చెనల ద్వారా పైకెక్కి కేంపస్‌లోని హామిల్టన్‌ హాల్‌ రెండో అంతస్తును ఆక్రమించుకున్నారు. ఆ హాలుకు గాజాలో ఇజ్రాయిలీ దళాల చేతిలో హతుడైన బాలుని స్మృతి చిహ్నంగా హిండ్‌ హాలు అని నామకరణం చేశారు. గాజాలోమారణ హోమం ఆపాలని, ఈ మారణ కాండతో ప్రమేయమున్న ఆయుధ కంపెనీల పరిశోధనలకు అమెరికన్‌ యూనివర్సిటీ నిధుల మళ్లింపును తక్షణమే నిలిపివేయాలన్న తమ డిమాండ్లపై చర్చల్లో యాజమాన్యం మోసపూరితంగా వ్యవహరించి నందుకు సమాధానమే ఈ హాలు ఆక్రమణ అని వారు ప్రకటించారు..సిటీ కాలేజీలోనూ పోలీసులకు విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. విద్యార్థులపై దాడిని నిరసిస్తూ కేంపస్‌ వెలుపల పౌర సమాజం ప్రదర్శనలు నిర్వహించింది. న్యూయార్క్‌ సిటీ కాలేజీలో విద్యార్థులకు సంఘీభావంగా జరిగిన ప్రదర్శనలో నిర్వాహకులు మాట్లాడుతూ మిస్టర్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ మీరు ఎంతగా నిర్బంధాన్ని ప్రయోగించినా పాలస్తీనాకు సంఘీభావంగా సాగిస్తున్న ఈ పోరాటాన్ని ఆపడం మీ తరం కాదు అని హెచ్చరించారు. మేడే రోజున అమెరికాలోని చాలా నగరాల్లో కార్మికులు వీధుల్లోకి వచ్చి గాజాకు సంఘీభావం ప్రకటించారు.. మరో వైపు కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెల్స్‌ యూనివర్సిటీల్లో యూదు దురహంకారులు కొందరు ఎదురు దాడికి దిగారు.
గాజాకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులపై కర్రలతో దాడి చేశారు. బాణ సంచాలను విసిరారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులను చూడలేదని పలువురు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌, లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌ కరేన్‌ బాస్‌లిరువురూ ఈ సంఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా యూనివర్సిటీల్లో మొదలైన ఈ గాజా సంఘీభౄవ ఉద్యమం ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, లెబనాన్‌, ట్యునీసియా తదితర దేశాలకు కూడా విస్తరించింది.

➡️